ప్రజాశక్తి - యానాం : విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, సృజనాత్మక ఆలోచనలు, పరిశోధనా ఆసక్తిని పెంపొందించే లక్ష్యంతో యానాం ప్రాంతీయ విద్యా వైజ్ఞానిక ప్రదర్శన శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. స్థానిక పిఎంశ్రీ రాజీవ్ గాంధీ ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనను యానాం ప్రాంతీయ పరిపాలనాధికారి ఇన్ఛార్జి టి.రవిశంకర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత, హయ్యర్ సెకండరీ పాఠశాలల విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు తమ వైజ్ఞానిక నమూనాలు, వినూత్న ఆవిష్కరణలను ప్రదర్శించారు. మొత్తం 180 ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు రూపొందించిన నమూనాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. రోజువారీ జీవితంలో ఎదురయ్యే సమస్యలకు శాస్త్రీయ పరిష్కారాలను చూపించే విధంగా పలు ప్రాజెక్టులను రూపొందించడం విశేషం. రెండు రోజుల పాటు కొనసాగనున్న ఈ ప్రదర్శన ముగింపు కార్యక్రమం ఈ నెల 14న స్థానిక చిల్డ్రన్స్ ఆడిటోరియంలో నిర్వహించనున్నారు. ప్రాథమిక స్థాయిలో మొదటి మూడు స్థానాలు, మిగిలిన విభాగాల్లో మొదటి ఐదు స్థానాలు సాధించిన విద్యార్థులు ఈ నెల 19 నుంచి 21 వరకు జరిగే రాష్ట్రస్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపిక కానున్నారు. రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచిన వారు దక్షిణ భారత స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం పొందుతారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ విద్యాశాఖాధికారి పంపన లక్ష్మణ ప్రవీణ్, ఎడిపిసి కమిడి ప్రభాకర్, ఎస్పి వరదరాజన్, ఎస్టిపిసి జూనియర్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ అనిమిల్లి రామలింగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని పాఠశాల హెచ్ఎం సిహెచ్.వి.ఎస్.శ్రీరామ్ సమన్వయం చేశారు.ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.









కామెంట్లు (0)