ఐద్వా, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యాన ర్యాలీ
ప్రజాశక్తి - అనంతపురం కలెక్టరేట్ : రాష్ట్రంలో విద్యార్థినులు, మహిళలపై దాడులను అరికట్టాలని కోరుతూ ఐద్వా, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యాన నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతపురం జిల్లా రాప్తాడు మండల కేంద్రంలో పదో తరగతి విద్యార్థినిపై దాడి నిరసిస్తూ అనంతపురంలో ర్యాలీ నిర్వహించి, అనంతరం రైల్వేస్టేషన్ ఎదుట మానవహారం ఏర్పడి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.సావిత్రి, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి తరిమెల గిరి మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థినులు, పసిపిల్లలపై లైంగిక దాడులు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రాప్తాడులో పట్టపగలు పాఠశాలలోనే నిందితుడు మారణాయుధాలతో లోపలికి ప్రవేశించి దాడి చేయడం అమానుషమన్నారు. గంజాయి, మాదక ద్రవ్యాలు, మత్తుపదార్థాలే ఘటనకు కారణమని వివరించారు. రాప్తాడు ఘటన నిందితుడిని న్యాయవ్యవస్థ ద్వారా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బెంగళూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలికి అత్యాధునిక టెక్నాలజీ, ఇంటర్నేషనల్ డాక్టర్లతో మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నగర కార్యదర్శి అశ్విని, రామాంజినమ్మ, ఫర్యాది, ఎస్ఎఫ్ఐ నగర నాయకులు విజయ్, శ్రీనాథ్, ధనుంజయ, తదితరులు పాల్గొన్నారు.








కామెంట్లు (0)