ఆదివారం, 16 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఆపదలో సాయం..

1 గంట క్రితం

apadalo sayam .jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 16, 2026, 08:17 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

అడవి అంచున ఉన్న చిన్న గుడిసెలో వెంకయ్య అనే పేద కట్టెలు కొట్టే వ్యక్తి నివసించేవాడు. అతని కుటుంబానికి ఆధారం ఒక్కటే. తన చేతిలోని పాత గొడ్డలి. ప్రతిరోజూ అడవికి వెళ్లి కట్టెలు కొట్టి అమ్మితేనే ఇంట్లో పొయ్యి వెలిగేది.

ఒక రోజు ఎప్పటిలాగే అడవిలో ఎండిపోయిన చెట్టును నరుకుతున్నాడు. అకస్మాత్తుగా అతని చేతిలోని గొడ్డలి జారి పక్కనే ఉన్న లోతైన లోయలో పడిపోయింది. ఒక్కసారిగా అతని గుండె ఆగినట్టైంది. లోయలోకి తొంగిచూశాడు. గొడ్డలి కనిపిస్తోంది, కానీ దాన్ని తెచ్చే మార్గం కనిపించలేదు. లోయ చాలా లోతుగా ఉంది. దిగడానికి ప్రాణాలకే ప్రమాదం. "ఇక నా పిల్లలకు అన్నం ఎలా పెడతాను?" అనే ఆలోచనతో వెంకయ్య కళ్లలో నీళ్లు తిరిగాయి. నిస్సహాయంగా ఒక చెట్టు కింద కూర్చుని వెక్కివెక్కి ఏడవసాగాడు. అదే సమయంలో వంటచెరకు కోసం అడవికి వచ్చిన సుబ్బయ్య తన నలుగురు స్నేహితులతో కలిసి అక్కడికి చేరుకున్నాడు. వెంకయ్యను ఆ స్థితిలో చూసి ఆప్యాయంగా కారణం అడిగాడు. జరిగిన విషయం తెలుసుకున్న వెంటనే, "నీ బాధ ఇక మా బాధ కూడా" అని ధైర్యం చెప్పాడు. వారంతా తమ వద్ద ఉన్న బలమైన తాళ్లను ఒకదానికొకటి కట్టి జాగ్రత్తగా లోయలోకి దిగారు. ఎంతో శ్రమించి చివరకు గొడ్డలిని వెతికి తీసుకొచ్చి వెంకయ్య చేతిలో పెట్టారు. గొడ్డలిని చూసిన వెంకయ్య ఆనందానికి అవధులు లేకపోయాయి. కళ్లలో ఆనందబాష్పాలు మెరిశాయి. చేతులు జోడించి, "మీరు నాకు గొడ్డలినే కాదు, నా కుటుంబ జీవనాధారాన్ని తిరిగి ఇచ్చారు. మీ ఈ మేలు జీవితాంతం మరువలేను," అని హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపాడు. సుబ్బయ్య చిరునవ్వుతో, "ఆపదలో ఒకరికొకరు తోడుగా నిలవడం మనిషి ధర్మం" అని చెప్పాడు. ఆ రోజు నుంచి వెంకయ్య తన పని మరింత ఉత్సాహంగా కొనసాగించాడు. తనకు కష్టసమయంలో అండగా నిలిచిన సుబ్బయ్య, అతని స్నేహితులను జీవితాంతం కృతజ్ఞతతో గుర్తుచేసుకుంటూ ఉండిపోయాడు.

నీతి: ఆపదలో చేసిన చిన్న సహాయం కూడా ఒకరి జీవితాన్ని మార్చగలదు. మానవత్వం కంటే గొప్ప సంపద మరొకటి లేదు.


ఇసుకుల శ్రీదేవి,

5వ తరగతి, ఎంపిపిఎస్‌, వానపాముల (హెచ్‌డబ్ల్యు),
పెదపారుపూడి మండలం, కృష్ణాజిల్లా.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్