సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కరువు కాటుతో జిల్లా అల్లాడుతుంటే.. ప్రభుత్వానికి కార్పొరేట్లే కనిపిస్తున్నారా ?

2 రోజుల క్రితం

While the district is reeling under the impact of drought, are only corporates visible to the government?
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 25, 2026, 04:16 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

31 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించి తక్షణ సహాయక చర్యలు చేపట్టాలి

సీపీఎం సీనియర్ నాయకులు జి. ఓబులు డిమాండ్


ఆత్మకూరు (అనంతపురం) : వర్షాభావంతో పంటలు ఎండిపోతూ రైతులు, వ్యవసాయ కూలీలు, కౌలు రైతులు, గొర్రెల కాపరులు, పశుపోషకులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం కరువు నివారణను పట్టించుకోకుండా కార్పొరేట్ కంపెనీలకు భూములు కేటాయించడంలో శ్రద్ధ చూపుతోందని సీపీఎం సీనియర్ నాయకులు జి. ఓబులు విమర్శించారు. జిల్లాలోని 31 మండలాలను వెంటనే కరువు ప్రాంతాలుగా ప్రకటించి యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన కరువు జీపు యాత్ర శుక్రవారం ఆత్మకూరు మండలానికి చేరుకుంది.


ఆత్మకూరు మండలంలో 26,819 హెక్టార్ల భౌగోళిక విస్తీర్ణానికి కేవలం 7,521 హెక్టార్లలోనే పంటల సాగు నమోదైంది. వర్షాభావంతో సాగు చేసిన పంటలను కాపాడుకోవడం కూడా రైతులకు కష్టంగా మారిందన్నారు. పంటలు దెబ్బతినడంతో అప్పుల భారం పెరిగి కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, పనులు లేక వ్యవసాయ కూలీల వలసలు పెరుగుతున్నాయని తెలిపారు.


కరువు సమయంలో రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం కార్పొరేట్లకు భూములు కేటాయించేందుకు సిద్ధపడుతోందని, 99 పైసలకే భూములు ఇచ్చేందుకు చూపుతున్న శ్రద్ధ భూమిలేని పేదలకు సెంటు భూమి ఇవ్వడంలో ఎందుకు లేదని ప్రశ్నించారు. హంద్రీనీవా కాలువ లైనింగ్‌తో కాలువ వెంట భూములు బీడు భూములుగా మారే పరిస్థితి ఏర్పడిందని, సాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.


కరువు ప్రభావిత రైతుల ఖాతాల్లో ఇన్‌పుట్ సబ్సిడీ వెంటనే జమ చేయాలని, పంట నష్టపరిహారం, కౌలు రైతులకు ప్రత్యేక ఆర్థిక సహాయం అందించాలని కోరారు. వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ పనులు పెంచి సకాలంలో వేతనాలు చెల్లించాలని, పశుపోషకులకు మేత, తాగునీరు, అవసరమైన చోట పశుగ్రాస శిబిరాలు ఏర్పాటు చేయాలని, గ్రామాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించాలని అన్నారు. కరువు ప్రభావిత కుటుంబాల విద్యార్థుల అన్ని రకాల ఫీజులను ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు.


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.20 వేల కోట్ల ప్రత్యేక కరువు ప్యాకేజీ ప్రకటించి రైతులు, కూలీలు, కౌలు రైతులు, పశుపోషకులను ఆదుకోవాలని జి. ఓబులు డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 28న అనంతపురం కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే సీపీఎం ధర్నాకు ఆత్మకూరు మండల ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.


ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బి. శ్రీనివాసులు, కృష్ణమూర్తి, ఎస్. నాగేంద్ర కుమార్, జిల్లా కమిటీ సభ్యులు ఓ. పరమేష్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏటీఎం నాగరాజు, మండల కార్యదర్శి శివశంకర్, జయమ్మ, వలి పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్