* నీట మునిగిన వరి పొలాలు.. నిలిచిన విద్యుత్, నెట్‌వర్క్ సేవలు
ప్రజాశక్తి - కవిటి:
ఆర్నాబ్ తుపాను ఉద్దానం రైతాంగాన్ని ఉలిక్కిపడేలా చేసింది. తిత్లీ స్థాయిలో విధ్వంసం లేకపోయినా.. బుధవారం రాత్రి బలమైన గాలులు, భారీ వర్షం నాటి భయానక పరిస్థితులను మరోసారి కళ్లముందు నిలిపాయి. గురువారం ఉదయం కూడా బలమైన గాలులతో భారీ వర్షం కురవడంతో వందలాది ఎకరాల్లో వరి పంట నీట మునగ్గా.. కొబ్బరి, జీడి, మామిడి, పనస పంటలకు నష్టం వాటిల్లింది. ప్రాథమిక అంచనా ప్రకారం 582 మంది రైతులకు చెందిన 241.16 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించారు. మరోవైపు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో తాగునీటికి ప్రజలు అల్లాడారు. నెట్‌వర్క్ సేవలు స్తంభించడంతో దూర ప్రాంతాల్లో ఉన్న కుటుంబ సభ్యుల క్షేమసమాచారం తెలుసుకోలేక పలువురు ఆందోళన చెందారు.
నీట మునిగిన పొలాలు.. క్షేత్ర పరిశీలన
కవిటి మండలం పాత కొజ్జిరియా గ్రామ పరిధిలో వ్యవసాయ పొలాలు నీట మునిగాయి. ఒడిశా సరిహద్దును ఆనుకుని ఉన్న ఈ ప్రాంతంలో అధిక శాతం వ్యవసాయ భూములు ఆ రాష్ట్ర పరిధిలోకి వస్తాయని తహశీల్దార్ కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. పంట పొలాలు నీట మునిగిన విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు నెలవంక గ్రామ పరిధిలోని వరి పొలాలను వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు పరిశీలించి పంట నష్టాన్ని అంచనా వేశారు. సోంపేట ఏడీఏ నరసింహమూర్తి, ఎఓ శ్రీదేవితో పాటు డాక్టర్ వై. రాజశేఖర్, డాక్టర్ వి. హరికుమార్, డాక్టర్ బి. జ్యోతిబసు, డాక్టర్ ఎస్. కిరణ్‌కుమార్, డాక్టర్ ఎస్. అనూష క్షేత్ర పరిశీలనలో పాల్గొన్నారు.
మట్టిగోడ కూలి మేక, మూడు పిల్లలు మృతి
తుపాను ప్రభావంతో కవిటి మండలం లండారిపుట్టుగ పంచాయతీ పరిధిలోని కొత్తపుట్టుగలో మట్టిగోడ కూలి మేకతో పాటు మూడు పిల్లలు మృతి చెందాయి. నర్తు దుర్యోధనకు చెందిన ఈ మూగజీవాలను ఆర్‌సీసీ పైకప్పు కింద ఉంచగా, పక్కనే ఉన్న మట్టిగోడ కూలి పైకప్పుపై పడింది. దీంతో నాలుగు మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. ఘటనపై పశువైద్య సహాయకుడికి సమాచారం అందించినట్లు తహశీల్దార్ తెలిపారు.
విద్యుత్ లేక తాగునీటికి ఇబ్బందులు
తుపాను కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో దూగానపుట్టుగ పంచాయతీలో తాగునీటి సమస్య తలెత్తింది. ప్రజల ఇబ్బందులను గుర్తించి పంచాయతీ కార్యదర్శి ఆదేశాల మేరకు జనరేటర్ ఏర్పాటు చేసి నీటిని సరఫరా చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, మహిళలు పాల్గొన్నారు.
స్తంభించిన నెట్‌వర్క్ సేవలు
బుధవారం అర్ధరాత్రి నుంచి బీఎస్‌ఎన్‌ఎల్ మినహా ఇతర నెట్‌వర్క్‌ల సిగ్నళ్లు అందుబాటులో లేకపోవడంతో సమాచార వ్యవస్థ స్తంభించింది. దూర ప్రాంతాల్లో ఉన్నవారు తమ కుటుంబ సభ్యుల క్షేమసమాచారం తెలుసుకోలేక ఆందోళనకు గురయ్యారు. అధిక చార్జీలు వసూలు చేస్తున్న జియో, ఎయిర్‌టెల్ సేవలు నిలిచిపోవడంపై వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేశారు.









కామెంట్‌లు (0)