శనివారం, 10 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రారంభమైన పాల రైతుల సంఘం జిల్లా మహాసభ

1 గంట క్రితం

rythu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 10, 2026, 01:43 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- పాడి రైతుల సమస్యల పరిష్కారానికి ఉద్యమిస్తాం

- లీటరు పాలకు రూ.100 కనీస ధర ప్రకటించాలి

- పాడి, పంటలను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే:

- ఎపి పాల రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కంచుమాటి అజయ్‌కుమార్

ప్రజాశక్తి-తెనాలి రూరల్: ఆంధ్రప్రదేశ్ పాల రైతుల సంఘం గుంటూరు జిల్లా తొలి మహాసభ శుక్రవారం తెనాలిలో ప్రారంభమైంది. స్థానిక ఐతానగర్‌లోని నన్నపనేని సీతారామయ్య, సరస్వతమ్మ కళ్యాణమండపంలో నిర్వహించిన ప్రధమ మహాసభకు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కంచుమాటి అజయ్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా నలుమూలల నుంచి పాడి, పంటల రైతులు పాల్గొన్నారు. ఎపి రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ములకా శివసాంబిరెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో తొలుత అఖిల భారత కిసాన్‌ సభ జాతీయ ఉపాధ్యక్షుడు కామ్రేడ్‌ సారంపల్లి మల్లారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అజయ్ కుమార్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పాడి, పంటలు ప్రజల జీవనాధారమని, పాడి పరిశ్రమ కుంటుపడితే పౌష్టికాహారానికి దూరమయ్యే దుస్థితి నెలకుటుందని పేర్కొన్నారు. పాడి పరిశ్రమ సంక్షోభంలోకి నెట్టబడితే పాల సేకరణ కేంద్రాలు, పాల పరిశ్రమలు మూతపడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పాల రైతులను, పాడి పరిశ్రమను రక్షించేందుకు ప్రభుత్వాలు చొరవ చూపాలని కోరారు. పాడి పరిశ్రమ అభివృద్ధి రైతుల సమస్యలపై డిమాండ్లను ప్రతిపాదిస్తూ ఈ సభలో తీర్మానం చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ సభ ద్వారా జిల్లావ్యాప్త కమిటీలను మండలాల వారిగా ఏర్పాటు చేసి, తద్వారా పాల, పాడి రైతుల సమస్యలపై ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఎపి రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ములకా శివసాంబిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పాడి రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని తెలిపారు. పాల ఉత్పత్తికి పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదన్నారు. లీటరు పాలకు కనీస ధర రూ.100 ప్రకటించాలని, ప్రభుత్వం లీటరుకు రూ.5 ప్రోత్సాహక ధర అందించాలని డిమాండ్‌ చేశారు. వరి గడ్డితోపాటు పశువుల దాణాను 75 శాతం రాయితీతో సరఫరా చేయాలని కోరారు. వాతావరణ పరిస్థితుల కారణంగా పశువులకు అవసరమైన పచ్చగడ్డి, ఇతర మేతను పొరుగు జిల్లాల నుంచి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. పశువైద్యశాలల్లో వైద్యులు, సిబ్బంది ఖాళీలను భర్తీ చేయడంతోపాటు అవసరమైన ఔషధాలను అందుబాటులో ఉంచాలని ప్రభుత్వాన్ని కోరారు. పాల రైతుల సమస్యలపై ప్రభుత్వం స్పందించి పాడి పరిశ్రమ పరిరక్షణకు సమగ్ర చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎపి పాల రైతుల సంఘం రాష్ట్ర కమిటి సభ్యురాలు వేజెండ్ల తబిత, సిఐటియూ జిల్లా ఉపాధ్యక్షుడు కొల్లిపర బాబు ప్రసాద్‌, తెనాలి కమిటీ కార్యదర్శి షేక్‌ హుస్సేన్‌ వలి, పలువురు రైతులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్