* చిలకలూరిపేటలో నేలకూలిన భారీ వృక్షాలు.. స్తంభించిన రాకపోకలు
* అర్ధరాత్రి 2 గంటల నుంచి నిలిచిన విద్యుత్ సరఫరా.. ఎన్నికల ఫలితాలు తెలియక ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ
ప్రజాశక్తి -చిలకలూరిపేట : ఈదురుగాలులు, భారీ వర్షాలతో మురుసు తుఫాన్ ప్రభావం చిలకలూరిపేటలో తీవ్రంగా కనిపించింది. అర్ధరాత్రి వేళ మురుసు పెను విధ్వంసం సృష్టించింది.
నేలమట్టమైన వృక్షాలు.. స్తంభించిన రవాణా:
అర్ధరాత్రి వీచిన పెనుగాలుల ధాటికి చిలకలూరిపేట పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో అనేక చోట్ల భారీ వృక్షాలు నేలకూలాయి. ప్రధాన రహదారులు, అంతర్గత వీధుల్లో భారీ చెట్లు విరిగి పడటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. విద్యుత్ తీగలు తెగిపడటం, చెట్లు విరిగి ట్రాన్స్‌ఫార్మర్లపై పడటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. రాత్రి 2:00 గంటల నుంచే విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. కరెంటు పునరుద్ధరణ కాకపోవడంతో పట్టణవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో పాటు గృహ అవసరాలకు కష్టాలు మొదలయ్యాయి.
మూగబోయిన నెట్‌వర్క్‌లు.. ఎలక్షన్ టెన్షన్:
విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో సెల్ టవర్లకు బ్యాకప్ అందక మొబైల్ నెట్‌వర్క్‌లు పూర్తిగా మూగబోయాయి. ఫోన్ కాల్స్, ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడంతో పట్టణ వాసులు ఎన్నికల ఫలితాల గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అధికారులు స్పందించి రహదారులపై పడిన చెట్లను తొలగించి, విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థలను పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు.








కామెంట్‌లు (0)