మెప్మా ఆర్‌పిల గౌరవ వేతనాలపై *జిఒ 319 కలకలం
తప్పుకునే ప్రయత్నమా? *ఆర్‌పి వ్యవస్థ నిర్వీర్యానికి కుట్రనా?
ఎస్‌ఎల్‌ఎఫ్ నిధుల నుంచి వేతనాల చెల్లింపు నిర్ణయంపై *రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన
ప్రజాశక్తి– హిందూపురం: పట్టణ పేదరిక నిర్మూలనలో కీలకపాత్ర పోషిస్తోన్న మెప్మా రసోర్స్ పర్సన్స్ (ఆర్‌పి)ల గౌరవ వేతనాల చెల్లింపు వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటివరకు ప్రభుత్వమే నేరుగా చెల్లిస్తుండగా ఇకపై మహిళా సంఘాల సమాఖ్యల (ఎస్‌ఎల్‌ఎఫ్) నిధుల నుంచి చెల్లించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం డ్వాక్రా సంఘాల నాయకులతోపాటు ఆర్‌పిల్లో తీవ్ర ఆందోళనకు కలిగిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం మెప్మా ఆర్‌పిల గౌరవ వేతనాల చెల్లింపులో తీసుకొచ్చిన కొత్త విధానం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఇప్పటివరకు ప్రభుత్వమే నేరుగా చెల్లిస్తున్న గౌరవ వేతనాలను మహిళలు పొదుపు చేసి నిర్మించుకున్న స్వయం సహాయక సంఘాల సమాఖ్యల (ఎస్‌ఎల్‌ఎఫ్) నిధుల నుంచి చెల్లించాలని మెప్మా మేనేజింగ్ డైరెక్టర్ గత నెల 13వ తేదీన జారీ చేసిన జిఒ ఎంఎస్ నెంబర్ 319పై ఆర్‌పిలు, మహిళా సంఘాల నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మహిళల అభివృద్ధి కోసం ఏర్పాటైన సమాఖ్యల నిధులను ప్రభుత్వ బాధ్యతలకు వినియోగించడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు బలంగా వినిపిస్తున్నాయి. గత పదిహేనేళ్లుగా మెప్మా ఆర్‌పిలు ప్రభుత్వానికి, మహిళా సంఘాలకు మధ్య వారథిగా పనిచేస్తూ స్వయం సహాయక సంఘాల ఏర్పాటు, వాటి బలోపేతం, బ్యాంకు రుణాల అనుసంధానం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, మహిళలకు అవగాహన కార్యక్రమాల నిర్వహణ వంటి కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ సేవలను గుర్తించి 2014లో అప్పటి ప్రభుత్వం ఆర్‌పిలకు గౌరవ వేతనం మంజూరు చేసింది. ప్రస్తుతం ఒక్కో ఆర్‌పికి నెలకు రూ.8 వేల గౌరవ వేతనం మాత్రమే అందుతోంది. జీవన వ్యయం పెరిగిన నేపథ్యంలో వేతనం పెంచాలని వారు ఎన్నోసార్లు ప్రభుత్వాన్ని కోరుతున్నప్పటికీ ఇప్పటి వరకు సానుకూల నిర్ణయం వెలువడలేదు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం గౌరవ వేతనాన్ని పెంచడం బదులుగా, మహిళలు సంవత్సరాలుగా పైసా పైసా పొదుపు చేసి నిర్మించుకున్న సమాఖ్య నిధుల నుంచే చెల్లించాలని నిర్ణయించడం వివాదాస్పదంగా మారింది. మహిళల పొదుపు నిధులు స్వయం ఉపాధి, అత్యవసర రుణాలు, సంఘాల అభివృద్ధి, ఆర్థిక సాధికారత కోసం ఉద్దేశించినవని, అలాంటి నిధులను గౌరవ వేతనాల కోసం వినియోగించడం వల్ల సమాఖ్యలు ఆర్థికంగా బలహీనపడే ప్రమాదం ఉందని డ్వాక్రా సంఘాల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో 1,200 మందికిపైగా ఆర్‌పిలు
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 11 పురపాలక సంఘాలు, ఒక మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దాదాపు 1,200 మందికి పైగా మెప్మా రిసోర్స్ పర్సన్లు విధులు నిర్వహిస్తున్నారు. వేలాది డ్వాక్రా సంఘాల కార్యకలాపాలకు వీరే వెన్నెముకగా నిలుస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం తెచ్చిన నూతన జిఒ ప్రకారం ముందుగా సమాఖ్య నిధుల నుంచి గౌరవ వేతనాలు చెల్లించి, తర్వాత ప్రభుత్వం బడ్జెట్ విడుదలైనప్పుడు ఆ మొత్తాన్ని తిరిగి సమాఖ్య ఖాతాలకు జమ చేస్తామని పేర్కొంది. బడ్జెట్ విడుదలలో జాప్యం జరిగితే సమాఖ్యల నగదు ప్రవాహంపై ప్రభావం పడుతుందని, మహిళలకు అవసరమైన రుణాలు, ఇతర సేవలు ఆలస్యం అయ్యే అవకాశం ఉందని ఆర్‌పిలు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వమే చెల్లించాల్సిన గౌరవ వేతనాన్ని సమాఖ్యలపైకి మళ్లించడం ద్వారా భవిష్యత్తులో ఆర్‌పి వ్యవస్థపై ప్రభుత్వ బాధ్యతను తగ్గించే ప్రయత్నమా? పురపాలక సంఘాల్లోని ఆర్‌పి వ్యవస్థను, గ్రామీణ ప్రాంతాల్లో వెలుగు విభాగంలో పనిచేస్తున్న విఒఎ వ్యవస్థను క్రమంగా నిర్వీర్యం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు పడుతున్నాయా? అనే అనుమానాలు ఆర్‌పిల్లో వ్యక్తమవుతున్నాయి. మహిళల సాధికారత కోసం ఏర్పాటైన వ్యవస్థలో మహిళలే కూడబెట్టిన నిధులను ప్రభుత్వ నిర్వహణ వ్యయాలకు వినియోగించడం సమంజసమేనా? గౌరవ వేతనాన్ని ప్రభుత్వమే కొనసాగిస్తుందా? ఆర్‌పిల సేవలకు తగిన గుర్తింపు, గౌరవ వేతన పెంపు ఎప్పుడు అమలవుతుంది? వంటి ప్రశ్నలకు ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆర్‌పిలు, డ్వాక్రా సంఘాల నాయకులు కోరుతున్నారు.
ప్రభుత్వానికి–మహిళలకు వారథిగా ఆర్‌పిలు
మెప్మా ఆర్‌పిలు కేవలం ఉద్యోగులు కాదు. ప్రభుత్వ పథకాలను మహిళా సంఘాలకు చేరవేయడం, బ్యాంకు లింకేజీలు, రుణాల సమన్వయం, పొదుపు కార్యక్రమాలు, పట్టణ పేదరిక నిర్మూలన, ఉపాధి అవకాశాల కల్పన, వివిధ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో ప్రభుత్వానికి, మహిళా సంఘాలకు మధ్య వారథిగా వ్యవహరిస్తున్నారు. దాదాపు పదిహేనేళ్లుగా ఈ వ్యవస్థ పట్టణ ప్రాంతాల్లో కీలకంగా పనిచేస్తోంది. ప్రభుత్వ తాజా నిర్ణయం ఆర్‌పి వ్యవస్థను క్రమంగా నిర్వీర్యం చేసే ప్రయత్నమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే తరహాలో గ్రామీణ ప్రాంతాల్లో వెలుగు విభాగంలో పనిచేస్తున్న విఒఎల భవిష్యత్తుపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి.








కామెంట్‌లు (0)