ప్రజాశక్తి-కాకినాడ : జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖరులు నిరసన తెలిపారు. గురువారం కార్యాలయం ముందు బైఠాయించి జీ వో నంబర్ 396 రద్దు చేయాలని, ఆర్ ఎస్ కే లు ఏర్పాటు చేయవద్దని, తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా దస్తావేజు లేఖరుల సంఘం అధ్యక్షుడు చోడపునీడి గోవిందరావు మాట్లాడుతూ.. తమ న్యాయమైన డిమాండ్‌లకు ప్రభుత్వం సహకరించాలని అన్నారు. సమస్య పరిష్కారానికి సీఎం చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రిజిస్ట్రేషన్ కార్యాలయం ఎదుట లేఖరులు నిరసన తెలపడంతో కొద్ది సేపు స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో జిల్లా రిజిస్టర్ కే ప్రసాద్, రిజిస్టర్ వీరభద్రరావు లు తమ కార్యాలయం నుంచి బయటకు వచ్చి రిజిస్ట్రేషన్ కోసం వచ్చే వారికి ఇబ్బంది కలుగజేయడం భావ్యం కాదని అన్నారు. దీంతో లేఖరులు, అధికారులు మధ్య వాగ్వాదం జరిగింది. కొద్ది సేపటి తర్వాత లేఖరులు రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద నిరసన విరమించి , పక్కనే ఉన్న లేఖరుల కార్యాలయం వద్ద నిరసన కొనసాగించారు. ఈ కార్యక్రమం లో సంఘం కార్యదర్శి గీసాల శ్రీనివాస్ రావు, జిల్లా అధ్యక్షుడు జాడా అప్పలరాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖరుల నిరసన
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 23, 2026, 04:19 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)