శనివారం, 10 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రపంచ రికార్డులు సాధించిన చిన్నారి

1 గంట క్రితం

ప్రపంచ రికార్డులు సాధించిన చిన్నారి image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 10, 2026, 06:52 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - అనపర్తి

బుడిబుడి అడుగులు వేసే పసి ప్రాయంలోనే అసాధారణ జ్ఞాపకశక్తితో ఒక చిన్నారి రెండు ప్రపంచ రికార్డులు సాధించి అంతర్జాతీయ స్థాయిలో అబ్బురపరిచింది. మండపేట మండల పరిధిలోని అర్తమూరు గ్రామానికి చెందిన తాడి రఘురామారెడ్డి, సుస్మిత వాణి దంపతుల కుమార్తె తాడి ఖ్యాతిక పసి వయసులోనే ఈ అరుదైన ఘనత సాధించింది. విభిన్న విభాగాలకు చెందిన 500 చిత్రాలను పుస్తకంలో చూసి కేవలం 24 నిమిషాల వ్యవధిలోనే గుర్తించినందుకు గాను 'ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్' సంస్థ ఆమె ప్రతిభను గుర్తించి వరల్డ్ రికార్డును బహూకరించింది. ఈ ఘనతను ఏడాది నాలుగు నెలల 21 రోజుల వయసులో సాధించింది. చిన్నారి ఖ్యాతిక ప్రతిభకు మరో అంతర్జాతీయ గుర్తింపు లభించింది. కేవలం ఏడాది ఐదు నెలల పది రోజుల వయసులోనే వెయ్యి చిత్రాలను గుర్తించిన చిన్నారిగా 'నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్'లో స్థానం సంపాదించింది. ఈ చిన్నారి సౌర కుటుంబం, భారత జాతీయ చిహ్నాలు, రాష్ట్రాలు, చారిత్రక కట్టడాలు, వివిధ దేశాల జెండాలు, సంగీత వాయిద్యాలు, క్రీడలు, నృత్యరీతులు, దేవతలు, వృత్తులు, శరీర భాగాలు, వాహనాలు, కంప్యూటర్ భాగాలు, జంతువులు, ఇంట్లో ఉపయోగించే వస్తువులు తదితర ఎన్నో అంశాలకు సంబంధించిన చిత్రాలను వేగంగా గుర్తిస్తూ తన అసాధారణ జ్ఞాపకశక్తిని చాటుకుంటోంది. అంతేకాకుండా పాటలు, చిన్న పద్యాలు, శ్లోకాలను సైతం అనర్గళంగా ఆలపిస్తూ ఆశ్చర్యపరుస్తోంది. పసి వయసులోనే అంతర్జాతీయ స్థాయిలో రెండు ప్రపంచ రికార్డులు సాధించిన ఖ్యాతిక భవిష్యత్తులో మరిన్ని అద్భుత విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్