ప్రత్యేక కవర్లు అన్ని పోస్టాఫీసుల్లో అందుబాటులో : సూపరింటెండెంట్ కె. అమర్‌నాథ్
ప్రజాశక్తి - అనంతపురం : రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని భారత తపాలా శాఖ ప్రత్యేకంగా రూపొందించిన రాఖీ ఎన్వలప్ కవర్లు అనంతపురం డివిజన్ పరిధిలోని అన్ని తపాలా కార్యాలయాల్లో అందుబాటులో ఉన్నాయని అనంతపురం తపాలా విభాగం సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ కె. అమర్‌నాథ్ తెలిపారు. ఈ ప్రత్యేక సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకుని తమ సోదరులకు రాఖీలను సురక్షితంగా పంపాలని ఆయన కోరారు. శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, సోదర–సోదరీమణుల మధ్య ప్రేమానుబంధాన్ని మరింత బలోపేతం చేసే రక్షాబంధన్ సందర్భంగా రాఖీలను భద్రంగా పంపించేందుకు ప్రత్యేక రాఖీ కవర్లను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. ఒక్కో కవర్ ధర రూ.15 (జీఎస్‌టీ అదనం) మాత్రమేనని పేర్కొన్నారు. ఈ ప్రత్యేక కవర్ల ద్వారా దేశంలోని ఏ రాష్ట్రానికైనా రాఖీలను సురక్షితంగా పంపించవచ్చని తెలిపారు. అలాగే విదేశాల్లో నివసిస్తున్న సోదరులకు కూడా ఇంటర్నేషనల్ ట్రాక్డ్ ప్యాకెట్ సర్వీస్ (ITPS) ద్వారా తక్కువ ఖర్చుతో, ట్రాకింగ్ సౌకర్యంతో రాఖీలను పంపించే అవకాశం భారత తపాలా శాఖ కల్పిస్తోందని వివరించారు. విదేశాలకు పంపే రాఖీలు సురక్షితంగా, విశ్వసనీయంగా గమ్యస్థానాలకు చేరేలా ఐటీపీఎస్ సేవలు అందుబాటులో ఉన్నాయని, ఈ సేవల వివరాల కోసం సమీప తపాలా కార్యాలయాన్ని సంప్రదించాలని సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ కె. అమర్‌నాథ్ సూచించారు. రక్షాబంధన్ సందర్భంగా భారత తపాలా శాఖ అందిస్తున్న ఈ ప్రత్యేక సేవలను ప్రజలు విస్తృతంగా వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.








కామెంట్‌లు (0)