గురువారం, 29 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కడలిపాలైన గూడు.. కన్నీటిపాలైన బతుకు !

1 గంట క్రితం

A home lost to the sea a life turned to tears
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 29, 2026, 04:53 అపరాహ్నం | 6 నిమిషాల చదవడం

అర్నాబ్ తుఫానుతో నేలమట్టమైన ఇళ్లు.. సముద్రంలో కలిసిన సర్వస్వం

సూరాడిపేట, మాయాపట్నం, కోనపాపేట లో సుమారు 35 ఇళ్లు ధ్వంసం.. పట్టించుకునే నాథుడెక్కడంటూ మత్స్యకారుల ఆవేదన

హామీలకే పరిమితమైన రక్షణ గట్టు నిర్మాణం.. మరో తుఫాను హెచ్చరికతో కంటిమీద కునుకు లేని తీరప్రాంత ప్రజలు


ప్రజాశక్తి - యు.కొత్తపల్లి (కాకినాడ) : కడలి అలలే వారికి జీవనాధారం.. అదే కడలి ఇప్పుడు వారి పాలిట కాలయమైంది. రెక్కల కష్టంతో కూడబెట్టుకున్న సొమ్ము, ఆప్యాయంగా కట్టుకున్న ఇల్లు, జీవితానికి ఆధారమైన వస్తువులు.. ఒక్కసారిగా సముద్రపు అలల ధాటికి కొట్టుకుపోయాయి. కట్టుబట్టలతో మిగిలిన మత్స్యకార కుటుంబాలు ఇప్పుడు ఉండటానికి ఇల్లు లేక, తలదాచుకోవడానికి నీడ లేక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నాబ్ తుఫాను ఉప్పాడ, కొనపాపేట తీరప్రాంత మత్స్యకారుల జీవితాలను అతలాకుతలం చేసింది. ముఖ్యంగా సూరాడిపేట, మాయాపట్నం ప్రాంతాల్లో సుమారు 20 ఇళ్ల వరకు ధ్వంసమైనట్లు బాధితులు చెబుతున్నారు. అలాగే కోనపాపేటలో సుమారు 15 ధ్వంసమైనట్లు చెప్తున్నారు. ఇళ్లతో పాటు నిత్యావసర వస్తువులు, ఇంటి సామగ్రి, నగదు సైతం సముద్రం పాలయ్యాయని కన్నీరుమున్నీరవుతున్నారు.
011


కళ్లముందే కూలిన ఇళ్లు.. గుండెల్లో మిగిలిన గాయం !

ఎన్నో ఏళ్లుగా కష్టపడి నిర్మించుకున్న ఇళ్లు కళ్లముందే కూలిపోతుంటే ఆ కుటుంబాల వేదన వర్ణనాతీతం. తుఫాను ఉధృతికి సముద్రపు అలలు గ్రామాల వైపు దూసుకొచ్చి ఇళ్లను ముంచెత్తడంతో ఏం చేయాలో తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపామని బాధితులు వాపోతున్నారు. ఇంట్లోని వస్తువులను కాపాడుకునే అవకాశం కూడా లేకుండా పోయిందని చెబుతున్నారు. నిత్యం సముద్రంలో వేటకు వెళ్లి కుటుంబాన్ని పోషించుకునే తాము, ఇప్పుడు బతకడానికి అవసరమైన కనీస వస్తువులు కూడా లేకుండా పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


ఇల్లు అంటే నాలుగు గోడలు మాత్రమే కాదు.. ఎన్నో ఆశలు, మరెన్నో జ్ఞాపకాలు. పిల్లల భవిష్యత్తు కోసం దాచుకున్న డబ్బు, కుటుంబానికి అవసరమైన సామగ్రి, కష్టపడి సంపాదించిన ఆస్తి అంతా కడలి పాలవడంతో బాధిత కుటుంబాలు తీవ్ర మనోవేదనకు గురవుతున్నాయి. నిన్నటివరకు తమదైన ఇంట్లో జీవించిన వారు నేడు ఎక్కడ తలదాచుకోవాలో తెలియక బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.

022


తెగిపోయిన గుడిసెలే తాత్కాలిక నీడలు !


తుఫాను బీభత్సానికి ఇళ్లు నేలమట్టం కావడంతో బాధితులకు కనీసం రాత్రిపూట తలదాచుకునే చోటు కూడా లేకుండా పోయింది. దెబ్బతిన్న గుడిసెల పక్కనే మిగిలిన శిథిలాల మధ్య కాలం వెళ్లదీస్తున్నామని వారు చెబుతున్నారు. ఏ క్షణంలో మళ్లీ అలలు విరుచుకుపడతాయో, ఎప్పుడు మరో ప్రమాదం ముంచుకొస్తుందోనన్న భయంతో జీవిస్తున్నామని వాపోతున్నారు.


ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఉన్న కుటుంబాల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఇల్లు కోల్పోయిన కుటుంబాలకు తక్షణమే ఆశ్రయం కల్పించి, నిత్యావసర వస్తువులు అందించాల్సిన అవసరం ఉన్నప్పటికీ, తమను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు తగిన చర్యలు తీసుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. తుఫాను వస్తోందని, పునరావాస కేంద్రాలకు వెళ్లాలని చెప్పి అధికారులు వెళ్లిపోతున్నారే తప్ప, తమను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


తుఫాను వచ్చినప్పుడే పరామర్శలు.. ఆ తర్వాత మరిచిపోతారా ?


ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన ప్రతిసారీ అధికారులు, రాజకీయ నాయకులు తీరప్రాంత గ్రామాలకు వచ్చి బాధితులను పరామర్శించడం, హామీలు ఇవ్వడం పరిపాటిగా మారిందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తుఫాను సమయంలో తమ కష్టాలను అడిగి తెలుసుకుంటున్న వారు, విపత్తు ముగిసిన తర్వాత తమ సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు.


ప్రభుత్వాలు మారుతున్నాయి.. అధికారులు మారుతున్నారు.. రాజకీయ నాయకులు మారుతున్నారు.. కానీ తమ బతుకుల్లో మాత్రం మార్పు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు గుప్పించి వెళ్లిపోతున్న నాయకులు, తీరప్రాంత ప్రజల శాశ్వత రక్షణ కోసం మాత్రం తగిన చర్యలు తీసుకోవడం లేదని వాపోతున్నారు.


రూ.323 కోట్ల రక్షణ గట్టు ఎప్పుడు నిర్మిస్తారు ?


ఉప్పాడ తీరప్రాంతాన్ని సముద్రపు కోత నుంచి రక్షించేందుకు రక్షణ గట్టు నిర్మాణం చేపడతామని గతంలో హామీలు ఇచ్చారని మత్స్యకారులు గుర్తుచేస్తున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రక్షణ గట్టు నిర్మాణానికి సుమారు రూ.323 కోట్ల వ్యయంతో ప్రణాళిక రూపొందించి, మద్రాస్ ఐఐటీ నిపుణులతో అవగాహన ఒప్పందం చేసుకున్నట్లు ప్రకటించారని వారు పేర్కొంటున్నారు. అయితే, తమకు తెలిసినంతవరకు ఇప్పటికీ క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభం కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


సముద్రపు కోత ఏటేటా పెరుగుతున్నా, అలల తీవ్రతతో నివాసాలు దెబ్బతింటున్నా శాశ్వత రక్షణ చర్యలు ఎప్పుడు చేపడతారో తెలియని పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. రక్షణ గట్టు నిర్మాణం కాగితాలకే పరిమితం కాకుండా, తీరప్రాంత ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడేలా పనులు వేగంగా చేపట్టాలని కోరుతున్నారు.


సముద్రంలో నడిచినా.. ఇంట్లో ఉన్నా ప్రమాదమే !


తీరప్రాంత మత్స్యకారుల బతుకు నిత్యం దినదినగండంగా మారిందని బాధితులు చెబుతున్నారు. ఒకవైపు జీవనోపాధి కోసం సముద్రంలోకి వెళ్లాల్సిన పరిస్థితి.. మరోవైపు అదే సముద్రం నుంచి ఎప్పుడు ప్రమాదం ముంచుకొస్తుందోనన్న భయం. సముద్రపు నీరు ఇళ్లలోకి చొచ్చుకురావడంతో నడిచేందుకు కూడా వీలులేకుండా పోయిందని వాపోతున్నారు. నీటిలో కలిసివచ్చిన పింకులు, గుల్లలు, చేపల ముళ్లు తదితరాలు కాళ్లకు గుచ్చుకుని గాయాలపాలవుతున్నామని చెబుతున్నారు.


ఒకవైపు ఇళ్లు కోల్పోయి, మరోవైపు ఉపాధి దెబ్బతిని, ఇంకోవైపు కుటుంబ సభ్యుల భద్రతపై ఆందోళనతో మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజువారీ సంపాదనపైనే ఆధారపడి జీవించే తమకు ఇళ్లు దెబ్బతినడం, ఇంటి సామగ్రి కోల్పోవడం కోలుకోలేని దెబ్బగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


మరో తుఫాను హెచ్చరికతో కంటిమీద కునుకు లేదు !


అర్నాబ్ తుఫాను సృష్టించిన విధ్వంసం నుంచి ఇంకా తేరుకోకముందే, మరో తుఫాను ముప్పు ఉందన్న హెచ్చరికలు తీరప్రాంత మత్స్యకారులను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే నివాసాలు కోల్పోయి, ఆర్థికంగా చితికిపోయిన తమ కుటుంబాల పరిస్థితి మరో విపత్తు వస్తే ఏమవుతుందోనని భయపడుతున్నారు. ఇళ్లు లేని వారు ఎక్కడికి వెళ్లాలి? పిల్లలను ఎక్కడ ఉంచాలి? తమకు మిగిలిన కొద్దిపాటి సామగ్రినైనా ఎలా కాపాడుకోవాలి? అన్న ప్రశ్నలు వారిని వెంటాడుతున్నాయి.


తుఫాను హెచ్చరికలు వచ్చిన ప్రతిసారీ గ్రామాలను అప్రమత్తం చేయడంతో పాటు, ప్రమాదకర ప్రాంతాల్లో నివసిస్తున్న కుటుంబాలను గుర్తించి సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించాలని వారు కోరుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, మహిళలకు అవసరమైన వసతి, తాగునీరు, ఆహారం, వైద్య సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


మా కన్నీటి గోడు వినేవారెవరు ?


“మా జీవితాలు ఎప్పటికీ ఇలాగే ఉండాలా? కష్టపడి ఇల్లు కట్టుకున్నాం. సముద్రం వచ్చి మా కళ్లముందే అన్నీ కొట్టుకుపోయాయి. ఇంట్లోని వస్తువులు, నగదు కూడా మిగల్లేదు. ఉండటానికి ఇల్లు లేదు.. తలదాచుకోవడానికి నీడ లేదు. తుఫాను వస్తే పునరావాస కేంద్రాలకు వెళ్లాలని చెబుతున్నారు కానీ, మమ్మల్ని సురక్షితంగా అక్కడికి తరలించే ఏర్పాట్లు మాత్రం చేయడం లేదు. తుఫాను వచ్చినప్పుడు వచ్చి పరామర్శించి వెళ్లిపోతున్నారు. మా కష్టాలు తీరాలంటే శాశ్వత పరిష్కారం చూపాలి. మా ఇళ్లను మళ్లీ నిర్మించుకునేందుకు సాయం చేయాలి. సముద్రం నుంచి రక్షణ కల్పించాలి. మా కన్నీటి గోడు వినేవారెవరు?” అంటూ మత్స్యకారులు కన్నీరుమున్నీరవుతున్నారు.


ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి !


సోరాడిపేట, మాయాపట్నం తదితర తీరప్రాంత గ్రామాల్లో దెబ్బతిన్న ఇళ్లను అధికారులు తక్షణమే పరిశీలించి, నష్టాన్ని అంచనా వేయాలని బాధితులు కోరుతున్నారు. పూర్తిగా ఇళ్లు కోల్పోయిన కుటుంబాలకు తాత్కాలిక నివాసం కల్పించడంతో పాటు, ఇళ్ల పునర్నిర్మాణానికి ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నిత్యావసర వస్తువులు కోల్పోయిన కుటుంబాలకు తక్షణ సాయం అందించి, పిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడకుండా చూడాలని కోరుతున్నారు.


అన్నింటికంటే ముఖ్యంగా ఉప్పాడ, కోనప్పపేట తీరప్రాంతాన్ని సముద్రపు కోత నుంచి రక్షించేందుకు శాశ్వత రక్షణ చర్యలు చేపట్టాలని, ప్రకటించిన రక్షణ గట్టు నిర్మాణంపై స్పష్టత ఇచ్చి పనులు ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు.


ప్రకృతి వైపరీత్యాలను పూర్తిగా ఆపడం సాధ్యం కాకపోవచ్చు.. కానీ ముందస్తు చర్యలు, పటిష్టమైన రక్షణ వ్యవస్థ, బాధితులకు సకాలంలో సహాయం అందించడం ద్వారా నష్టాన్ని తగ్గించవచ్చు. కడలిని నమ్ముకుని బతికే మత్స్యకారుల జీవితాలు ప్రతిసారీ తుఫానుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడకుండా ఉండాలంటే ప్రభుత్వ యంత్రాంగం చిత్తశుద్ధితో స్పందించాల్సిన అవసరం ఉంది.


పరామర్శలు కాదు చర్యలు తీసుకోవాలి : ఉప్పాడ సూరాడు పేట - సురాడ చిన్నారి


నాయకుల పరామర్శలు కాదని చర్యలు తీసుకోవాలి

తుఫాను అలల ధాటికి మా ఇళ్లు నేలమట్టమయ్యాయి.. ఉండటానికి ఇల్లు లేదు, తలదాచుకోవడానికి నీడ లేదు. కష్టపడి సంపాదించుకున్న వస్తువులన్నీ సముద్రం పాలయ్యాయి. కుటుంబాలతో కలిసి ఎక్కడ ఉండాలో తెలియక బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నాం. అధికారులు వచ్చి పరామర్శించి వెళ్తున్నారే తప్ప, మా కష్టాలను పట్టించుకునే నాథుడే లేడు. ఇల్లు కోల్పోయిన మమ్మల్ని ప్రభుత్వం ఆదుకుని, ఆర్థిక సాయం అందించడంతో పాటు శాశ్వత నివాసం కల్పించాలి”


గట్టు నిర్మాణం చేపట్టాలి - ఉప్పాడ సూరాడపేట - నీలపల్లి ఏసేపు


“సముద్రానికి అతి దగ్గరగా నివసిస్తున్నాం.. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని భయంతో బతుకుతున్నాం. తుఫాను అలల ధాటికి ఇళ్లు కోల్పోయి రోడ్డున పడ్డాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, మాకు సురక్షిత ప్రాంతాల్లో స్థలాలు కేటాయించి ఇళ్లు నిర్మించి ఇవ్వాలి. ప్రతిసారీ తుఫాన్లు వచ్చినప్పుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సిన పరిస్థితి నుంచి మమ్మల్ని కాపాడాలి. సముద్రపు కోతకు శాశ్వత పరిష్కారం చూపాలి. మా పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలి”


ఇంటి స్థలాలు కేటాయించాలి - ఉప్పాడ సంధ్య


సముద్రానికి అతి దగ్గరగా నివసిస్తున్నాం.. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని భయంతో బతుకుతున్నాం. తుఫాను అలల ధాటికి ఇళ్లు కోల్పోయి రోడ్డున పడ్డాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, మాకు సురక్షిత ప్రాంతాల్లో స్థలాలు కేటాయించి ఇళ్లు నిర్మించి ఇవ్వాలి. ప్రతిసారీ తుఫాన్లు వచ్చినప్పుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సిన పరిస్థితి నుంచి మమ్మల్ని కాపాడాలి. సముద్రపు కోతకు శాశ్వత పరిష్కారం చూపాలి. మా పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలి


సహాయ చర్యలు శూన్యం : ఉప్పాడ - సురాడ రాము


తుఫాను అలలతో సముద్రపు నీరు ఇళ్లలోకి చొచ్చుకురావడంతో నడవడానికి కూడా వీల్లేకుండా పోయింది. నీటితో కొట్టుకొచ్చిన గుల్లలు, చేపల ముళ్లు కాళ్లకు గుచ్చుకుని గాయాలపాలవుతున్నాం. ఇళ్లు కోల్పోయి, తినడానికి తిండి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. కనీసం తిన్నారా.. ఉన్నారా అని అడిగే నాథుడే లేడు. మా కష్టాలు చూసి ఆదుకునే వారు కనిపించడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిత్యావసర వస్తువులు, ఆర్థిక సాయం అందించాలి. మాకు శాశ్వత పరిష్కారం చూపి ఆదుకోవాలి


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్