5.90 ఎకరాల్లో రూ.18.55 కోట్ల వ్యయంతో మోడరన్ రైతు బజార్ నిర్మాణం
ప్రజాశక్తి-మంగళగిరి (గుంటూరు) : దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరిని తీర్చిదిద్దేందుకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో వేగంగా అడుగులు పడుతున్నాయి. మంగళగిరి పట్టణం నిడమర్రు రైల్వే గేట్ వద్ద ఆధునిక హంగులతో మోడరన్ రైతు బజార్ నిర్మాణ పనులకు గురువారం విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ భూమిపూజ, శంకుస్థాపన చేశారు. ముందుగా నిడమర్రు రోడ్డులోని శంకుస్థాపన ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు ఘనస్వాగతం పలికారు. అనంతరం మోడరన్ రైతు బజార్ నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ప్రాజెక్టు నమూనా చిత్రాలను పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆధునిక హంగులతో మంగళగిరిలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఏర్పాటు మంగళగిరి ప్రజలు, రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మంత్రి లోకేష్ మోడరన్ రైతు బజార్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 5.90 ఎకరాల విస్తీర్ణంలో, అరబిందో ఫార్మా ట్రస్ట్ సీఎస్ఆర్ నిధులు రూ.18.55 కోట్ల వ్యయంతో ఈ రిటైల్&హోల్ సేల్ కూరగాయల మార్కెట్ ను నిర్మించనున్నారు. ఆధునిక సౌకర్యాలతో పరిశుభ్రంగా, వినియోగదారులకు అనుకూలంగా, పర్యావరణహితంగా ఉండేలా ఈ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను ఏర్పాటుచేయనున్నారు. మొత్తం నిర్మాణ విస్తీర్ణం 71,925 చదరపు అడుగులు. రిటైల్ మార్కెట్ లో కూరగాయల విక్రయాల కోసం 102 స్టాళ్లు, పండ్లు, పూల విక్రయాల కోసం 54 ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేస్తారు. ఇతర రకాల వస్తువుల కోసం మొత్తం 60 షాపులు ఏర్పాటుచేస్తారు. హోల్ సేల్ మార్కెట్ లో అన్ లోడింగ్ ప్లాట్ ఫామ్స్ 18, కూరగాయల షాపులు 23 ఉండనున్నాయి. కోల్డ్ స్టోరేజీ, వెజిటబుల్ వాష్ ఏరియాస్, అడ్మిన్, మెయింటెనెన్స్ ఏరియాస్, క్యాంటీన్, మరుగుదొడ్లు నిర్మించనున్నారు. సరుకులు తరలించే వాహనాలు, టూ వీలర్స్, ఫోర్ వీలర్స్ కోసం పార్కింగ్ సౌకర్యం కల్పించనున్నారు.ఈ కార్యక్రమంలో అరబిందో ఫార్మా ట్రస్ట్ వైస్ ప్రెసిడెంట్ జీ.భీముడు, ఎంటీఎంసీ కమిషనర్ షేక్ అలీమ్ బాషా, పద్మశాలీ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ నందం అబద్దయ్య, ఏపీఎంఎస్ఐడీసీ ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీ దేవి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు గుత్తికొండ ధనుంజయరావు, గుంటూరు పార్లమెంట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, మంగళగిరి పట్టణ టీడీపీ అధ్యక్షుడు పడవల మహేష్, రూరల్ అధ్యక్షుడు పల్లబోతుల శ్రీనివాసరావు, తాడేపల్లి పట్టణ టీడీపీ అధ్యక్షుడు వల్లభనేని వెంకట్రావు, దుగ్గిరాల మండల టీడీపీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీఅనిత పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)