పిల్లలు స్కూలు నుంచి కాలేజీ జీవితంలోకి అడుగుపెట్టే దశను అత్యంత సున్నితమైన మార్పుల కాలంగా చూడాలని పిల్లల మనోవిజ్ఞాన నిపుణులు సూచిస్తున్నారు. ఈ సమయంలో తల్లిదండ్రులు కేవలం చదువు గురించే కాకుండా, భావోద్వేగాలు, స్నేహాలు, క్రమశిక్షణ, వ్యక్తిగత భద్రత, బాధ్యత, డిజిటల్ వినియోగం, స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం వంటి అంశాలపై కూడా పిల్లలతో ఓపెన్‌గా మాట్లాడాలని వారు చెబుతున్నారు. ఆదేశాలు ఇవ్వడం కంటే మాట్లాడటం విమర్శించడం కంటే వినడం, అనుమానించడం కంటే నమ్మకాన్ని పెంచడం ద్వారా పిల్లలు ఆరోగ్యకరమైన వ్యక్తిత్వాన్ని నిర్మించుకుంటారని నిపుణులు సూచిస్తున్నారు.
కాలేజీ అనేది కేవలం చదువుకునే స్థలం మాత్రమే కాదు. వ్యక్తిత్వం తీర్చిదిద్దుకునే వేదిక, జీవితానికి అవసరమైన నిర్ణయాలు తీసుకోవడం నేర్చుకునే పాఠశాల. మంచి స్నేహాలను సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఈ మార్పు విద్యార్థులకు ఉత్సాహాన్ని ఇస్తే, తల్లిదండ్రులకు కొంత భయం, ఒత్తిడిని కలిగించవచ్చు. ఈ నేపథ్యంలో పిల్లలకు అండగా నిలవడం ప్రతి పేరెంట్ బాధ్యత అని నిపుణులు చెబుతున్నారు. ఈ కొత్త ప్రయాణంలో తల్లిదండ్రుల ప్రోత్సాహం, నమ్మకం, సరైన మార్గదర్శకత్వం పిల్లలకు ఎంతో బలాన్నిస్తాయి. కాలేజీలో అడుగుపెట్టిన తర్వాత పిల్లల జీవితంలో ఎన్నో కొత్త అనుభవాలు ఎదురవుతాయి. అలాంటి సమయంలో తల్లిదండ్రులు ఆంక్షలు విధించే వారిగా కాకుండా, నమ్మకమైన మార్గదర్శకులుగా ఉండాలి. ముందుగానే కొన్ని విషయాలపై పిల్లలతో ప్రశాంతంగా మాట్లాడితే, వారు సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశం పెరుగుతుంది.
స్వతంత్రంగా ఆలోచించే శక్తి
పిల్లలు ఎదిగే కొద్దీ ప్రతి చిన్న సమస్యకూ తల్లిదండ్రులపైనే ఆధారపడకూడదు. "ఈ పరిస్థితిలో నువ్వైతే ఏం చేస్తావు?", "నీ నిర్ణయం వెనుక కారణం ఏంటి?" వంటి ప్రశ్నలు వేస్తూ వారిలో సొంత ఆలోచనా శక్తిని రేకెత్తించాలి. ఒకవేళ నిర్ణయాల్లో తప్పులు దొర్లినా... భయపడకుండా, ఆ తప్పుల నుంచే పాఠాలు నేర్చుకునేలా వారిని ప్రోత్సహించాలి.
గురువుల పట్ల గౌరవం
కాలేజీలో లెక్చరర్లు కేవలం సిలబస్ పూర్తి చేసేవారు మాత్రమే కాదు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే మార్గదర్శకులు. క్లాసులకు సమయానికి హాజరవడం, శ్రద్ధగా వినడం, సందేహాలను మర్యాదగా అడగడం, వారి సూచనలను పాటించడం వంటివి మంచి వ్యక్తిత్వానికి పునాదులని పిల్లలకు వివరించాలి.
క్లాస్‌రూమ్ క్రమశిక్షణ
తరగతి గదిలో మొబైల్ ఫోన్లను అనవసరంగా ఉపయోగించకపోవడం కనీస బాధ్యత. లెక్చరర్లు గానీ, తోటి విద్యార్థులు గానీ మాట్లాడుతున్నప్పుడు మధ్యలో అడ్డుపడకూడదు. క్లాస్‌లో ఏకాగ్రతతో ఉండడం, గ్రూప్ యాక్టివిటీస్‌లో చురుగ్గా పాల్గొనడం వంటి అలవాట్లే ఒక విద్యార్థిని అందరికంటే ప్రత్యేకంగా నిలబెడతాయని చెప్పాలి.
మంచి స్నేహం
స్నేహం అంటే కేవలం కాలక్షేపం కాదు... పరస్పర గౌరవం, నమ్మకం, ఒకరి ఎదుగుదలకు ఒకరు సహకరించుకోవడం. చెడు అలవాట్ల వైపు లాగే స్నేహాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని పిల్లలకు సున్నితంగా అర్థమయ్యేలా చెప్పాలి.
కౌమార మార్పులపై అవగాహన
ఈ వయసులో శరీరంలో, మనసులో ఎన్నో సహజమైన మార్పులు వస్తాయి. ఆకర్షణలు, కొత్త ఇష్టాలు, తీవ్రమైన భావోద్వేగాలు కలగడం కామన్. వీటిని చూసి భయపడాల్సిన అవసరం లేదని, అయితే వాటిని బాధ్యతగా అర్థం చేసుకోవాలని పిల్లలకు చెప్పాలి. ఇతరుల వ్యక్తిగత హద్దులను గౌరవించడం, అలాగే తన హద్దులను స్పష్టంగా చెప్పడం ఎంతో ముఖ్యం. ఏవైనా సందేహాలుంటే దాచకుండా తల్లిదండ్రులతో లేదా నమ్మకమైన పెద్దలతో పంచుకునేలా చనువు ఇవ్వాలి.
హాస్టల్ జీవితం... ఒక పాఠశాల
హాస్టల్‌లో చేరే పిల్లలకు స్వయం సమృద్ధి చాలా అవసరం. సమయపాలన, గది పరిశుభ్రత, ఆరోగ్యకరమైన ఆహారం, సరైన నిద్ర, డబ్బును పొదుపుగా వాడుకోవడం వంటి విషయాల్లో బాధ్యతగా ఉండాలి. ముఖ్యంగా రూమ్ మేట్స్‌తో పరస్పర గౌరవంతో, సర్దుబాటు తత్వంతో మెలగడం అలవాటు చేయాలి.
హద్దుల్లో సోషల్ మీడియా!
కొత్తగా వచ్చే స్వేచ్ఛతో చాలామంది సోషల్ మీడియా ప్రపంచంలో మునిగిపోతుంటారు. అక్కడ పొంచి ఉండే డిజిటల్ ప్రమాదాల గురించి పిల్లలను హెచ్చరించాలి. ముఖపరిచయం లేనివారితో వ్యక్తిగత సమాచారం, ఫొటోలు, వీడియోలను పంచుకోవద్దని స్పష్టం చేయాలి. వర్చువల్ ప్రపంచం కంటే నిజ జీవిత సంబంధాలు, చదువు, నైపుణ్యాల అభివృద్ధికి ఎక్కువ సమయం కేటాయించేలా చూడాలి.
సమస్యలను దాచుకోవద్దు...!
క్యాంపస్‌లో రాగింగ్, వేధింపులు, తీవ్రమైన మానసిక ఒత్తిడి, లేదా ఏదైనా అసౌకర్యం ఎదురైతే మౌనంగా భరించవద్దని పిల్లలకు ధైర్యం చెప్పాలి. అలాంటి పరిస్థితుల్లో ఏమాత్రం సంకోచించకుండా వెంటనే తల్లిదండ్రులకు, లెక్చరర్లకు, కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేసేలా వారిని మానసికంగా సిద్ధం చేయాలి.
నమ్మకమే బలమైన బంధం
పిల్లలు తప్పు చేసినా ముందుగా వినే తల్లిదండ్రులుగా ఉండాలి. నమ్మకంతో పిల్లలు తమ విషయాలను చెప్పగలిగే వాతావరణాన్ని ఇంట్లో కల్పిస్తే, వారు జీవితంలో ఎన్నో సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోగలరు. కాలేజీ జీవితం పిల్లలను పెద్దల ప్రపంచంలోకి తీసుకెళ్లే మొదటి మెట్టు. ఈ ప్రయాణంలో నియంత్రణ కంటే మార్గదర్శకత్వం, పిల్లల పట్ల నమ్మకం, ఏ సమస్య వచ్చినా కూర్చొని మాట్లాడటం ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి. పిల్లలకు రెక్కలు ఇవ్వడంతో పాటు, ఎప్పుడు అవసరమైనా వెన్నుదన్నుగా ఉంటామని తెలియజేయడం ప్రతి తల్లిదండ్రి బాధ్యత.








కామెంట్‌లు (0)