ప్రజాశక్తి -గంగవరం
ప్రభుత్వ విద్యా రంగం బలోపేతానికి యుటిఎఫ్ కృషి చేస్తుందని ఆ సంఘం పోలవరం జిల్లా సహాధ్యక్షులు ఎస్.నాగేశ్వరరావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటిఎఫ్) గంగవరం మండల కౌన్సిల్ సమావేశం స్థానిక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బుధవారం సంఘం మండల అధ్యక్షులు కె.బొజ్జిదొర అధ్యక్షతన జరిగింది. తొలుత యూటిఎఫ్ జెండా ఆవిష్కరణ సీనియర్ ఉపాధ్యాయులు రఘుబాబు దొర చేశారు. తర్వాత యూటిఎఫ్ వ్యవస్థాపకులు చెన్నూపాటి లక్ష్మయ్య, అప్పారి వెంకటస్వామి, దాచూరి రామిరెడ్డి, నాగటి నారాయణ, టిజి.వాషింగ్టన్ చిత్ర పటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మండల కార్యవర్గం ఎన్నికల అధికారిగా వ్యవహరించిన నాగేశ్వరరావు మాట్లాడుతూ యూటిఎఫ్ వ్యవస్థాపక అమరజీవులు చెన్నుపాటి లక్ష్మయ్య, అప్పారి వెంకటస్వామి, దాచూరి రామిరెడ్డి తదితర నాయకుల పోరాట స్ఫూర్తిని నేటి తరం ఉపాధ్యాయులు ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె కృష్ణ మాట్లాడుతూ యూటిఎఫ్ అనేది కేవలం ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం పనిచేసే సంఘం మాత్రమే కాదని, విద్యారంగ పరిరక్షణ, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం నిరంతరం పోరాడే బాధ్యతాయుతమైన సంఘమని చెప్పారు.
నూతన కార్యవర్గం ఎన్నిక
అనంతరం యుటిఎఫ్ గంగవరం మండలం నూతన కార్యవర్గం ఎన్నిక జరిగింది. యుటిఎఫ్ మండల గౌరవ అధ్యక్షులుగా చవలం రాంబాబు దొర, అధ్యక్షులుగా కారం బొజ్జిదొర, ప్రధాన కార్యదర్శిగా చెదల రామ కృష్ణారెడ్డి, మహిళా అధ్యక్షురాలుగా ఎల్.రుక్మిణి దేవి, సహధ్యక్షులుగా రాములు కొండ చిన్న వెంకట రెడ్డి, కోశాధికారిగా చవలం కృష్ణా దొర, అలాగే జిల్లా కౌన్సిలర్స్‌గా ఏడుగురు, మహిళా కమిటీకి ఐదుగరు, సిపిఎస్ కమిటీకి ఐదుగురు ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన మండల కార్యవర్గ సభ్యులు సంఘ ఐక్యతను కాపాడుతూ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేయాలని నాయకులు సూచించారు.








కామెంట్‌లు (0)