సోమవారం, 17 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

మున్సిపల్ కార్మికులందరిని పర్మినెంట్ చేసేలా అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలి : సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి బి మల్లికార్జున

1 గంట క్రితం

The issue of regularizing all municipal workers must be discussed during the Assembly sessions: CITU District Assistant Secretary B. Mallikarjuna.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 17, 2026, 05:13 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

రాయదుర్గం (అనంతపురం) : రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్లలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ పారిశుద్ధ్య, ఇంజనీరింగ్ కార్మికులను హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం వారిని తక్షణమే రెగ్యులర్ చేయాలని సిఐటియు అనంతపురం జిల్లా సహాయ కార్యదర్శి బి మల్లికార్జున డిమాండ్ చేశారు. నేటి నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్న సందర్భంగా మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా సోమవారం రాయదుర్గం పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక వినాయక కూడలిలో కార్మికులు మానవహారంగా ఏర్పడి అరగంట పాటు తమ డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మల్లికార్జున మాట్లాడుతూ, అనేక సంవత్సరాలుగా పట్టణ ప్రజలకు పౌర సేవలను అందజేస్తున్న మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలం చెందుతున్నాయని, ప్రభుత్వాల అసమర్థత పరిపాలన వల్ల రాష్ట్రా వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులు అనేక సంవత్సరాలుగా చాలీచాలని వేతనాలతో విధులను నిర్వర్తించాల్సి వస్తోందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్న నేటికీ మున్సిపల్ కార్మికులకు ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలం చెందిందని తెలిపారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఒకే స్వభావం కలిగిన పనులు చేసే చోట కాంటాక్ట్ ఔట్సోర్సింగ్ విధానాన్ని తక్షణమే రద్దుచేసి వారందరికీ ఒకే రకమైన సమాన పనికి సమాన వేతనం చెల్లించాలనే ఆదేశాలను పాలకులు తుంగలో తొక్కి కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. అదేవిధంగా ఒకవైపు కార్మికులు తమను రెగ్యులర్ చేయమని కోరుతుంటే ప్రస్తుత ప్రభుత్వం మాత్రం అందుకు విరుద్ధంగా మున్సిపల్ కార్మికులు పట్టణ ప్రజలకు అందిస్తున్న పౌర సేవలను ప్రైవేట్ పరం చేసేందుకు ప్రయత్నాలను కొనసాగించడం దుర్మార్గమైనదని అన్నారు. ఈ ప్రయత్నాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనైనా మున్సిపల్ కార్మికులను రెగ్యులర్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, వీరికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ మరియు గ్రాటిటి చట్టాన్ని అమలు చేయాలని, మరణించిన కార్మికుల కుటుంబాల్లో ఒకరికి తక్షణమే ఉద్యోగం కల్పించాలని కోరారు. వీరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని, హెల్త్ కార్డులు ఇవ్వాలని, ఇంజనీరింగ్ కార్మికుల పిల్లలకు తల్లికి వందనం పథకాన్ని వర్తింపజేయాలని తదితర అంశాలపై అసెంబ్లీలో చర్చకు పెట్టి ఈ అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని వెళ్లి మున్సిపల్ కార్మికులకు న్యాయం జరిగే విధంగా రాష్ట్రంగా ఉన్నటువంటి శాసనసభ్యులు కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్ కార్మిక సమస్యలపై చర్చలు జరిపి వారికి న్యాయం చేయాలని లేని పక్షంలో భవిష్యత్తులో మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సిఐటియు ఆధ్వర్యంలో ఈ కుటుంబ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను నిర్వహించేందుకు సంసిద్ధం అవుతామని తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పడే పరిణామాలకు మరియు ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులకు రాష్ట్ర ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ పట్టణ అధ్యక్షులు హెచ్ నాగరాజు, కార్యదర్శి రాము, కోశాధికారి తిప్పరుద్ర మరియు నాయకులు సిద్ధ లింగ, ఎర్రి స్వామి, రాజు, వన్నూరమ్మ ఆదిలక్ష్మి విజయ్ తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్