- క్లాప్ కొట్టిన జిల్లా ఎస్పి వఖుల్ జిందాల్
- సిని దర్శకులు దిలీప్ రాజా దర్శకత్వంలో సీన్8మా చిత్రీకరణ
ప్రజాశక్తి - తెనాలి : యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా చైతన్యపరిచే లక్ష్యంతో రూపొందిస్తున్న "డ్రగ్స్ వద్దు బిడ్డ" థియేట్రికల్ యాడ్ ఫిల్మ్ చిత్రీకరణకు గురువారం తెనాలి గాంధీచౌక్ కూడలి వేదికగా ఘనంగా శ్రీకారం చుట్టారు. సినీ దర్శకులు దిలీప్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ లఘు చిత్రానికి జిల్లా ఎస్పి వఖుల్ జిందాల్ క్లాప్ కొట్టి చిత్రీకరణను ప్రారంభించగా, రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ రాయపాటి శైలజ కెమెరా స్విచ్ ఆన్ చేసి తొలి సన్నివేశాన్ని ప్రారంభించారు. సీనియర్ సినీ నటులు నరసింహ రాజుతో తీసిన సన్నివేశాన్ని వఖుల్ జిందాల్ క్లాప్ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పి వఖుల్ జిందాల్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత సమాజంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం, పోలీసు శాఖ సమన్వయంతో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డ్రగ్స్ వినియోగం కారణంగా యువత భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లడమే కాకుండా కుటుంబాలు, సమాజం తీవ్రంగా నష్టపోతాయని పేర్కొన్నారు. డ్రగ్స్ క్రయవిక్రయాలు, అక్రమ రవాణాపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకుంటూనే, మరోవైపు ప్రజల్లో చైతన్యం కల్పించే కార్యక్రమాలను నిరంతరం చేపడుతున్నామని చెప్పారు. పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థల్లో ఇప్పటికే 'సంకల్పం' వంటి అవగాహన కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు మత్తు పదార్థాల దుష్పరిణామాలను వివరిస్తున్నామని, ఇప్పుడు థియేటర్ల ద్వారా మరింత విస్తృతంగా ప్రజలను చేరుకునేందుకు ఈ సందేశాత్మక యాడ్ ఫిల్మ్‌ను రూపొందిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. సామాజిక బాధ్యతతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ ఆదరించాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెనాలి ఆర్డిఓ శ్రీరమణి, సహాయ కమీషనర్ రామారావు, తెనాలి సిఐ లు సిహెచ్ రాంబాబు, డి రవీంద్రబాబు, ఎస్ సాంబశివరావు, షేక్ నాయబ్ రసూల్ తదితరులు పాల్గున్నారు.








కామెంట్‌లు (0)