గురువారం, 09 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

వేతనాలు పెంచాలని ఈ నెల 30న కలెక్టరేట్ ఎదుట ధర్నా

2 గంటల క్రితం

citu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 09, 2026, 02:52 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

సిఐటియు పల్నాడు జిల్లా కార్యదర్శి ఎస్ ఆంజనేయులు నాయక్

కార్మిక లోకం కదిలి రావాలని పిలుపు...

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : ప్రైవేట్ రంగ కార్మికులకు ఐదేళ్లుగా పెండింగ్‌ లో ఉన్న కనీస వేతనాలను తక్షణమే సవరించి కర్ణాటక రాష్ట్రంతో సమానంగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 30న జిల్లా కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు సిఐటియు పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ ఆంజనేయులు నాయక్ పేర్కొన్నారు. ఈ ధర్నాకు కార్మిక లోకం పెద్దఎత్తున తరలిరావాలని ఆయన డిమాండ్‌ చేశారు. గురువారం నరసరావుపేట పట్టణం కోటప్పకొండ రోడ్డు లోని పల్నాడు విజ్ఞాన కేంద్రంలో సిఐటియు పల్నాడు జిల్లా అధ్యక్షులు బండ్ల మహేష్ అధ్యక్షతన జరిగిన జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ ఆంజనేయులు నాయక్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 66 రంగాల్లో ప్రైవేట్ యాజమాన్యాల వద్ద పని చేస్తున్న 50 లక్షల మందికి పైగా కార్మికులకు చట్ట ప్రకారం ఐదేళ్లకోసారి జరగాల్సిన కనీస వేతనాల సవరణ 2012, 2017, 2022 సంవత్సరాల్లో వరుస ప్రభుత్వాలు అమలు చేయలేదన్నారు. కాంగ్రెస్, టిడిపి, వైసిపి, ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఈ విషయంలో కార్మికులకు అన్యాయం చేశాయన్నారు. వేతనాల సవరణ జరగకపోవడంతో యాజమాన్యాలకు వేల కోట్ల లాబాలు చేకూరాయని, కార్మికులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ప్రస్తుతం హెల్పర్, ఆఫీస్ బాయ్, అన్ స్కిల్డ్ కార్మికులకు విడిఏ కలిపి నెలకు రూ 12 వేల నుంచి రూ 13 వేల మధ్యే కనీస వేతనం ఉందని, చట్టం ప్రకారం గడువు ముగిసిన ప్రతిసారి విడిఏ బేసిక్ వేతనంలో విలీనం చేసి 15 నుంచి 20 శాతం చొప్పున వేతనాలు పెంచి ఉంటే ప్రస్తుతం కనీస వేతనం రూ 19 వేల నుంచి రూ 22 వేల వరకు చేరుకునేదని వివరించారు. ధరల పెరుగుదలతో జీవన వ్యయం గణనీయంగా పెరిగిందన్నారు. యాజమాన్యాలు, కార్మిక సంఘాలు, ప్రభుత్వాల భాగస్వామ్యంతో జరిగిన 15 వ భారత కార్మిక మహాసభ తీర్మానాలు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం కార్మికుడి ఆహారం, దుస్తులు, గృహవసతి, రవాణా, విద్య, ఆరోగ్యం, సామాజిక అవసరాలకు కనీస వేతనం నెలకు రూ 26 వేలు ఉండాలని డిమాండ్ చేశారు.


సిఐటియు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు గుంటూరు విజయ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణలో ఇటీవల కనీస వేతనాలు రూ 14 వేల నుంచి రూ 16 వేలకు పెంచారని అన్నారు. కర్ణాటకలో 60 శాతం వరకు పెంచారని, అన్స్కిల్డ్ కార్మికులకు రూ 20,350 నుంచి రూ 24,407 వరకు, సెమీ స్కిల్డ్ కార్మికులకు రూ 22,282 నుంచి రూ 26,745 వరకు, స్కిల్డ్ కార్మికులకు రూ 24,407 నుంచి రూ 29,316 వరకు, హైలీ స్కిల్డ్ కార్మికులకు రూ 26,745 నుంచి రూ.32,145 వరకు నిర్ణయించారని అన్నారు. అదే విధానం ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌ లను రాష్ట్రంలో అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం నిబంధనలు రూపొందించడం కార్మిక హక్కులకు పూర్తి విరుద్ధమన్నారు. 6 నెలలకు ఒకసారి చెల్లించాల్సిన విడిఏ, 8 గంటలకు మించి పని చేసిన వారికి అదనపు వేతనాలు చెల్లించడం వంటి చట్టబద్ధమైన హక్కులు అమలు చేయాల్సి ఉండగా కార్మిక శాఖ తనిఖీలు లేకపోవడంతో యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. ఈ పరిస్థితులకు వ్యతిరేకంగా కార్మికులంతా ఐక్యంగా పోరాడాలని అన్నారు. కనీస వేతనాల పెంపు, కార్మిక హక్కుల పరిరక్షణ కోసం ఈ నెల 30 న కలెక్టరేట్‌ వద్ద జరిగే ధర్నా జయప్రదం చేయాలన్నారు. సమావేశంలో సిఐటియు నాయకులు డి.శివకుమారి, పి.వెంకటేశ్వర్లు, జి.మల్లీశ్వరి, బి.సూరిబాబు, కె. హనుమంత రెడ్డి, సహాయ కార్యదర్శులు టి.శ్రీనివాసరావు, వేముల వెంకట్రావు, ఎం.రత్నకుమారి, షేక్ సిలార్ మసూద్, కోశాధికారి ఎం.హరిపోతు రాజు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్