ప్రజాశక్తి - రాజమహేంద్రవరం సిటీ
స్థానిక ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు క్రీడలు, సామాజిక సేవ, విజ్ఞాన రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా విజేతలను, వాలంటీర్లను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామచంద్ర ఆర్.కె శనివారం అభినందించారు. నన్నయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో అన్నవరంలో ఈ నెల 17న నిర్వహించిన అంతర్ కళాశాల టైక్వాండో పోటీల్లో కళాశాల విద్యార్థినులు సత్తా చాటారు. ప్రథమ బీఎస్సీ జియాలజీ విద్యార్థిని పి. ఊహాలక్ష్మి ద్వితీయ స్థానంతో రజత పతకం సాధించగా, ప్రథమ బీఎస్సీ జాగ్రఫీ విద్యార్థిని సిహెచ్.రేష్మ, ప్రథమ ఎంఎస్సీ జువాలజీ విద్యార్థిని ఎస్. తులసి అలేఖ్య తృతీయ స్థానాల్లో నిలిచి కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. విజేతలను ప్రిన్సిపల్ డాక్టర్ రామచంద్ర ఆర్.కె, వైస్ ప్రిన్సిపల్ ఎం. వసంతలక్ష్మి, ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగాధికారి కెప్టెన్ డాక్టర్ జి. ప్రమీలారాణి, పీడీలు పివివి.లక్ష్మి, టి.విజయదుర్గ అభినందించారు. అనంతరం ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో కళాశాల ఆవరణ, హాస్టల్ ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తను తొలగించి పరిశుభ్రతపై నినాదాలతో అవగాహన కల్పించారు. అలాగే జువాలజీ అండ్ ఆక్వాకల్చర్ విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ మత్స్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. జువాలజీ విభాగాధిపతి డాక్టర్ బి. చక్రవర్తి మాట్లాడుతూ ఆహార భద్రత, ఆర్థికాభివృద్ధిలో ఆక్వాకల్చర్ పాత్ర కీలకమని, రొయ్యల సాగులో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని తెలిపారు.
ఆక్వా రంగంలో స్మార్ట్ టెక్నాలజీ, కృత్రిమ మేధ వినియోగం ద్వారా ఉత్పాదకత పెంచవచ్చని ప్రిన్సిపల్ పేర్కొన్నారు. మత్స్యశాస్త్రం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో విస్తృత ఉపాధి అవకాశాలు ఉన్నాయని వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వసంతలక్ష్మి వివరించారు. ఈ కార్యక్రమంలో విభాగ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.








కామెంట్లు (0)