కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చెయ్యాలని, ఉద్యమకారులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలని డిమాండ్
బయటి వ్యక్తులకు పోలీసు యూనిఫాం, లాఠీలు ఎలా వచ్చాయని ప్రశ్న
ప్రజాశక్తి-కాకినాడ : ఢిల్లీలో విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వ అమానుష దాడిని ఖండిస్తూ సిఐటియు కాకినాడ నగర కమిటీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద బుధవారం ఉదయం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు అఖిల భారత ఉపాధ్యక్షురాలు జి. బేబిరాణి, జిల్లా అధ్యక్షుడు దువ్వ శేషబాబ్జి మాట్లాడుతూ దేశరాజధాని లో విద్యార్థులపై జరిగిన దాడి సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు. ఆడపిల్లలను తాకుతూ పోలీసులు వ్యవహరించిన తీరు చాలా అభ్యంతరకరంగా ఉందన్నారు. ప్రశ్న పత్రాల లీకేజి వల్ల నీట్ పరీక్ష రద్దవడం వల్ల ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు పరామర్శించి కనీస మానవత్వం కూడా చూపలేదన్నారు. ఈ విషయం పై ప్రధానమంత్రి స్పందించాలని , కేంద్ర ప్రభుత్వం ఉద్యమకారులతో చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. జెన్ జి తరాన్ని తక్కువ అందనా వేయరాదని, పాలకులు విధానాలు మార్చుకోవాలని, లేనిపక్షంలో వారే కనుమరుగయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. అంబేడ్కర్ ఉద్యమ సీనియర్ నేత అయితాబత్తుల రామేశ్వరరావు ఉద్యమానికి సంఘీభావంగా తెలియచేసి మాట్లాడారు. కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థులు చేస్తున్న డిమాండ్ న్యాయంగా ఉందన్నారు. ప్రశ్న పత్రాలు లీకేజీలతో భావి భారత పౌరుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అందరికీ ఆరోగ్యం, వైద్యం చాలా అవసరం అవుతున్న రోజుల్లో నిపుణులైనటువంటి వైద్యులు తయారు కావాలన్నారు. లీకేజీ పేపర్లతో వైద్యులు తయారైతే దేశ ప్రజల ఆరోగ్యానికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. దేశంలో జరుగుతున్న అన్యాయాలపై ప్రజలు స్పందించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్. రాజ్ కుమార్, నగర కన్వీనర్ మలక వెంకటరమణ, చంద్రమళ్ళ పద్మ, మేడిశెట్టి వెంకట రమణ, రొంగల ఈశ్వర్రావు, నక్కిళ్ళ శ్రీనివాస్, అనపర్తి ఏడుకొండలు, సిహెచ్. విజయ్ కుమార్, వివిఎన్. కుమార్, ఆర్. తలుపులమ్మ, ఎం. రవి, పి . సూర్యారావు, ఎస్ . శ్రీను, సత్యవతి, నాగాబత్తుల సూర్యనారాయణ, పలివెల వీరబాబు, సామాజిక సాధన సమితి నాయకులు రాజు తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)