మెహర్ కాంప్లెక్స్ వద్ద టీడీపీ దళిత నేతల ధర్నా, పెట్రోల్ పోసుకున్న వ్యక్తి
సామర్లకోట (కాకినాడ) : సామర్లకోట మున్సిపల్ చైర్మన్ పదవి ఎస్సీ రిజర్వ్డ్ సీటును టీడీపీకి కాకుండా జనసేనకు కేటాయించడంపై తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి భగ్గుమంది. సామర్లకోట మెహర్ కాంప్లెక్స్ వద్ద టీడీపీ దళిత నాయకులు ఆందోళనకు దిగి రోడ్డుపై బైటయించి నిరసన చేపట్టారు. సుమారు గంట పాటు ధర్నా కొనసాగించారు. ధర్నా ఉద్రిక్తంగా మారిన సమయంలో ఓ దళిత నాయకుడు లంక భగవాన్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిరసన తెలిపేందుకు యత్నించాడు. అప్రమత్తమైన పోలీసులు, తోటి నాయకులు వెంటనే అడ్డుకుని నీళ్లు పోసి కాపాడారు. పోలీసులు వచ్చి నచ్చజెప్పి ఆందోళనకారులను పక్కకు తప్పించడంతో దాదాపు గంట తర్వాత ట్రాఫిక్ పునరుద్ధరించబడింది.
అసలేం జరిగిందంటే ....
కూటమి అధిష్టానం తాజాగా ప్రకటించిన జాబితాలో సామర్లకోట మున్సిపాలిటీని జనసేనకు కేటాయించింది. దీంతో సామర్లకోట చైర్మన్ పీఠాన్ని ఆశించిన టీడీపీ ఎస్సీ నేతలు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. తమకు న్యాయం చేయాలంటూ మెహర్ కాంప్లెక్స్ సెంటర్ లో రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. దీంతో కాకినాడ-రాజమండ్రి ప్రధాన రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆర్టీసీ బస్సులు, లారీలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. "సామర్లకోటలో టీడీపీకి బలమైన ఎస్సీ కేడర్ ఉంది. కష్టపడి పార్టీని నిలబెట్టిన మాకు కాకుండా, ఉన్నపళంగా సీటును జనసేనకి ఇవ్వడం అన్యాయం. అధిష్టానం పునరాలోచించాలి" అని ధర్నాలో పాల్గొన్న ఓ టీడీపీ దళిత నేత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనతో సామర్లకోటలో కూటమి మధ్య సీట్ల సర్దుబాటు విభేదాలు బహిరంగంగా బయటపడ్డాయని స్థానికులు చర్చించుకుంటున్నారు.








కామెంట్లు (0)