ప్రతిరోజూలాగే అందరూ వరుసలో నిలబడి అల్పాహారం కోసం వెళ్తున్నారు. వారితో పాటే వివేక్, మరో ఇద్దరు అబ్బాయిలు కూడా వరుసలో నిలబడ్డారు. విద్యార్థులందరినీ క్రమ పద్ధతిలో పంపిస్తున్నారు.
‘అందరూ వరుసలో రండి!’ అంటూ పెద్ద గొంతుతో కేకలు వేస్తూ, అందరినీ పరిశీలిస్తూ పాఠశాల ఆవరణలో బెత్తం పట్టుకుని తిరుగుతున్నారు వెంకటేష్ మాస్టారు. ‘మాస్టారు బెత్తం పట్టుకుని తిరుగుతున్నారు అంటే అందరికీ అర్థమయ్యే ఉంటుంది...’ అని వ్యంగ్యంగా అంటూ రాము మాస్టారు విద్యార్థులతో మాట్లాడుకుంటూ ముందుకు సాగారు.
సజ్జ కంకి చుట్టూ పిట్టలు ముసిరినట్లు, భోజనశాలలో విద్యార్థులందరూ రౌండ్ టేబుల్ చుట్టూ చేరుకుని సహపంక్తి భోజనాలు చేస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం 8:30 నిమిషాలకు పాఠశాల బస్సు రాగానే, క్రమశిక్షణకు మారుపేరైన చీమల దండులా విద్యార్థులు వరుస క్రమంలో దిగి తరగతులకు చేరుకుంటారు. కానీ ఆ రోజు మాత్రం సీతాకోకచిలుకలు పువ్వులను చేరినట్లుగా కాకుండా, చిందరవందరగా తిరుగుతూ ఒకరితో ఒకరు ఘర్షణ పడుతున్నారు.
సురేందర్ టైం టేబుల్ ప్రకారం బడి గంటను ‘గణగణ’ మోగించాడు. వెంకటేష్ మాస్టారు కేకలు వేస్తుండగా, మిగతా ఉపాధ్యాయులు అందరినీ వరుస క్రమంలో నిలబెట్టారు. ప్రధానోపాధ్యాయులు వేదిక పైకి రావడంతో పాఠశాల ఆవరణంతా నిశ్శబ్దమైంది.
పాఠశాల నిబంధన ప్రకారం రోజుకో తరగతి విద్యార్థులు అసెంబ్లీ నిర్వహిస్తారు. ఆ రోజు ఆరవ తరగతి విద్యార్థుల వంతు. "విశ్రామ్.. సావధాన్.." అంటూ ఒక విద్యార్థి ఇచ్చిన ఆదేశాలతో, సిరి, సౌజన్య ‘వందేమాతరం’ ఆలాపనతో అసెంబ్లీ ప్రారంభమైంది. అనంతరం అదే తరగతికి చెందిన రుద్రాణి ‘నేటి ప్రశ్న’ అంటూ.. ‘ప్రపంచంలో పొడవైన నది ఏది?’ అని హుందాగా అడిగింది. నాలుగో తరగతి విద్యార్థిని రాణి అంతే హుందాగా ‘నైలు నది’ అని సమాధానం చెప్పింది. అసెంబ్లీ అంతా చప్పట్లతో మారుమోగింది. ఆనవాయితీ ప్రకారం రాము మాస్టారుని ‘మంచి మాట’ చెప్పాల్సిందిగా విద్యార్థులు ఆహ్వానించారు. చిరునవ్వుతో ప్రసంగాన్ని మొదలుపెట్టిన రాము మాస్టారు .. ‘పిల్లలూ! చదువుతో పాటు క్రమశిక్షణ చాలా ముఖ్యం. క్రమశిక్షణ ఉన్న విద్యార్థికి చదువు సులభంగా వంటబడుతుంది. మీరు తల్లిదండ్రులను గౌరవించాలి. ఒక్కసారి ఆకాశంలో ఎగిరే కొంగలను చూడండి.. అవి ఎంత క్రమశిక్షణతో వరుసలో వెళ్తాయో! మనం కూడా వాటిలాగే క్రమశిక్షణను అలవర్చుకోవాలి.’ అన్నారు.
మరుసటి రోజు ఉదయం అల్పాహార సమయానికి, అసెంబ్లీ సమయానికి విద్యార్థులందరూ ఎవరూ చెప్పకుండానే ఎంతో క్రమశిక్షణతో వరుసలో నిల్చున్నారు. ఇది చూసి మల్లేష్ మాస్టారు ఆశ్చర్యపోతూ ‘శాంతయ్య మాస్టారూ! ఇది కలనా.. నిజమా?’ అని అడిగారు. ‘నేనూ కూడా అదే సందేహంలో ఉన్నాను మాస్టారూ’ అన్నారు శాంతయ్య మాస్టారు. ఎప్పుడూ కేకలు వేసే వెంకటేష్ మాస్టారు కూడా ఆశ్చర్యపోయారు. అసెంబ్లీ ప్రారంభమయ్యాక వివేక్ అనే విద్యార్థి వేదిక పైకి ఎక్కి ‘పెద్దల మాట సద్దిమూట అని మేము తెలుసుకున్నాము. రాము మాస్టారు చెప్పినట్లు మేము క్రమశిక్షణతో ఉంటామని మేమంతా ప్రతిజ్ఞ చేస్తున్నాము.’ విద్యార్థుల్లో వచ్చిన ఈ మార్పును చూసి ఉపాధ్యాయులందరూ సంతోషించారు. అప్పటి నుండి ఆ బడిలో బెత్తం బహిష్కృతమైంది.. ప్రేమే ఆయుధమైంది!.
-ఉప్పరి తిరుమలేష్
9618961384








కామెంట్‌లు (0)