రామాపురం ప్రభుత్వ పాఠశాలలో ఆ సాయంత్రం పిల్లలంతా ఎంతో ఉత్సాహంగా ఆడుకుంటూ ఉన్నారు. ఆ మరుసటి వారం జరగబోయే జిల్లా స్థాయి చిత్రలేఖనం పోటీలలో పాల్గొనవలసిన పిల్లలను ఎంపిక చేసే భాధ్యతను తెలుగు టీచర్ సుజాతమ్మకు అప్పగించారు పాఠశాల హెడ్మాస్టర్. ఖాళీ సమయాల్లో పిల్లలకు చిత్రలేఖనంలోని మెలకువలు నేర్పి, వారి చేత బొమ్మలు గీయిస్తూ ఉంటుంది సుజాతమ్మ. ఆ కారణంగా చిత్రలేఖనంలో ప్రతిభ గల పిల్లలపై ఆమెకు అవగాహన ఉంది._
వివిధ తరగతులకు చెందిన రాహుల్, అన్వర్, మేరీ, చింటూలను పిలిచారు టీచర్._ రాహుల్ ఏడవ తరగతికి లీడర్, ఏ విషయమైనా ఇట్టే అర్థం చేసుకోగలడు. కాస్త ధనిక కుటుంబం. అదే తరగతి చదివే అన్వర్ మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు. రంగులను అద్భుతంగా కలపగలడు. ఆరవ తరగతి చదివే మేరీకి ఊహాశక్తి ఎక్కువ. కొత్త కొత్త ఆలోచనలతో బొమ్మలు గీయగలదు. అదే తరగతి చదివే చింటూ పేద కుటుంబానికి చెందినవాడు. పెన్సిల్ ఆర్ట్ చాలా బాగా గీయగలడు._
సుజాతమ్మ వారితో, “పిల్లలూ! చిత్రలేఖనం పోటీలు రెండు కేటగిరీలలో జరుగుతాయి. జట్టుగా కానీ లేక విడివిడిగానైనా పాల్గొనవచ్చు. జిల్లా స్థాయిలో వ్యక్తిగత విభాగంలో పోటీ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కనుక మీరందరూ జట్టుగా చేరి పోటీలో పాల్గొంటే విజయం సాధించవచ్చు.” అని చెప్పారు._ టీచర్ ప్రతిపాదన పిల్లలకు నచ్చలేదు.
“మేడమ్! నేను విడిగానే పోటీ చేస్తాను.” అన్నాడు రాహుల్.
“జట్టుగా పోటీ చేసి, విజయాన్ని వేరొకరితో పంచుకోవడం నాకు ఇష్టం లేదు.” ముక్కుసూటిగా చెప్పింది మేరి._
“అవును మేడం విడివిడిగా పోటీ చేయడమే ఉత్తమం” అన్నాడు అన్వర్.
విడిగా పోటీ చేయడానికి కావలసిన కాన్వాస్, క్రేయాన్స్, కలర్ బాక్స్, పెయింట్ బ్రష్ మొదలైనవి కొనుక్కోగల ఆర్థిక పరిస్థితి చింటూకు లేదు. అందుకే ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు._
“మరైతే మీరు ఈ రాత్రికి మీకు నచ్చిన బొమ్మను గీసుకొని రండి. ఎవరి బొమ్మ బాగుంటుందో వారినే ఈ పోటీకి పంపిస్తాను” అని చెప్పారు టీచర్._
ఇంటికి వెళ్ళాక చింటూ బొమ్మ గీయడం మొదలుపెట్టాడు. కొత్త క్రేయాన్స్ లేకపోవడంతో విరిగిపోయిన పాత ముక్కలతో తన చిత్రంలోని ఆకాశానికి నీలం రంగు అద్దే ప్రయత్నం చేశాడు. రంగు సరిగా రాకపోగా పేపర్ కూడా చిరిగిపోయింది. చింటూ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి.
మరుసటి రోజు ఉదయం ఆ నలుగురు పిల్లలు తాము గీసిన బొమ్మలతో టీచర్ ముందు నిలబడ్డారు. రాహుల్ తన ఖరీదైన కలర్ బాక్స్ ఉపయోగించి, బొమ్మ గీశాడు. అన్వర్ చక్కని రంగులతో తన చిత్రాన్ని సిద్ధం చేశాడు. మేరీ సరికొత్త ఆలోచనతో బొమ్మ గీసింది. టీచర్ కు ఆ ముగ్గురి బొమ్మల్లోనూ జీవం కనబడలేదు. పిల్లలు కూడా ఆ విషయంలో టీచర్ తో ఏకీభవించారు. చింటూ మాత్రం తలదించుకుని నిలబడ్డాడు.
“ఏమైంది చింటూ? బొమ్మ గీయలేదా?” అని అడిగారు టీచర్._ చింటూ ఏడుస్తూ తన చిరిగిన పేపర్‌ను, విరిగిన రంగు ముక్కలను చూపించాడు.
“నా దగ్గర మంచి రంగులు లేవు టీచర్… అందుకే బొమ్మ పాడైపోయింది” అన్నాడు. తాము గీసిన బొమ్మలు టీచర్ ను నిరాశ పరిచాయని పిల్లలు గ్రహించారు._
పోయిన ఏడాది వరదలు వచ్చినప్పుడు అందరి ఇళ్లూ మునిగిపోతే, కులమతాలు, పేద-ధనిక తేడాలు లేకుండా ఊరి వాళ్లంతా కలసికట్టుగా ఒకే క్యాంపులో తిని, ఒకరినొకరు కాపాడుకున్న సంఘటన రాహుల్ మనసులో మెదిలింది._
“టీచర్! మీరు చెప్పిందే సరైనది. మా నలుగురిలో ఎవరో ఒకరు మాత్రమే పోటీకు వెళ్లడం కంటే.. జట్టుగా పాల్గొనడమే మంచిది.” అన్నాడు. తక్కినవారు కూడా అందుకు అంగీకరించారు. పిల్లలలో వచ్చిన మార్పుకు సుజాతమ్మ సంతోషించారు. వారికి మరిన్ని మెలకువలు నేర్పి, సాధన చేయించారు._
జిల్లా స్థాయి పోటీల రోజు రానే వచ్చింది. నలుగురు పిల్లలూ జట్టుగా చేరి బొమ్మ గీయడం మొదలుపెట్టారు. ఒక పెద్ద మర్రిచెట్టు… దాని నీడలో ఊరి పిల్లలంతా కలిసి ఆడుకుంటున్నారు. పక్కనే గుడి, మసీదు, చర్చి ఒకే వరుసలో ఉన్నాయి. పొలాల్లో రైతులందరూ కలిసి పని చేసుకుంటున్నారు. పైన ఆకాశంలో రంగు రంగుల పక్షులన్నీ కలిసి గుంపుగా ఎగురుతున్నాయి. చింటూ అద్భుతంగా పెన్సిల్ స్కెచ్ వేస్తే.. అన్వర్, రాహుల్, మేరీలు తమ రంగులన్నింటినీ కలిపి ఆ బొమ్మకు ప్రాణం పోశారు.
జడ్జీలు రామాపురం పిల్లలు గీసిన బొమ్మను చూసి ముగ్ధులయ్యారు. జట్టుగా పోటీ చేసే విభాగంలో వారిని విజేతలుగా ఎంపిక చేశారు._ ముఖ్య అతిథి వేదికపై మాట్లాడుతూ.. “మిగతా పిల్లలు బొమ్మలు బాగా గీశారు. కానీ రామాపురం పిల్లలు ‘బొమ్మతో పాటు ఒక గొప్ప సందేశాన్ని’ గీశారు. రంగుల్లో తేడాలు ఉండొచ్చు, కానీ అవన్నీ కలిస్తేనే ఒక అందమైన చిత్రం అవుతుంది. అలాగే మనుషుల్లో పేద, ధనిక, కులమతాల తేడాలు ఉండొచ్చు.. కానీ అందరూ ఐకమత్యంతో, సమానత్వంతో మెలిగితేనే సమాజం అద్భుతంగా ఉంటుంది.” అంటూ బహుమతి ప్రధానం చేశారు._
నలుగురు పిల్లలు ఒకరి చేతులు ఒకరు పట్టుకుని, సంతోషంగా ట్రోఫీని అందుకుంటుంటే సభా ప్రాంగణమంతా చప్పట్లతో మారుమోగిపోయింది.
“మీరు నలుగురూ ఇలాగే కలిసిమెలిసి సాధన చేస్తే, వచ్చే ఏడాదికి వ్యక్తిగత విభాగంలో కూడా మీరు బహుమతులు గెలుచుకోవచ్చు.” అన్నారు సుజాతమ్మ. అందుకు పిల్లలు నలుగురూ సంతోషంగా అంగీకరించారు._
పేట యుగంధర్
9492571731








కామెంట్‌లు (0)