మంగళవారం, 11 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

విద్యార్థుల పట్ల అనుచిత ప్రవర్తన - ఉపాధ్యాయుడి సస్పెన్షన్

1 గంట క్రితం

Teacher suspended for inappropriate behavior towards students.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 11, 2026, 03:10 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - అనంతపురం : విద్యార్థుల పట్ల అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలపై యల్లనూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఫిజికల్‌ సైన్స్‌ స్కూల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న బి. శ్రీరామమూర్తిని సస్పెండ్‌ చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్‌ ఎన్‌.అయ్యూబ్‌ హుస్సేన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు మంగళవారం ఆర్‌సీ నం.2781A3/2026 ద్వారా ఉత్తర్వులు వెలువడ్డాయి. జెడ్పీహెచ్‌ఎస్‌ యల్లనూరులో 8, 9 వ తరగతుల విద్యార్థుల పట్ల శ్రీరామమూర్తి అనుచితంగా ప్రవర్తించినట్లు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తలు, విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదుల నేపథ్యంలో అధికారులు విచారణ చేపట్టారు. యల్లనూరు మండల విద్యాశాఖ అధికారి పాఠశాలను సందర్శించి ముగ్గురు విద్యార్థుల వాంగ్మూలాలను నమోదు చేసి, సంబంధిత అంశాలపై విచారణ నిర్వహించారు. ఈ విచారణలో విద్యార్థులు ఉపాధ్యాయుడిపై అనుచిత శారీరక ప్రవర్తన, అసభ్య పదజాలం వినియోగం, ఇతర అనుచిత ప్రవర్తనకు సంబంధించిన ఆరోపణలు చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆరోపణల స్వభావం తీవ్రంగా ఉండటంతో మరింత సమగ్ర విచారణ అవసరమని భావించిన జిల్లా విద్యాశాఖ అధికారి, ఆంధ్రప్రదేశ్‌ సివిల్‌ సర్వీసెస్‌ (కండక్ట్‌) రూల్స్‌, 1964, అలాగే ఎపి సివిల్‌ సర్వీసెస్‌ (క్లాసిఫికేషన్‌, కంట్రోల్‌ అండ్‌ అప్పీల్‌) రూల్స్‌, 1991లోని రూల్‌ 8(8) ప్రకారం శ్రీరామమూర్తిని తక్షణమే సస్పెండ్‌ చేశారు. ఆయనపై క్రమశిక్షణ చర్యలు పూర్తయ్యే వరకు సస్పెన్షన్‌ కొనసాగుతుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. సస్పెన్షన్‌ కాలంలో యల్లనూరు మండల కేంద్రాన్ని హెడ్‌క్వార్టర్స్‌గా నిర్ణయించారు. జిల్లా విద్యాశాఖ అధికారి ముందస్తు అనుమతి లేకుండా ఆయన హెడ్‌క్వార్టర్స్‌ విడిచి వెళ్లకూడదని ఆదేశించారు. నిబంధనల ప్రకారం .... సస్పెన్షన్‌ కాలానికి జీవనాధార భత్యం (Subsistence Allowance) చెల్లించాలని యల్లనూరు జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని ఆదేశించారు. ఉత్తర్వుల ప్రతులను యల్లనూరు మండల విద్యాశాఖ అధికారి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, సంబంధిత ఉప విద్యాశాఖాధికారి తదితరులకు పంపడంతో పాటు జిల్లా కలెక్టర్‌, కడప ప్రాంతీయ సంయుక్త సంచాలకులు (పాఠశాల విద్య), ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్యా సంచాలకులకు కూడా సమాచారార్థం పంపారు. విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం.. ఆరోపణలపై శాఖాపరమైన విచారణ కొనసాగనుంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్