ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్
పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు వెంటనే తగ్గించాలని ఐద్వా నగర కార్యదర్శి అశ్విని డిమాండ్ చేశారు. నిత్యావసర సరుకులు తగ్గించి, రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులను ఇవ్వాలని కోరుతూ ఐద్వా ఆధ్వర్యంలో బుధవారం నాడు నగరంలోని స్వర్ణ గ్రామ వార్డు అధికారులను కలిసి వినతిపత్రాలు అందజేశారు. రాజీవ్ కాలనీ, నారాయణపురం 4, 5, స్వర్ణ గ్రామం, కక్కలపల్లి, ఇందిరానగర్, మాతంగి నగర్, గౌరవ గార్డెన్స్ ప్రాంతాల్లోని స్వర్ణవార్డు అధికారులను కలిసి వినతిపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నగర కార్యదర్శి అశ్విని, జిల్లా కమిటీ సభ్యురాలు రామాంజనమ్మ, లక్ష్మి, కుమారి, నగర కమిటీ సభ్యురాలు ఫర్యాది, ప్రాథమిక కమిటీల సభ్యురాలు సునీత కాలనీవాసులు పాల్గొని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అశ్విని మాట్లాడుతూ నిత్యావసరాలు, కూరగాయల ధరలు పెరిగి పేద, మధ్యతరగతి కుటుంబాల జీవనం అస్తవ్యస్తం అయ్యిందన్నారు. ఓ వైపు ఆదాయం తగ్గి, మరోవైపు ధరలు పెరగడంతో కుటుంబ పోషణ ఇబ్బందిగా మారిందన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఉపశమనం కల్పించే చర్యలు చేపట్టాలన్నారు. రేషన్ దుకాణాల ద్వారా 60 రకాల నిత్యావసర సరుకులను అందించాలన్నారు. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలను వెంటనే తగ్గించాలన్నారు. రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి కూరగాయలను తక్కువ ధరలకు అందించాలన్నారు. అక్రమ నిల్వదారులు, దళారులు, బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడే వారిపై ప్రత్యేక విజిలెన్స్ ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.









కామెంట్‌లు (0)