పాట్నా : 15 ఏళ్ల నాటి ఎన్నికల నియమావళి ఉల్లంఘన (ఎంసిసి) కేసులో ఆర్‌జెడి అధ్యక్షుడు లాలూ యాదవ్ శుక్రవారం సివాన్ జిల్లా కోర్టుకు హాజరయ్యారు. అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ (ఎసిజెఎం-1) అరవింద్ కుమార్ సింగ్ విచారణ చేపడుతున్నారు.
వివరాల ప్రకారం.. 2011 అక్టోబర్‌లో సివాన్ జిల్లా దరౌండా అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికల సమయంలో ఆర్‌జెడి అభ్యర్థి పరమేశ్వర్ సింగ్ తరఫున లాలూ యాదవ్ ప్రచారం చేశారు. ఆయన సభకు ఆలస్యంగా రావడం, సెక్షన్ 144, లౌడ్ స్పీకర్ చట్టం కింద నిషేధాజ్ఞలను ఉల్లంఘించి సభను ఉద్దేశించి ప్రసంగించడం కొనసాగించారని జిల్లా ఎన్నికల అధికారులు తెలిపారు. అవసరమైన పరిపాలనా అనుమతులు లేకుండా పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ (మైక్రోఫోన్ మరియు లౌడ్ స్పీకర్లు) ఉపయోగించారని అన్నారు. ఎన్నికల మేజిస్ట్రేట్లు, స్థానిక పోలీసులు వేదికపైకి వచ్చి, లౌడ్ స్పీకర్లను ఆపి వేసి, ప్రసంగాన్ని నిలిపివేసేందుకు పోడియం నుండి మైక్రోఫోన్‌ను స్వాధీనం చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పార్టీ మద్దతుదారులలో గందరగోళం చెలరేగింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ధిక్కరించినందుకు లాలూ యాదవ్, అభ్యర్థి పరమేశ్వర్ సింగ్‌పై ఐపిఎస్, ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సంబంధిత నిబంధనల కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. సుదీర్ఘకాలం కొనసాగిన ఈ విచారణ ప్రక్రియలో, ఆర్‌జెడి నేత పరమేశ్వర్ సింగ్ మరణించారు. లాలూ ప్రసాద్ యాదవ్‌పై కోర్టు అభియోగాలను నమోదు చేసి, తదుపరి విచారణా నిమిత్తం కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. దీంతో శుక్రవారం కోర్టుకు హాజరైన అనంతరం ఆయన వెళ్లేందుకు అనుమతించింది.








కామెంట్‌లు (0)