10,620 మంది అభ్యర్థులకు 5 పరీక్షా కేంద్రాలు : కలెక్టర్ హరేంధిర ప్రసాద్
ప్రజాశక్తి - కాకినాడ : ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఏపీ టెట్)ను జిల్లాలో ఎలాంటి అవాంతరాలు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఆగస్టు 5 నుంచి 21 వరకు జరిగే టెట్ పరీక్షల ఏర్పాట్లపై గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 10,620 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానుండగా, కంప్యూటర్ ఆధారిత పరీక్షల కోసం ఐదు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాకినాడ అచ్చుతాపురంలోని ఐయాఎన్ డిజిటల్ జోన్‌లో 4,300 మంది, రాయుడుపాలెం జంక్షన్‌లోని సాఫ్ట్ టెక్నాలజీస్‌లో 4,400 మంది, సూరంపాలెంలోని ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో 530 మంది, ఆదిత్య యూనివర్సిటీలో 540 మంది, ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో 850 మంది పరీక్షలు రాయనున్నారని వెల్లడించారు. ప్రతిరోజూ రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మొదటి సెషన్ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందని చెప్పారు. ప్రతి పరీక్షా కేంద్రంలో నిరంతర విద్యుత్ సరఫరా, ప్రతి కంప్యూటర్‌కు యూపీఎస్, ప్రత్యామ్నాయంగా జనరేటర్ తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 163 అమలు చేయడంతో పాటు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి శాంతిభద్రతలు కట్టుదిట్టంగా నిర్వహించాలని సూచించారు. ఫ్లయింగ్ స్క్వాడ్లు పరీక్షల నిర్వహణను నిరంతరం పర్యవేక్షించాలని పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాలకు మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించబోమని తెలిపారు. ప్రతి కేంద్రంలో ప్రథమ చికిత్స సదుపాయం, అంబులెన్స్ ఏర్పాటు చేయాలని వైద్యశాఖకు, అభ్యర్థుల రాకపోకలకు అనుగుణంగా ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. అభ్యర్థులు తప్పనిసరిగా ఒరిజినల్ గుర్తింపు కార్డు వెంట తీసుకురావాలని తెలిపారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి పిల్లి రమేష్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)