ఉదయం పాఠశాల గంట మోగింది. పిల్లలంతా నవ్వుకుంటూ, మాట్లాడుకుంటూ తమ తమ తరగతి గదుల్లోకి వెళ్లిపోయారు. కొత్తగా సున్నం కొట్టిన గోడలు, రంగురంగుల బొమ్మలు, ప్రేరణాత్మక సూక్తులతో పాఠశాల చాలా ఆహ్లాదంగా కనిపిస్తోంది. ఐదో తరగతి చదువుతున్న రాహుల్ ఆ గోడలపై "నా పేరు రాస్తే ఏమవుతుంది?" అని నవ్వేస్తుండేవాడు. మరుసటి రోజు తరగతి గదికి కొత్తగా రంగులు వేశారు. పిల్లలంతా అందంగా ఉన్న గోడలను చూసి మురిసిపోయారు.
‘మన స్కూలు ఎంత అందంగా ఉందో!’ అని సంతోషపడ్డారు. కానీ మరుసటి రోజు ఉదయం అందరూ ఆశ్చర్యపోయారు. తెల్లగా మెరిసే గోడపై పెద్ద అక్షరాలతో...
‘రాహుల్’ అని రాసి ఉంది. తరగతి ఉపాధ్యాయురాలు సుజాత ఆ గోడను చూసి ఒక్క క్షణం మౌనంగా నిలిచారు.
‘ఈ గోడను అందంగా చేయడానికి రంగుల వేసే వాళ్లు ఒక రోజు శ్రమించారు. చెడగొట్టడానికి మాత్రం ఒక్క నిమిషమే పట్టింది...’ అని నెమ్మదిగా అన్నారు.
ఆ మాట విన్న పిల్లలందరూ గోడవైపు చూశారు. రాహుల్ మాత్రం తలదించుకున్నాడు. ఉపాధ్యాయురాలు బ్లాక్‌బోర్డుపై పెద్ద అక్షరాలతో ఒక సామెత రాశారు.
‘చెరపకురా... చెడేవు.’ అని. ‘దీని అర్థం ఎవరు చెబుతారు?’ అని అడిగారు. చిన్నారి మేఘనా లేచి, ‘మనది కాని వస్తువులను పాడు చేయకూడదు. అందంగా ఉన్న వాటిని చెడగొట్టకూడదు’ అంది.
‘చాలా బాగా చెప్పావు,’ అని ఉపాధ్యాయురాలు చిరునవ్వు నవ్వారు.
‘ఈ పాఠశాల మన అందరిది. ఈ గోడలు, బెంచీలు, కుర్చీలు, చెట్లు, పుస్తకాలు... ఇవన్నీ మనకు ఉపయోగపడేవే. వాటిని కాపాడితే మన సంస్కారం తెలుస్తుంది. చెడగొడితే మన నిర్లక్ష్యం బయటపడుతుంది.’ ఆ మాటలు రాహుల్ మనసుకి నేరుగా తగిలాయి. మధ్యాహ్నం అతను ప్రధానోపాధ్యాయుల గదికి వెళ్లాడు.
‘సార్... గోడపై పేరు రాసింది నేనే. నన్ను క్షమించండి. ఇకపై ఎప్పుడూ అలా చేయను,’ అని కళ్లలో నీళ్లతో అన్నాడు.
ప్రధానోపాధ్యాయులు అతని భుజంపై చేయి వేసి, ‘తప్పు చేసినవాడికంటే, తప్పు ఒప్పుకుని మారినవాడే గొప్పవాడు,’ అన్నారు. మరుసటి రోజు రాహుల్ స్వయంగా తడి గుడ్డ తీసుకుని గోడను శుభ్రం చేశాడు. పాఠశాల ఆవరణలో పడిన కాగితాలను కూడా ఏరి చెత్తబుట్టలో వేశాడు. మారిన రాహుల్ ని చూసి సుజాత టీచర్ అభినందించింది.
డా. సారిపల్లి నాగరాజు
8008370326







కామెంట్‌లు (0)