mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బాల్య స్నేహితులు

4 రోజుల క్రితం

friends
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 14, 2026, 12:46 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

వాచ్ మెన్ పండరి తన పది రోజుల సెలవులు తర్వాత బడికి వచ్చాడు. వచ్చి రాగానే, ఆవరణ మొత్తం తిరిగి చూశాడు. బడి తోటను పరిశీలించి ఎండుకొమ్మలు, ఆకులు తొలగించాడు. తను సెలవు పై వెళ్లేటప్పుడు ఇంకొక వాచ్ మెన్ కు జాగ్రత్తలు చెప్పే వెళ్ళాడు. అయితే తిరిగి వచ్చాక, బడి పరిసరాలు, గదులు ఎలా ఉన్నాయోనన్న ఆత్రుతతో కలియతిరిగాడు. ఇంటర్వెల్ సమయంలో పిల్లలందరినీ పలకరించాడు. చాలామంది పిల్లలు పండరి పట్ల ఆప్యాయంగా ఉంటారు.
​ఆ సమయంలోనే ఆరవ తరగతి చదివే సోము, కళ్యాణ్ లు కూడా పండరికి కనిపించారు. వారిద్దరూ మంచి స్నేహితులు, ఎప్పుడూ కలిసే ఉండేవారు. కానీ ఆరోజు విడివిడిగా కనిపించారు. పైగా ఇద్దరి ముఖాల్లో చిరునవ్వు లేదు. ఏదో జరిగిందని పండరి ఊహించాడు. మధ్యాహ్నం భోజనాల సమయంలో కూడా.. ఒకేచోట కూర్చుని, ఆహారం పంచుకొని తినే వాళ్ళిద్దరూ ఎడమొహం, పెడమొహం పెట్టుకొని వరండా చెరో చివర కూర్చున్నారు. ఎవరితో మాట్లాడకుండా నిశ్శబ్దంగా భోజనం చేశారు. పండరి ఈ విషయాన్ని గమనించాడు. ఇద్దరి మధ్య ఏదో గట్టి వ్యవహారమే జరిగిందని నమ్మాడు.
ఆరవ తరగతి విద్యార్థిని ఒకణ్ణి పిలిచి, వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందని విచారించాడు. “ఇద్దరి మధ్య గొడవ అయినట్లుంది అంకుల్. కానీ ఇద్దరూ ఏమీ చెప్పటం లేదు. మౌనంగానే ఉంటున్నారు. ” వాడి సమాధానం విన్నాక… ఇక నేరుగా వాళ్లనే పిలిచి అడిగితే సరిపోతుంది అనుకున్నాడు. సాయంత్రం ఆటల పీరియడ్ లో సోమును పక్కకు పిలిచి, “నీ ఫ్రెండేడి. రోజూ ఇద్దరూ కలిసే ఆడుకునేవాళ్ళు కదా?” అని అడిగాడు.
“వాడితో నేను మాట్లాడటం లేదు అంకుల్. వాడు మంచోడు కాదు. ”
“అవునా?”
“అవును. ”
“మంచోడు కాదని ఎప్పుడు తెలిసింది?” ఆసక్తిగా అడిగాడు పండరి.
“మీరు ఈమధ్య లేరు కదా.. ఒకరోజు వర్షం పడి, గేటు ముందు బురదైంది. అందరమూ జాగ్రత్తగా బురద దాటుకొని, లోపలికి వస్తున్నాం. నేనూ అదేవిధంగా వస్తుంటే, పొరపాటున కాలుజారి బురదలోపడ్డాను. వాడు నా వెనకాలే ఉన్నాడు కదా! నన్ను చూసి నవ్వాడు. అందరూ నవ్వారు. నేను వెంటనే ఇంటికి వెళ్ళిపోయాను. ఆ రోజు నుంచి వాడితో కటీఫ్.” జరిగిందంతా చెప్పాడు సోము. ఇంతలో దూరంగా మైదానంలో కళ్యాణ్ కనిపించాడు.
“సోమూ.. నువ్వు ఈ చెట్టు వెనక దాక్కో. కళ్యాణ్ ను పిలిచి అడుగుతాను, వాడేం చెబుతాడో విందాం. ఒకవేళ మంచోడు కాకుంటే, ఇకనుంచి నేను కూడా వాడితో మాట్లాడనులే.” అని దగ్గర్లోని ఓ చెట్టు చూపించాడు. సోము వెళ్లి దాని వెనకాల దాక్కున్నాడు.
పండరి చప్పట్లు చరిచి, కళ్యాణ్ ను దగ్గరకు పిలిచాడు. సోమును అడిగినట్లే తనను కూడా అడిగాడు. వాడు కూడా బురద సన్నివేశాన్ని వివరించి చెబుతూ, “నేను నవ్వగానే వాడు కోపంగా వెళ్ళిపోయాడు అంకుల్. తర్వాత నాకే బాధేసింది. వాడికి ‘సారీ’ చెబుదామని ఎన్నిసార్లు దగ్గరికి వెళ్లిన కోపంగా అరుస్తూ వెళ్లిపోతున్నాడు. ఏం చేయాలో తెలియక దూరంగా ఉంటున్నాను. నవ్వడం నా తప్పే. ” బాధపడుతూ చెప్పాడు కళ్యాణ్.
వాడు చెప్పిందంతా చెట్టు చాటు నుండి సోము విన్నాడు. ఆ మాటలు విన్నాక, కళ్యాణ్ పట్ల కాస్త కోపం తగ్గినట్లు అనిపించింది. పండరి పిలవడంతో చెట్టు చాటు నుండి బయటికి వచ్చాడు. తనను చూసి కళ్యాణ్ ఆశ్చర్యపోయాడు.
పండరి సూచనతో కళ్యాణ్ సోమూకు ‘సారీ’ చెప్పాడు. అప్పటికే కాస్త మెత్తబడి ఉన్న సోము, “సరేలే..” అన్నాడు ముభావంగా.
“అలా కాదు.. మీరు ఇంతకు ముందులాగానే ఉండాలి. చిన్న చిన్న విషయాలకే స్నేహాన్ని వదులుకోకూడదు. మీరు పెరిగి పెద్దయ్యాక మిగిలేది ఈ చిన్ననాటి నేస్తాలే.” నవ్వుతూ చెప్పాడు పండరి.
“మరి మీ చిన్నప్పుడు స్నేహితులెవరు?” ఇద్దరూ ఒకేసారి అడిగారు.
“అరే మీకు తెలియదా? మీ సైన్స్ మాస్టారు, నేను చిన్ననాటి స్నేహితులం. బడిలో ఉన్నంతవరకు ఆయన మాస్టారు, నేను వాచ్ మెన్. బయటికి వెళ్లాక, ఇద్దరం స్నేహితుల్లా మారిపోతాం.” ఓ రహస్యాన్ని పండరి వాళ్ళకి చెప్పాడు.
“అవునా?” అని ఆశ్చర్యపోతూ.. ఆ విషయాన్ని మిగతా వారికి చెప్పేందుకు, భుజాలపై చేతులు వేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇద్దరు.

srinivas

శాఖమూరి శ్రీనివాస్
94410 75753

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్