ఒక గ్రామలో చలపతి అనే పేద రైతు వుండేవాడు. తనకున్న రెండెకరాల పొలంలో తన ఇద్దరు కొడుకులతో కలసి చాలా కష్టపడి పనిచేసేవాడు. వచ్చిన ఆదాయాన్ని జాగ్రత్తగా పొదుపు చేసి అది పెద్ద మొత్తం కాగానే, అదే గ్రామంలో వుండే భుజంగం దగ్గర రెండెకరాల వ్యవసాయ భూమిని కొన్నాడు. భుజంగం అంత మాట మనిషి కాదు. కిరికిరి మనిషి. కాలికేస్తే మెడకు, మెడకేస్తే కాలికి తగిలించే రకం. అందుకే వెంటనే భుజంగానికి పూర్తి డబ్బులు చెల్లించి, రాతకోతలు కూడా పూర్తి చేసుకున్నాడు.
ఒక రోజు చలపతి ఎంతో సంతోషంతో కుటుంబంతో కలసి కొన్న పొలంలోకి వచ్చి, పొలం దేవతకు పూజలు చేసి, నైవేద్యం పెట్టి, భూమిని సాగు చేద్దామని, బావిలో నీళ్ళతో పొలం పారించసాగాడు. అప్పుడు భుజంగం అక్కడికి వచ్చి కోపంగా “ఈ బావిలో నీళ్ళు నావి. నీవు వాడుకోవడానికి వీల్లేదు.” అన్నాడు. చలపతి బిత్తరపోయాడు. “అదేమిటి నీకివ్వాలసిన డబ్బు పూర్తిగా చెల్లించి, రాతకోతలు కూడా పూర్తి చేసుకున్నాం కదా!” అన్నాడు.
“నేను నీకు పొలమూ, బావిని అమ్మాను గానీ బావిలో నీళ్ళు అమ్మలేదు. బావిలో నీళ్ళు నీవు వాడుకోవాలంటే ఒక బొక్కెనకు రెండు రూపాయల చొప్పున చెల్లించాలి” అని గొడవ పెట్టుకున్నాడు. చలపతి నెత్తినోరు కొట్టుకుంటూ ‘ఇది ఎక్కడి అన్యాయం? బావిని అమ్మితే నీళ్ళు కూడా అమ్మినట్టేగా’ అంటూ ఎంత వేడుకున్నా భుజంగం మొండిగా వాదించాడే తప్ప ఒప్పుకోలేదు. చలపతి కళ్ళనీళ్ళ పర్యంతం అవుతూ, దిగాలుగా ఇంటికి వచ్చాడు.
చలపతికి పొరుగునే వున్న లోకనాథం సంగతి తెలిసి చలపతిని ఓదార్చి, అతనికి మర్యాద రామన్న గురించి చెప్పి, ఆయన దగ్గరికి వెళితే తప్పక న్యాయం జరుగుతుంది అని చెప్పాడు.
లోకనాథం సలహా ప్రకారం చలపతి నగరం చేరి, మర్యాద రామన్నకు భుజంగంపై ఫిర్యాదు చేశాడు. మర్యాద రామన్న చలపతి చెప్పింది పూర్తిగా విన్న తర్వాత భుజంగం కుయుక్తి, అతని వితండవాదన అర్థమయ్యింది. అయితే తాను తీర్పు ఇస్తానని ఆ తీర్పు విన్నాక ఏం చేయాలో చలపతికి వివరించాడు. అది విన్నాక చలపతి ఊపిరి పీల్చుకున్నాడు.
భుజంగాన్ని పిలిపించారు. విచారణ ప్రారంభం అయ్యింది. ఇద్దరు చెప్పిందీ పూర్తిగా విన్న తర్వాత మర్యాద రామన్న “భుజంగం చెప్పేది సమంజసంగానే ఉంది. దస్తావేజు ప్రకారం భుజంగం చలపతికి పొలం, బావి అమ్మినట్టుగా ఉంది తప్ప, బావిలోని నీళ్ళను అమ్మినట్టు ఎక్కడా లేదు. కాబట్టి ఆ బావిలోని నీళ్ళు ఇంకా భుజంగానివే. చలపతి ఆ నీళ్ళను వాడుకోవాలనుకుంటే భుజంగం చెప్పినట్టుగా బొక్కెనకు రెండు రూపాయల చొప్పున చెల్లించడమే న్యాయం!” అంటూ తీర్పు ఇచ్చాడు.
అది వినగానే చలపతి ఉసూరంటూ కూలబడిపోయాడు. “అయ్యా! మీకిది ధర్మం కాదు!” అంటూ చలపతి మొత్తుకున్నాడు. “నేను ఇక్కడ ధర్మం గురించి మాట్లాడటం లేదు. చట్టం ప్రకారం ఆ నీళ్ళు ఇంకా భుజంగానివే. ఆయన అడిగినట్టు చెల్లించు. ఇదే నా తీర్పు” అన్నాడు మర్యాద రామన్న. భుజంగం మీసం మెలేస్తూ ఆనందంగా అక్కడి నుండి వెళ్ళబోయాడు.
చలపతి భుజం మీద ఉన్న కండువా తీసి ఒక్కసారి దులిపి “అయ్యా! మీ తీర్పు నేను ఒప్పుకుంటున్నాను. కానీ బొక్కెన నీళ్ళకు రెండు రూపాయలు చెల్లించే శక్తి నాకు లేదు. కావున నా బావిలో వున్న భుజంగం నీళ్ళను ఉన్నపళంగా తోడుకు పొమ్మని చెప్పండి” అన్నాడు.
వెళ్ళబోతున్న భుజంగానికి ఆ మాటలు వినిపించి గతుక్కుమన్నాడు.
“చలపతి వాదన కూడా సమంజసంగానే వుంది. అతనికి భుజంగం నీళ్ళను కొనే ఆర్థికస్థోమత లేదనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని, భుజంగం వెంటనే ఆయన నీళ్ళు చలపతి బావిలో నుండి మొత్తం తోడుకొని వెళ్లిపోవాలి. ఒక వేళ అలా తీసుకొని వెళ్ళలేకపోతే, చలపతి బావిలో భుజంగం నీళ్ళు ఉండనిచ్చినందుకుగానూ భుజంగమే చలపతికి రోజుకు వేయి రూపాయల చొప్పున అద్దె చెల్లించాలి.” అంటూ మర్యాద రామన్న తీర్పును సవరించాడు.
అది వినగానే ఈసారి భుజంగం కుప్పకూలిపోయాడు. ఇంకా ఏమీ మాట్లాడలేకపోయాడు. తప్పు ఒప్పుకోక తప్పింది కాదు. వెంటనే మర్యాద రామన్న కాళ్ళ మీద పడ్డాడు.”అయ్యా! బుద్ధి గడ్డి తినింది. తప్పు కాయండి”అన్నాడు.
అది విని మర్యాద రామన్న “నీకు తప్పక బుద్ధి చెప్పవలసిందే. మీలాంటి వాళ్ళ వలన సమాజంలో చలపతి వంటి అమాయకులు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. నీవు నీ కుయుక్తితో చలపతి కుటుంబానికి కలిగించిన మానసిక క్షోభకు, దారి ఖర్చులకుగానూ నష్ట పరిహారం కింద పది వేల రూపాయలు వెంటనే చెల్లించు” అన్నాడు.
భుజంగానికి పరిహారం చెల్లించక తప్పలేదు. చలపతి మర్యాద రామన్నకు కృతఙ్ఞతలు తెల్పుకొని, సంతోషంగా వూరికి బయలుదేరాడు.


డా. దాసరి వెంకటరమణ
హైదరాబాదు, 9000572573
(ఉక్రేనియన్ జానపద కథ ఆధారంగా)








కామెంట్‌లు (0)