సిపిఎం అనకాపల్లి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గంటా శ్రీరామ్
ప్రజాశక్తి-అనకాపల్లి : అల్లూరి స్ఫూర్తితో సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమాలను బలోపేతం చేయాలని సిపిఎం అనకాపల్లి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గంటా శ్రీరామ్ పిలుపునిచ్చారు.విప్లవ వీరుడు,స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 129వ జయంతి సందర్భంగా అనకాపల్లి సిపిఎం జిల్లా కార్యాలయంలో ఆయన చిత్రపటానికి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గంటా శ్రీరామ్,జిల్లా కమిటీ సభ్యులు వి.వి.శ్రీనివాసరావు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి ఎదురొడ్డి మన్యం గిరిజనులను సమీకరించి వీరోచిత పోరాటం సాగించిన అల్లూరి సీతారామరాజు భారత స్వాతంత్ర్యోద్యమంలో చిరస్మరణీయ నాయకుడని కొనియాడారు.అడవి,భూమి,సహజ వనరులపై గిరిజనుల హక్కులను కాపాడేందుకు ఆయన చేసిన త్యాగాలు,పోరాటం నేటికీ ప్రజా ఉద్యమాలకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.నేడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం,ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశంలో కార్పొరేట్ అనుకూల,సామ్రాజ్యవాద విధానాలను వేగంగా అమలు చేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను బలహీనపరుస్తోందని,సహజ వనరులను కార్పొరేట్ కంపెనీలకు అప్పగిస్తోందని విమర్శించారు.రైతులు,కార్మికులు,గిరిజనులు,యువత,పేద ప్రజల ప్రయోజనాలను విస్మరిస్తూ కొద్దిమంది కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలకే పెద్దపీట వేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని ధైర్యంగా ఎదుర్కొన్నట్లే,నేడు దేశ సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టే సామ్రాజ్యవాద అనుకూల విధానాలను ప్రజలంతా ఐక్యంగా ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు.గిరిజనుల హక్కులు,రాజ్యాంగ పరిరక్షణ,ప్రజాస్వామ్య విలువలు,దేశ స్వావలంబనను కాపాడేందుకు విస్తృత ప్రజా ఉద్యమాలను నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు.అల్లూరి ఆశయాల సాధనకు,గిరిజనుల హక్కుల పరిరక్షణకు,సామ్రాజ్యవాదం–కార్పొరేట్ దోపిడీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రజలను చైతన్యపరుస్తూ మరో స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తితో పోరాటాలను ముందుకు తీసుకెళ్లాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు అల్లు రాజు,నాయకులు కె.ఈశ్వరరావు,నూక అప్పారావు,సూర్యనారాయణ,పి.చలపతి తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)