ప్రజాశక్తి-అనంతపురం : పేదలు, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి జీవితాన్ని అంకితం చేసిన మానవతా మూర్తి, సేవా స్ఫూర్తి ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ అని ఆర్టీసీ జోనల్ చైర్మన్ పూల నాగరాజు అన్నారు. కుల, మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా ఐదు దశాబ్దాలుగా పేద ప్రజలకు ఆర్డీటీ ద్వారా సేవలందించిన ఫెర్రర్ సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ స్మారక కమిటీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ సంయుక్త ఆధ్వర్యంలో అనంతపురం నగరంలోని కలెక్టరేట్ ఎదురుగా ఉన్న విన్సెంట్ ఫెర్రర్ రోడ్డును శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి ఆర్టీసీ జోనల్ చైర్మన్ పూల నాగరాజు, మాజీ ఎమ్మెల్సీ డా. గేయానంద్, ఆర్డీటీ చైర్మన్ డా. హరి నారాయణ, ప్రముఖ సమాజ సేవకులు రవికాంత్ రమణ, సీపీఐ నాయకులు జగదీష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పూల నాగరాజు మాట్లాడుతూ ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ సేవా స్ఫూర్తిని నేటి తరానికి పరిచయం చేయడంలో భాగంగా కలెక్టరేట్ ఎదురుగా ఉన్న రోడ్డుకు ఆయన పేరు పెట్టడం అభినందనీయమన్నారు. మహనీయుడి పేరుతో ఉన్న రోడ్డును ప్రారంభించడం గర్వకారణమని తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ డా. గేయానంద్ మాట్లాడుతూ ఉమ్మడి అనంతపురం జిల్లాకు ఫాదర్ ఫెర్రర్ చేసిన సేవలు మరువలేనివన్నారు. ఆయన స్ఫూర్తితో యువత సేవాభావాన్ని అలవరచుకోవాలని పిలుపునిచ్చారు. ఆర్డీటీ చైర్మన్ డా. హరి నారాయణ మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి ఫాదర్ ఫెర్రర్ అని అన్నారు. విద్య, వైద్యం, గృహ నిర్మాణం, క్రీడలు, స్వయం ఉపాధి శిక్షణ తదితర రంగాల్లో ఆర్డీటీ సేవలు గ్రామస్థాయికి విస్తరించాయని వివరించారు. ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ స్మారక కమిటీ కన్వీనర్ హెచ్. నాగలింగయ్య మాట్లాడుతూ ఫెర్రర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు సాకే హరి, స్మారక కమిటీ సభ్యులు డా. నానీల నాగేంద్ర, తోట నాగరాజు, మల్లిపల్లి నారాయణ, నారాయణ, ఎస్కేయూ మాజీ రిజిస్ట్రార్ డా. సుధాకర్ బాబు, పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పెద్దన్న గౌడ్, పూలశెట్టి చలపతి, చౌడప్ప, పీవీకేకే కళాశాల ప్రిన్సిపాల్ చంద్రశేఖర్ రెడ్డి, డా. అంకె రామలింగయ్య, సాకే భాస్కర్, డా. జూటూరు షరీఫ్, షేక్ రియాజుద్దీన్, చెట్ల ఈరన్న, డా. నగరూరు రసూల్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా విన్సెంట్ ఫెర్రర్ రోడ్ ప్రారంభోత్సవం
4 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 14, 2026, 03:50 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)