తరగతి గది. నాలుగు కిటికీలు, ఒక పెద్ద ద్వారం. గోడకు నల్ల రంగు వేసిన బోర్డు. డయాస్ మీద ఒక పెద్ద టేబుల్. కింద వరుసగా డెస్క్‌లు, వాటి వెనుక బెంచీలు. ‘ఎంత పెద్ద తరగతి గది! మా ఊర్లో ఉన్న పాకబడిలో బల్లలే లేవు. అంతా కింద కూర్చోవడమే. పాపం మాస్టారు నిలబడే పాఠం చెప్పాలి. ఆయన కూర్చోవడానికి ఒక చిన్న బల్ల ఉంటుంది అంతే..’ అని శ్రీను ఆలోచిస్తుండగా, ‘ఏయ్.. నిన్నే..’ అనడంతో వాస్తవంలోకి వచ్చాడు. ‘నీ పేరు ఏంటి?’ అడిగాడు అప్పుడే లోపలికి వచ్చిన ఒక అబ్బాయి.
‘నా పేరు శ్రీను. పక్కనున్న సరిపల్లె నుంచి వచ్చాను’ అన్నాడు నెమ్మదిగా. ‘ఓ.. పల్లెటూరి పిల్లాడివా? ఎప్పుడూ ఇలాంటి బడి చూసి ఉండవు’ అన్నాడు అతను వెటకారంగా. ‘అవును, మాది పాకబడి’ అన్నాడు శ్రీను. ‘నీ పేరు?’ అని అడిగాడు. ‘నా పేరు శేఖర్. నేను మొదటి నుండి ఇక్కడే చదువుతున్నాను. క్లాసు ఫస్ట్ కూడా నేనే’ అన్నాడు. ఇలా వీళ్లు మాట్లాడుతుండగానే మిగతా విద్యార్థులు వచ్చారు. అందరికీ అలవాటేమో, ఎవరి బెంచీల్లో వాళ్లు కూర్చున్నారు. శ్రీను అక్కడ నుంచి లేచి, వెనుక కూర్చున్నాడు. బెల్ కొట్టగానే మాస్టారు క్లాసులోకి వచ్చారు. ‘కొత్తగా జాయిన్ అయింది ఎవరు?’ అని అడిగారు. ‘నేను సార్, నా పేరు శ్రీను’ అన్నాడు. ‘శ్రీను ఏంటి? పూర్తి వివరాలు చెప్పు’ అన్నారు మాస్టారు. ‘నా పేరు పొన్నగంటి శ్రీనివాస్ సార్. నేను ఇక్కడికి దగ్గరగా ఉన్న సరిపల్లె నుంచి వచ్చాను. మా అమ్మ పేరు లక్ష్మి’ అన్నాడు శ్రీను. ‘మరి మీ నాన్నగారి పేరు?’ అడిగారు మాస్టారు.
‘నాకు నాన్న లేడు సార్’ అన్న శ్రీను మాటకి, ‘అయ్యో.. సరే కూర్చో. బుద్ధిగా చదవాలి’ అన్నారు. ‘సరే సార్’ అన్నాడు శ్రీను. ఒకరిద్దరు శ్రీను వంక చూసినా, శేఖర్ వారించడంతో ఎవరూ శ్రశ్రీనుతో మాట్లాడలేదు. కానీ శ్రీను ఎప్పుడూ చదువుకుంటూ ఉండేవాడు. వారం గడిచింది.
ఒకరోజు హెడ్ మాస్టారు క్లాసులోకి వచ్చారు. "డియర్ స్టూడెంట్స్, ఈరోజు ఒక లెక్క ఇస్తాను. మీలో ఎవరు చేయగలరో చూద్దాం" అంటూ బోర్డు మీద ఒక లెక్క ఇచ్చారు. శేఖర్, శ్రీను తప్ప మిగతా ఎవరూ ఆ లెక్క చేయడానికి ముందుకు రాలేదు. ముందుగా లెక్క చేయడానికి వెళ్లాడు శేఖర్. బోర్డు మీద సగం చేసిన తర్వాత ఆలోచనలో పడ్డాడు. హెడ్ మాస్టారు చెప్పగానే శ్రీను ఆ లెక్కను సాధించాడు. క్లాసు అంతా చప్పట్లు కొట్టారు. శేఖర్ ముఖం వాడిపోయింది. ఆ రోజు నుండి శ్రీను మీద మరింత కోపం పెంచుకున్నాడు శేఖర్. ఎప్పుడూ శ్రీను గురించే ఆలోచించడం మొదలుపెట్టాడు. దానితో అతను చదువులో కొద్దిగా వెనుకబడ్డాడు. కానీ శ్రీను అలా కాదు, శేఖర్‌ని ఒక స్నేహితునిగా భావించాడు. మొదటి యూనిట్ టెస్టులో శ్రీనుకు ఎక్కువ మార్కులు రావడం, శేఖర్ రెండవ స్థానంలో నిలవడం జరిగింది. దానితో శేఖర్ డీలా పడిపోయాడు. శేఖర్ తల్లి శాంతి స్కూలుకు వచ్చింది. ఎప్పుడూ క్లాసు ఫస్ట్‌గా ఉండే తన కొడుకు సెకండ్ ప్లేస్ రావడమే కాకుండా, ఎప్పుడూ అన్యమనస్కంగా ఉండటానికి కారణం తెలుసుకోవాలని అనుకుంది. ‘నమస్తే ఆంటీ!’ అంటూ శాంతిని పలకరించాడు శేఖర్ స్నేహితుడు సత్యం.
‘సత్యం, ఇలా రా!’ అంటూ ఒకచోట కూర్చోబెట్టి శేఖర్ గురించి అడిగింది శాంతి. ‘ఆంటీ, ఈ మధ్య మా స్కూల్లో శ్రీను అనే అబ్బాయి జాయిన్ అయ్యాడు. చాలా మంచివాడు, బాగా చదువుతాడు. శేఖర్ తనకు వాడు పోటీ అని అతని మీద కోపం పెంచుకుంటున్నాడు. మమ్మల్ని కూడా అతనితో మాట్లాడనివ్వడం లేదు. ఎప్పుడూ వాడి ఆలోచనే, పాఠాలు కూడా శ్రద్ధగా వినడం లేదు’ అని చెప్పాడు సత్యం. విషయం తెలుసుకున్న శాంతి, తన కొడుకు సమస్యకు కారణం అర్థమై, ఇంటికి వెళ్లిపోయింది.
మరుసటి రోజు ఆదివారం శేఖర్ అమ్మ ఇచ్చిన జంతికలు తింటూ టీవీలో ఐపిఎల్ క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాడు. మ్యాచ్‌లో అప్పుడే ఒక ఫీల్డర్ క్యాచ్ పట్టడంతో అందరూ అతని దగ్గరకు వచ్చి అభినందించారు. ‘శేఖర్ చూశావా?’ అంది శాంతి. ‘చూశానమ్మా.. చాలా బాగా క్యాచ్ పట్టాడు’ అన్నాడు. ‘అవును, కానీ అతను క్యాచ్ పట్టినందుకు అందరూ అభినందించారు తప్ప, ‘‘నా కంటే బాగా క్యాచ్ పట్టాడు’’ అని అతనిపై ఎవరూ కోపం పెంచుకోలేదే’ అంది.
‘అదేంటమ్మా! అలా అంటావు? అంతా కలిసి ఆడితేనే కదా ఆ టీమ్‌కి, ఆ రాష్ట్రానికి పేరు వచ్చేది’ అన్నాడు శేఖర్. ‘కదా! మరి నువ్వు మీ క్లాసులో నీ కంటే కొద్దిగా బాగా చదివిన శ్రీనుపై ఎందుకు కోపం పెంచుకుంటున్నావు? మీరంతా బాగా చదివితేనే కదా మీ క్లాసుకి, మీ స్కూల్‌కి పేరు వచ్చేది’. అంది. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు శేఖర్. ఆ తర్వాత తల దించుకున్నాడు. ‘తల దించుకున్న శేఖర్‌ని నేను ఎప్పుడూ చూడలేదు. నా కొడుకు ఎప్పుడూ ఒకరి ఎదుగుదలను చూసి ఓర్వలేనివాడు కాకూడదు. వారితో సమానంగా పోటీ పడి, గెలిచేవాడు కావాలి. అలాగే అందరితో స్నేహంగా మెలిగేవాడు కావాలి’ అంది. ‘తప్పు చేశానమ్మా! నన్ను క్షమించు. ఇకపై శ్రీనుతో స్నేహంగా ఉంటాను’ అన్నాడు శేఖర్. ‘గుడ్! ఇదీ శేఖర్ అంటే..’ అంటూ తల నిమిరింది తల్లి శాంతి. మరుసటి రోజు స్కూల్లో పిల్లలు మొక్కలు నాటుతున్నారు. శ్రీను కూడా గుంట తీసి, మొక్క నాటాడు. గుంట తీయడానికి కష్టపడుతున్న శేఖర్‌ని చూసి ‘నేను సహాయం చేయనా?’ అన్నాడు శ్రీను. ‘చేస్తావా?’ అన్నాడు శేఖర్ ఆశ్చర్యంగా. అంతే, శ్రీను చక్కగా గుంత తీసి, శేఖర్ వేయవలసిన మొక్కను కూడా నాటాడు. తర్వాత ఇద్దరూ ఆ మొక్కకి నీరు పోశారు. ‘మనం వేసిన ఈ మొక్కలు మన స్నేహంలాగే ఎదగాలి, మంచిపువ్వులు పూయాలి’ అన్నాడు శేఖర్. ‘భలే!’ అన్నాడు శ్రీను. వాళ్లని అలా చూసిన మిగిలిన మిత్రులు ఆనందంగా వాళ్ల దగ్గరకు చేరారు.
కూచిమంచి నాగేంద్ర
91821 27880








కామెంట్‌లు (0)