రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని పల్నాడు జిల్లా ఎస్పీ జగదీష్ ఆదహళ్లి ఆదేశించారు. చిలకలూరిపేట టౌన్, చిలకలూరిపేట రూరల్, యడ్లపాడు, నాదెండ్ల పోలీస్ స్టేషన్లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ల లోని రికార్డులు, కేసుల నమోదు, వాటి పురోగతిని పరిశీలించారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు.పోలీస్ స్టేషన్ల పరిసరాలు, సీసీ కెమెరాల పని తీరును పరిశీలించిన ఎస్పీ ఆయా ప్రాంతాల్లో శాంతి భద్రతల పరిస్థితిపై ఆరా తీశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, నేరాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. చట్టవ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు.ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ పోలీసు శాఖపై నమ్మకాన్ని మరింత పెంచేలా సమర్థవంతమైన సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో సిబ్బందికి కేటాయించిన గ్రామాలు, వార్డుల్లో క్షేత్ర స్థాయిలో సమాచారాన్ని సేకరించి, పరిస్థితులను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు నివేదించాలని ఆదేశించారు.
ఈ తనిఖీల్లో నరసరావుపేట డీఎస్పీ ఎం. హనుమంతరావు, చిలకలూరిపేట టౌన్ సీఐ రమేష్, రూరల్ సర్కిల్ సీఐ సుబ్బనాయుడు, రూరల్ ఎస్‌ఐ అనిల్, యడ్లపాడు ఎస్‌ఐ శివరామకృష్ణ, నాదెండ్ల ఎస్‌ఐ వెంకటేశ్వరరావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)