సోమవారం, 21 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రెండేళ్ళలో ఐకానిక్ భవనాల నిర్మాణం : మంత్రి నారాయణ

12 సెప్టెంబర్, 2026

Construction of iconic buildings in two years: Minister Narayana
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 12, 2026, 02:49 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

రాజధాని నిర్మాణ పనుల పురోగతిపై మంత్రి నారాయణ సమీక్ష


ప్రజాశక్తి - తుళ్లూరు (గుంటూరు) : అమరావతి రాజధాని నిర్మాణ పనులను నిర్దేశిత ప్రణాళిక ప్రకారం వేగంగా పూర్తి చేయాలని, ఐకానిక్ భవనాల నిర్మాణాన్ని రెండేళ్లలో పూర్తి చేసేలా పనుల్లో వేగం పెంచాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను ఆదేశించారు. నిర్మాణ పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, ఎదురయ్యే సమస్యలను తక్షణమే పరిష్కరించుకోవాలని సూచించారు. అమరావతిలోని రాయపూడి సి ఆర్ డి ఎ కార్యాలయంలో శనివారం రాజధాని నిర్మాణ పనుల పురోగతిపై మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇంజినీర్ ఇన్ చీఫ్ గోపాలకృష్ణారెడ్డి, చీఫ్ ఇంజినీర్లు, వివిధ నిర్మాణ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమీక్షలో ప్రధానంగా అమరావతిలో నిర్మిస్తున్న ఐకానిక్ భవనాల నిర్మాణ పనుల పురోగతిపై చర్చించారు. జీఏడీ టవర్, హెచ్‌ఓడీ టవర్లు, అసెంబ్లీ భవన నిర్మాణ పనులు ఏ దశలో ఉన్నాయనే అంశాలను అధికారులు మంత్రికి వివరించారు. అమరావతిలోని ఐకానిక్ భవనాలకు సంబంధించి ఐదు టవర్లకు స్టీల్ డయాగ్రిడ్ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని అధికారులు మంత్రికి వివరించారు. నిర్మాణ పనుల్లో సాధించిన పురోగతిని, ప్రస్తుతం జరుగుతున్న పనుల వివరాలను సమీక్షలో వెల్లడించారు. అసెంబ్లీ భవన నిర్మాణానికి సంబంధించి కీలకమైన స్పైర్ (ఎత్తైన శిఖరం) నిర్మాణ పనులను వారం రోజుల్లో ప్రారంభించనున్నట్లు నిర్మాణ సంస్థ ప్రతినిధులు మంత్రికి తెలిపారు. అసెంబ్లీ భవన నిర్మాణంలో స్పైర్ పనులు ప్రారంభం కానుండటంతో తదుపరి దశ నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయనున్నట్లు వివరించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్