ఆదివారం, 06 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionతెల్ల కాగితం..

1 గంట క్రితం

THELLA KAGITHAM- BALALA KATHA PHOTO.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 06, 2026, 07:52 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

తలుపు తోసుకొని గదిలోనికి వచ్చిన గౌతమ్ ను చూసి, ఆశ్చర్యపోయినా తేరుకొని ‘రా.. కూర్చో’ అంటూ నా టేబుల్ కి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చోమన్నాను. గౌతమ్ నా అసిస్టెంట్ రాము కొడుకు. నాలుగో తరగతి చదువుతున్నాడు. ఉదయం ఆఫీస్ లో ముభావంగా ఉన్న రామునూ ‘ఎందుకలా ఉన్నావ్’ అని అడిగితే.. ‘గౌతమ్ ఇంట్లో టి. వి. చూస్తూ, ఫోన్లో ఆడుకుంటూ ఉంటున్నాడని, నిన్న కూడా స్కూల్ నుంచి ‘‘కడుపునొప్పి’’ అని ఫోన్ చేయిస్తే, గాబరాపడి ఇంటికి తీసుకొని వెళ్తే మొబైల్లో గేమ్స్ ఆడుకుంటూ ఇంట్లో కూర్చున్నాడు’ అని బాధపడుతూ చెప్పాడు.

ఈరోజు కూడా స్కూల్ నుంచి అదే ఫోన్ అన్నాడు. ‘అందరి ఇళ్లలోనూ ఇదే స్థితి’ అని నచ్చచెప్పి, ఇప్పుడు స్కూల్ నుంచి తీసుకొని వస్తే, గౌతమ్ ను నా దగ్గరకు పంపమని చెప్పాను. గౌతమ్ కి వాడు పుట్టినప్పటి నుంచి నాతో చనువు ఎక్కువ. అందుకే చొరవగా నా ఆఫీస్ గదిలోనికి వచ్చాడు.

‘ఏంటీ! కడుపు నొప్పా?’

‘అవును అంకుల్! చాలా నొప్పి, వామిటింగ్స్’ మాటల్లో నొప్పి ముఖంలో లేకపోవడం చూసి, నవ్వుకున్నాను.

‘అసలు కడుపునొప్పి, వాంతి ఎందుకు వస్తాయి గౌతమ్?’ ఏమో అన్నట్లు పెదవి విరిచి, టేబుల్ మీద ఉన్న పేపర్ వెయిట్ ను గుండ్రంగా తిప్పసాగాడు.

‘మీ ఇంట్లోనికి ఏదైనా కుక్కగాని, ఆవుగాని వచ్చేస్తే నువ్వేం చేస్తావు?’

‘మరేమో.. కర్ర పట్టుకుని బయటకు వెళ్లగొడతా’ నవ్వుతూ ముద్దుగా చెప్పాడు.

‘ఏం.. ఇంట్లోనే ఉంచొచ్చు గా’

‘ఛీ ! బాత్రూం ఎల్లేస్తాయి. ఇల్లంతా కంపు, అమ్మ తిడుతుంది కూడా’

‘అవునా! అంటే అవి మన ఇంట్లోనికి రాకూడదు అన్నమాట. మరి అలాగే మన పొట్టలోనికి ఏదైనా చెడు పదార్థం వస్తే, శరీరం కూడా వాటిని బయటకు పంపే ప్రయత్నమే వాంతి. తెలుసా!?’

కళ్ళు పెద్దవి చేసి, అర్థమయినట్లు తలవూపుతూ ‘నిన్న పానీపూరి తిన్నాను. అది నా బాడీ కి ఇష్టం లేనట్లు ఉంది. అందుకే కడుపునొప్పి, వామిటింగ్స్. మరి తిననయితే’

‘అవునా! ఆకాశం నీలంగా ఎందుకు ఉంటుందో నీకు తెలుసా?’ అడిగాను. తల అడ్డంగా వూపాడు.

‘మరి పిల్లి కళ్ళు చీకట్లో మెరుస్తాయి కదా, ఎందుకో తెలుసా? పాలు తెల్లగా ఎందుకుంటాయి?’ టపటపా అడిగాను.

‘నాకే కాదు, మా స్కూల్లో కూడా ఎవరికీ తెలియదు’ చేతులు తిప్పుతూ చెప్పాడు.

‘నాకూ చాలా కాలం తెలిసేవి కావు. నేను కూడా మొబైల్లో గేమ్స్ ఆడుతూ ఉండేవాడిని. నాకు ఇలాగే వేరేవారు అడిగితే ఆన్సర్ తెలియక సిగ్గుపడి, మొబైల్ గేమ్స్ పక్కన పెట్టి, పుస్తకాలు చదివితే ఇలాంటి బోలెడు సంగతులు తెలిసాయి. అంతే! నేను మా మీటింగ్స్ లో ఇలాంటి ప్రశ్నలు అడిగేవాడిని. ఎవ్వరూ జవాబు చెప్పలేకపోయేవారు. అప్పుడు నేనే చెప్పేవాడిని. అందరూ నన్ను గ్రేట్ గ్రేట్ అనేవారు తెలుసా!’

‘అయితే నాకు ఆ ఆన్సర్స్ తెలిస్తే , మా స్కూల్లో కూడా నన్నూ గ్రేట్ అంటారు కదా’ కళ్ళు పెద్దవి చేస్తూ అడిగాడు గౌతమ్.

‘ఖచ్చితంగా. మీ టీచర్లు అందరూ ‘గౌతమ్ ఇజ్ వెరీ ఇంటలిజెంట్. నైస్ బాయ్ అంటారు. నీ డైరీలో వెరీ గుడ్ అని కూడా రాస్తారు’ ‘అంకుల్ ! మా ఇంట్లో ఆ పుస్తకాలు లేవు. మా డాడీ కొంటే నేనూ చదువుతాను. అప్పుడు మీరు ఏ క్వచ్చిన్ అడిగినా చెప్తాను’ అన్నాడు.

‘వెరీ గుడ్! మొబైల్ పక్కన పెట్టి, ఈ పుస్తకాలు చదువు. నా దగ్గర ఉన్నచొప్పదంటూ ప్రశ్నలు, ఎన్ సైక్లోపిడియా ఇచ్చాను. పుస్తకాలు గుండెకు హత్తుకున్న గౌతమ్ ను చూస్తే, మొబైల్ స్థానాన్ని పుస్తకాలు ఆక్రమించుకున్నాయన్న నమ్మకం కలిగింది.

జి. వి. శ్రీనివాస్

77024 55559

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్