ప్రజాశక్తి-మారేడుమిల్లి
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం, అంగన్వాడీ కేంద్రాల్లో పాలు, గుడ్లు, చిక్కీలు నిబంధనల ప్రకారం ఎప్పటికప్పుడు అందించాలని, పిల్లలకు పౌష్టికాహారం అందించడంలో నిర్లక్ష్యం వహించవద్దని పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం మారేడుమిల్లి మండలం జి.ఎం. వలస గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను, అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులతో కలెక్టర్ నేరుగా మాట్లాడారు. పాఠశాలలో విద్యా బోధన ఎలా సాగుతోందని, విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయాలు తదితర సమస్యలు ఏమైనా ఉన్నాయా అని ఆరా తీశారు. ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు.

అనంతరం విద్యార్థులలో సాధారణ పరిజ్ఞానాన్ని పెంపొందించే ఉద్దేశంతో పలు జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు అడిగి వారి సమాధానాలను తెలుసుకున్నారు. విద్యార్థులు చదువుపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచి, మంచి విద్యా ప్రమాణాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. అనంతరం కలెక్టర్ విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించి, భోజనం నాణ్యత, రుచి, మెనూ గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
అదేవిధంగా గుజ్జిమాడి వలస గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులతో మాట్లాడి వారికి అందిస్తున్న పౌష్టికాహారం, ఇతర సదుపాయాలను పరిశీలించారు. పిల్లలకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం, మెరుగైన మౌలిక సదుపాయాలు అందేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. బాలబాలికలకు ఆటపాటలతో విద్యపై దృష్టి పెట్టే విధంగా బోధించాలని అన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు పాలు, గుడ్లు, చిక్కీలు వెండర్లు ఏ విధంగా సరఫరా చేస్తున్నారో ఆరా తీశారు. బాల బాలికలకు, బాలింతలకు, గర్భిణీ స్త్రీలకు ఎప్పటికప్పుడు అందించాలన్నారు. విద్యార్థులకు ఎప్పటికప్పుడు బరువు, ఎత్తు కొలతలు సంబంధిత రిజిస్టర్ లో నమోదు చేయాలని ఆదేశించారు.








కామెంట్లు (0)