ప్రజాశక్తి - అనంతపురం : ఢిల్లీలోని తుగ్లకాబాద్‌లో ఉన్న ప్రతిష్టాత్మక డాక్టర్ కర్ణి సింగ్ షూటింగ్ రేంజ్‌లో నిర్వహించిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ (ఎన్ఐఎస్) కోర్సును ఆర్యన్ రైఫిల్ షూటింగ్ అకాడమీ కోచ్ శ్రీకాంత్ విజయవంతంగా పూర్తి చేశారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిక్షణ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా పలువురు క్రీడా కోచ్‌లు పాల్గొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన కోచింగ్ మెళకువలు, క్రీడాకారుల సామర్థ్యాల పెంపు, ఆధునిక శిక్షణ విధానాలపై ఈ కోర్సులో శిక్షణ అందించారు. డాక్టర్ కర్ణి సింగ్ షూటింగ్ రేంజ్ దేశంలోని ప్రముఖ షూటింగ్ కేంద్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇక్కడ సాయ్ ఆధ్వర్యంలో తరచూ జాతీయ స్థాయి కోచింగ్ క్యాంపులు నిర్వహిస్తుండగా, ఒలింపిక్ కోటా సాధించిన షూటర్లు సైతం ఇదే వేదికపై శిక్షణ పొందుతున్నారు. ఎన్ఐఎస్ కోర్సు పూర్తి చేయడం ద్వారా శ్రీకాంత్ ఇకపై ఆర్యన్ రైఫిల్ షూటింగ్ అకాడమీలోని యువ షూటర్లకు మరింత అధునాతన శిక్షణ అందించడంతో పాటు, జాతీయ స్థాయి పోటీలకు అవసరమైన సాంకేతిక నైపుణ్యాలను, మెళకువలను అందించనున్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్‌ను తోటి కోచ్‌లు, అకాడమీ విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు. ఆయన శిక్షణతో అనంతపురం జిల్లా నుంచి మరింత మంది ప్రతిభావంతులైన షూటర్లు వెలుగులోకి రావాలని ఆకాంక్షించారు.









కామెంట్‌లు (0)