సర్వీస్ నిబంధనల్లో కేటగిరీ–7 గా చేర్చుతూ జీఓఎంఎస్ నెం.598 జారీ
ది కమర్షియల్ టాక్సెస్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు భవనారి వెంకటేష్ బాబు, ప్రధాన కార్యదర్శి కొప్పోలు సుధాకర్‌రావు
ప్రజశక్తి - అనంతపురం : ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పన్నుల శాఖలో వస్తు సేవల పన్ను అధికారులు (జీఎస్టీవోలు) కేడర్‌కు తొలి శ్రేణి గెజిటెడ్ హోదా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీఎస్టీవోలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర (వాణిజ్య పన్నుల) సర్వీస్ నిబంధనల్లో కేటగిరీ–7గా చేర్చుతూ జీఓఎంఎస్ నెం.598ను జారీ చేసింది. జీఎస్టీవోలకు గెజిటెడ్ హోదా కోసం తమ సంఘం సుదీర్ఘకాలంగా చేసిన కృషి ఫలించిందని ది కమర్షియల్ టాక్సెస్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు భవనారి వెంకటేష్ బాబు, ప్రధాన కార్యదర్శి కొప్పోలు సుధాకర్‌రావు తెలిపారు.
జీఎస్టీవో పోస్టుల భర్తీలో 33⅓ శాతం ప్రత్యక్ష నియామకం, 66⅔ శాతం సీనియర్ ఆఫీస్ అసిస్టెంట్ల నుంచి బదిలీ ద్వారా చేపట్టేలా నిబంధనలు రూపొందించారని పేర్కొన్నారు. ప్రత్యక్ష నియామకానికి డిగ్రీ విద్యార్హతగా నిర్ణయించడంతో పాటు ఆరు నెలల శిక్షణ, బదిలీ ద్వారా నియమితులయ్యే వారికి మూడు నెలల శిక్షణను నిర్దేశించినట్లు తెలిపారు. దిగువ కేటగిరీ నుంచి ఉన్నత కేటగిరీకి పదోన్నతి లేదా బదిలీకి కనీసం రెండేళ్ల సర్వీస్ ఉండాలని నిబంధనల్లో పేర్కొన్నారని వివరించారు.
జీఎస్టీవో పోస్టులకు జోన్‌ను నియామక యూనిట్‌గా, చీఫ్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్‌ను నియామక అధికారిగా ప్రభుత్వం నిర్దేశించిందన్నారు. ప్రత్యక్ష నియామక పోస్టుల్లో స్థానిక అభ్యర్థులకు 95 శాతం రిజర్వేషన్ వర్తిస్తుందని తెలిపారు. ఈ సవరణలు 2026 జూలై 15 నుంచి అమల్లోకి వచ్చినట్లు పేర్కొన్నారు.
ఈ కీలక నిర్ణయానికి సహకరించిన ఆర్థిక, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌కు సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సర్వీస్ నిబంధనల మార్పు ప్రక్రియలో ప్రత్యేక చొరవ చూపిన చీఫ్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్ అహ్మద్ బాబు, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.
జీఎస్టీవోలకు తగిన అధికారాలే తదుపరి లక్ష్యం ...
జీఎస్టీవోలకు గెజిటెడ్ హోదా సాధించడంతో తమ బాధ్యత పూర్తికాలేదని వెంకటేష్ బాబు, సుధాకర్‌రావు తెలిపారు. జీఎస్టీవోలను ‘ప్రాపర్ ఆఫీసర్లు’గా గుర్తించి, వారి విధులు, బాధ్యతలకు అనుగుణంగా చట్టబద్ధమైన అధికారాలు కల్పించడమే తదుపరి లక్ష్యమన్నారు. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం, చీఫ్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్‌కు వినతిపత్రాలు సమర్పించినట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో పన్నుల పరిపాలనలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న జీఎస్టీవోలకు తగిన అధికారాలు కల్పిస్తే పన్ను చట్టాల అమలు మరింత పటిష్ఠమై ప్రభుత్వ ఆదాయం పెరగడానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. జీఎస్టీవోలకు విధులు, బాధ్యతలకు తగిన అధికారాలు కల్పించే వరకు సంఘం కృషి కొనసాగుతుందని స్పష్టం చేశారు.








కామెంట్‌లు (0)