సోమవారం, 21 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

'వికసిత్ భారత్ 2047', 'స్వర్ణాంధ్ర' నిర్మాణంలో వర్సిటీల పాత్ర కీలకం : గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్

11 సెప్టెంబర్, 2026

Universities play a pivotal role in building 'Viksit Bharat 2047' and 'Swarnandhra': Governor Justice S. Abdul Nazeer.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 11, 2026, 03:25 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ స్వర్ణోత్సవాలు ఘనం

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నాణ్యమైన విద్యా ప్రమాణాలే ఏఎన్‌యూ బలం

బోధన, పరిశోధనలే రెండు కళ్లు


గుంటూరు : రాష్ట్రం, దేశ సమగ్రాభివృద్ధికి, 'స్వర్ణాంధ్ర' - 'వికసిత్ భారత్ 2047' లక్ష్యాల సాధనలో విశ్వవిద్యాలయాలు కీలక పాత్ర పోషించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. సమాజానికి విజ్ఞానాన్ని, సేవలను అందిస్తూ 50 వసంతాల అంకితభావాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ... శుక్రవారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ANU) ప్రాంగణంలో నిర్వహించిన స్వర్ణోత్సవ (గోల్డెన్ జూబ్లీ) వేడుకలకు గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.


50 ఏళ్ల ఘన చరిత్ర ....

దక్షిణ కోస్తా ప్రాంత ప్రజలకు ఉన్నత విద్యను చేరువ చేయాలనే ఆశయంతో 1967లో నల్లపాడులో ఆంధ్ర విశ్వవిద్యాలయ పీజీ కేంద్రంగా ప్రారంభమైన ఈ సంస్థ, 1976 సెప్టెంబర్ 11న నాటి భారత రాష్ట్రపతి ఫకృద్దీన్ అలీ అహ్మద్ చేతుల మీదుగా పూర్తి స్థాయి విశ్వవిద్యాలయంగా రూపాంతరం చెందిందని గవర్నర్ గుర్తు చేశారు. 10 విభాగాలు, 600 మంది విద్యార్థులతో మొదలైన ప్రస్థానం నేడు 6,000 మంది విద్యార్థులు, వందలాది మంది పరిశోధకులతో అద్భుత ప్రగతి సాధించిందని కొనియాడారు.


బౌద్ధ అధ్యయన కేంద్రం ఏర్పాటు ప్రతిపాదన ....

రెండవ శతాబ్దానికి చెందిన మహోన్నత తత్వవేత్త, మహాయాన బౌద్ధమత మూలపురుషుడు, రసాయన–వైద్య రంగాల్లో విశిష్ట పరిశోధనలు చేసిన 'రెండవ బుద్ధుడు' ఆచార్య నాగార్జునుని పేరును ఈ సంస్థకు పెట్టడం ఎంతో గర్వకారణమని గవర్నర్ పేర్కొన్నారు.


ప్రతిష్టాత్మక ర్యాంకింగ్స్‌లో ముందంజ ....

నాక్ (NAAC):4 పాయింట్లకు గాను 3.46 సీజీపీఏతో ప్రతిష్టాత్మక 'A+' గ్రేడ్ గుర్తింపు సాధించడం.

క్యూఎస్ & ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్స్ : క్యూఎస్ (QS) ఆసియా ర్యాంకింగ్స్‌లో రాష్ట్రంలోనే నంబర్ 1 స్థానాన్ని, ఎన్‌ఐఆర్‌ఎఫ్ (NIRF) ర్యాంకింగ్స్‌లో రాష్ట్రంలో రెండో స్థానాన్ని దక్కించుకోవడం వర్సిటీ అకడమిక్ శ్రేష్ఠతకు నిదర్శనమని గవర్నర్ అభినందించారు.


పూర్వ విద్యార్థుల సేవలు గర్వకారణం ....

భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ (ఈ సందర్భంగా జస్టిస్ ఎన్.వి. రమణ తనకు కూడా ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారని గవర్నర్ గుర్తుచేసుకున్నారు), వివిధ హైకోర్టుల న్యాయమూర్తులు, మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, త్రివిధ దళాల అధికారులు, అంతర్జాతీయ శాస్త్రవేత్తలు, వ్యాపారవేత్తలను ఈ యూనివర్సిటీ దేశానికి అందించిందని ప్రశంసించారు.


బోధన, పరిశోధనలే రెండు కళ్లు ....

ఏ విశ్వవిద్యాలయానికైనా బోధన, పరిశోధనలు రెండు కళ్ల వంటివని; పుస్తక విజ్ఞానానికి, వాస్తవ సమాజ అవసరాలకు మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చేందుకు సాంకేతిక ఆధారిత విద్య, ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు. అనంతరం ఆచార్య నాగార్జునుడి తాత్విక సూక్తులను ఉటంకిస్తూ, సంస్థ పునాదికి విశేష కృషి చేసిన విద్యావేత్తలకు, అధ్యాపకులకు గవర్నర్ వినమ్ర నివాళులర్పించారు. ఈ వేడుకల్లో రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఇన్‌ఛార్జ్ ఛైర్మన్ విజయ భాస్కరరావు, వైస్ ఛైర్‌పర్సన్ ప్రొఫెసర్ కె. రత్న షీలమణి, ఏఎన్‌యూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కె. గంగాధరరావు, రెక్టార్, రిజిస్ట్రార్, పాలకమండలి సభ్యులు, డీన్లు, అధ్యాపకులు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Universities play a pivotal role in building 'Viksit Bharat 2047' and 'Swarnandhra': Governor Justice S. Abdul Nazeer.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్