ప్రజాశక్తి – యానాం
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు ప్రత్యేక చొరవ తీసుకుంటామని పుదుచ్చేరి ఎస్‌ఎస్‌పి ఎంవిఎన్వి.లక్ష్మీ సౌజన్య తెలిపారు. యానాం పోలీస్‌స్టేషన్‌లో శనివారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల వేదిక కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎస్‌పి వరదరాజన్, సిఐ డి.సురేష్‌బాబు ఆధ్వర్యంలో స్థానికంగా పరిష్కరించగల సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. తమ పరిధిలో పరిష్కారం కాని సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. 2047 నాటికి యానాం పోలీస్‌స్టేషన్‌ను ఆధునికంగా అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. పోలీస్‌స్టేషన్ భవనాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు సిబ్బంది సంఖ్య పెంపు, పోలీస్ అవుట్‌పోస్ట్, మహిళా డెస్క్, సైబర్ క్రైమ్ బృందం ఏర్పాటు, సిబ్బందికి ప్రత్యేక శిక్షణ వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. పెరుగుతున్న జనాభా, భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను దృష్టిలో ఉంచుకుని యానాం పోలీస్‌స్టేషన్‌ను మరింత పటిష్టంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐలు కౌమార్, ఇలంగో, తిరునావుక్కరసు, రమణమూర్తి, దాసరి పట్టాభి రామయ్య, సోషల్ వర్కర్ డి.అనిత, మల్లాడి రాజు, ఎం.సత్తిబాబు పాల్గొన్నారు.









కామెంట్‌లు (0)