సోమవారం, 21 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మైసమ్మ చెరువును ప్రారంభించిన డిప్యూటి సిఎం పవన్ కల్యాణ్

1 గంట క్రితం

Deputy CM Pawan Kalyan inaugurates Maisamma Cheruvu.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 21, 2026, 04:52 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

సుందరీకరించిన చెరువులు ప్రారంభం

ఫకృద్ధీన్ పాలెంలో మైసమ్మ చెరువును ప్రారంభించిన డిసిఎం పవన్ కళ్యాణ్

నియోజకవర్గంలో రూ. 6 కోట్లతో 11 చెరువుల సుందరీకరణ


ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి, పిఠాపురం : పిఠాపురం నియోజకవర్గంలోని ఫకృద్ధీన్ పాలెం గ్రామంలో రూ. 73 లక్షల వ్యయంతో సుందరంగా తీర్చిదిద్దిన మైసమ్మ చెరువు, వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ పార్కును రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోమవారం ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో చెరువులను కేవలం నీటి వనరులుగానే కాకుండా ప్రజలకు ఆహ్లాదం, ఆరోగ్యం అందించే సామాజిక వేదికలుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో మైసమ్మ చెరువును నమూనాగా అభివృద్ధి చేశారు. నియోజకవర్గ పర్యటనలో భాగంగా సోమవారం మైసమ్మ చెరువును సందర్శించిన పవన్ కళ్యాణ్ వాకింగ్ ట్రాక్, ఓపెన్ ఎయిర్ జిమ్‌తోపాటు పిల్లల పార్కును ప్రారంభించారు. అలాగే నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి చేసిన మరో 11 చెరువులకు సంబంధించిన శిలాఫలకాన్ని అక్కడే ఆవిష్కరించారు. కాకినాడ జిల్లా పరిధిలో అభివృద్ధి చేసిన 14 చెరువులకి సంబంధించిన గ్యాలరీని సందర్శించారు. చెరువుల సుందరీకరణ గ్రామీణ ప్రజలకు విశ్రాంతి, వినోదంతోపాటు ఆరోగ్యాన్ని అందించడంలో ఈ చెరువులు దోహదపడతాయని తెలిపారు.


Deputy CM Pawan Kalyan inaugurates Maisamma Cheruvu.


చిన్నారులతో కలసి చిల్డ్రన్ పార్కు ప్రారంభం

మోడల్ ప్రాజెక్టుగా తీర్చిదిద్దిన ఫకృద్ధీన్ పాలెం మైసమ్మ చెరువు పరిసరాలను పచ్చటి మొక్కలతో అభివృద్ధి చేసి, గట్టును బలోపేతం చేశారు. అనంతరం గట్టుపై వాకింగ్ ట్రాక్‌ను ఏర్పాటు చేశారు. గ్రామ ప్రజలు ఉదయం, సాయంత్రం వేళల్లో నడక ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకునేలా ఈ ప్రణాళికను రూపొందించారు. మహిళలు, యువతతో పాటు వృద్ధులు కూడా వ్యాయామం చేసుకునేలా ఓపెన్ ఎయిర్ జిమ్‌ను, జాతీయ భావన పెంపొందించేలా జెండా స్థూపాన్ని ఏర్పాటు చేశారు. చెరువు కుడి వైపున పిల్లల కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన చిల్డ్రన్స్ పార్కును చిన్నారులతో కలసి ప్రారంభించారు. పార్కులో ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తాయని పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధిలో పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం, ప్రజారోగ్యానికి ప్రాధాన్యం ఇస్తూ మరిన్ని కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఫకృద్ధీన్ పాలెం మైసమ్మ చెరువు భవిష్యత్ అభివృద్ధి కార్యక్రమాలకు మోడల్ నమూనాగా నిలవాలని ఆకాంక్షించారు. ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా రూ. 50 కోట్ల వ్యయంతో 105 చెరువుల సుందరీకరణ పనులు చేపట్టారు. వీటిలో దాదాపు సగానికి పైగా పనులు పూర్తికాగా, మిగిలినవి పురోగతిలో ఉన్నాయి. ఈ నెలాఖరు నాటికి అన్ని చెరువుల సుందరీకరణ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులను ఆయన పలకరించారు. కొందరు ప్రజల నుంచి సమస్యలపై వినతులు స్వీకరించారు. ఫకృద్ధీన్ పాలెం గ్రామ సచివాలయ భవనాన్ని, చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాన్ని పరిశీలించారు. తడి చెత్త, పొడి చెత్త కోసం విడివిడిగా ఏర్పాటు చేసిన కుండీలు పరిశీలించి, వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరేంధిరప్రసాద్, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, పెద్దాపురం, రాజానగరం ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, బత్తుల బలరామకృష్ణ, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్, డీసీసీబీ ఛైర్మన్ తుమ్మల రామస్వామి, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, ఎన్.ఆర్.ఈ.జి.ఎస్. డైరెక్టర్ షణ్ముఖ్, పడా పీడీ శివరాం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

011


పీఠికాపుర వనం పార్కు ప్రారంభం

పిఠాపురం పట్టణంలోని జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న స్థలంలో అభివృద్ధి చేసిన ‘పీఠికాపుర వనం’ నగర వనాన్ని అటవీ,పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. నియోజకవర్గ పర్యటనలో భాగంగా సోమవారం నగర వనంలో మొక్క నాటి, పీఠికాపురవన ప్రారంభ సూచకంగా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వ నగర వన్ యోజన పథకం కింద సుమారు రూ. 1.83 కోట్ల వ్యయంతో ఆరు ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేసిన ఈ నగరవనం పిఠాపురం పట్టణానికి సరికొత్త హరిత సొబగులను అద్దింది. గతంలో పూర్తిగా డంపింగ్ యార్డుగా, అపరిశుభ్రతకు నెలవుగా ఉన్న ప్రాంతం పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో నగరవనంగా మారింది.నక్షత్రవనం, శివపంచాయతన వనం సందర్శకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. 27 నక్షత్రాలకు ప్రతీకగా నిలిచే ఉసిరి, మేడి, మోదుగ, కొండమామిడి, పిప్పలి, వెదురు, రావి, మర్రి, జాతి జువ్వి, దేవదారు, పసన, జిల్లేడు, జమ్మి, విప్ప, వేప తదితర రకాల మొక్కలను ఒక వరుస క్రమంలో నాటారు.అనంతరం 70 సెంట్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన మియావకీ ఫారెస్ట్ ప్లాంటేషన్‌ను, బటర్‌ఫ్లై పార్కును, నగరవనం మధ్యన ఉన్న భారీ కొలనును అధికారులతో కలసి సందర్శించారు. పిఠాపురం ప్రజలతోపాటు ఆధ్యాత్మిక సందర్శనార్థం ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు ఆహ్లాదాన్ని పంచే విధంగా మరింత సర్వాంగ సుందరంగా నగర వనాన్ని తీర్చిదిద్దాలని అధికారులకు సూచనలు చేశారు.కేంద్ర ప్రభుత్వ నగర వన్ యోజన పథకం సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా వివిధ పట్టణాల్లో నగర వనాలు అభివృద్ధి చేస్తున్నారు. రూ. 36 కోట్లతో ఏర్పాటు చేసిన 18 నగర వనాలను ఇటీవల పవన్ కళ్యాణ్ ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్