- బీచ్‌రోడ్డును ఆనుకుని ఉన్న శ్మశానవాటిక సముద్రపు కోతకు బలి!
- సుబ్బంపేటలో మత్స్యకార కుటుంబాలకు అంత్యక్రియల కష్టాలు..
- శ్మశానవాటిక లేక ఇబ్బందులు.. ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోని అధికారులు!
ప్రజాశక్తి – యు.కొత్తపల్లి: బతికున్నప్పుడు ఎన్నో సమస్యలతో సతమతమవుతున్న సుబ్బంపేట గ్రామస్తులకు కనీసం చనిపోయిన తర్వాత అంత్యక్రియలు నిర్వహించుకోవడానికి కూడా స్థలం లేకుండా పోతోంది. కాకినాడ జిల్లా ఉప్పాడ గ్రామ పంచాయతీ పరిధిలోని శివారు సుబ్బంపేట గ్రామ పరిసర ప్రాంతంలో బీచ్‌రోడ్డును ఆనుకుని శ్మశానవాటిక ఉంది. ఎంతోకాలంగా గ్రామస్తులు ఇదే ప్రాంతంలో తమవారి అంత్యక్రియలు నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే ఇటీవల సంభవించిన అర్నబ్ తుఫాను ప్రభావంతో సముద్రపు అలల ఉధృతికి బీచ్‌రోడ్డుతో పాటు శ్మశానవాటిక ప్రాంతం కూడా తీవ్రంగా దెబ్బతింది. దీంతో ఇప్పుడు మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు సైతం స్థలం లేకుండా పోయిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సముద్రపు కోతకు శ్మశానవాటిక బలి!
సముద్రపు అలల ఉధృతికి బీచ్‌రోడ్డు పూర్తిగా దెబ్బతినడంతో పాటు రోడ్డు పక్కనే ఉన్న శ్మశానవాటికలోనూ తీవ్ర విధ్వంసం చోటుచేసుకుంది. గతంలో అంత్యక్రియలు నిర్వహించిన ప్రాంతాలు సైతం సముద్రపు కోతకు గురవుతున్నాయి. కొన్ని సమాధులు బయటకు కనిపిస్తుండటంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు సైతం రాళ్ల మధ్య ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందుకు నిదర్శనంగా ప్రస్తుత ఫొటోలోని దృశ్యం కనిపిస్తోంది.
మత్స్యకార కుటుంబాలకు మరింత కష్టం!
సుబ్బంపేట ప్రాంతంలో నివసించే మత్స్యకార కుటుంబాలకు శ్మశానవాటిక సమస్య మరింత ఇబ్బందికరంగా మారింది. ఇప్పటికే సముద్రపు కోత, తుఫాన్ల ప్రభావంతో జీవనోపాధి కోల్పోతూ ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్న మత్స్యకారులకు ఇప్పుడు కుటుంబ సభ్యులు మరణించినప్పుడు అంత్యక్రియలు నిర్వహించుకోవడానికి కూడా సరైన స్థలం లేకుండా పోతోంది. గ్రామంలో శ్మశానవాటికకు ప్రత్యామ్నాయ స్థలం లేకపోవడంతో మత్స్యకార కుటుంబాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. తమవారి అంత్యక్రియలను గౌరవప్రదంగా నిర్వహించుకునే హక్కు కూడా తమకు లేకుండా పోతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోరా?
శ్మశానవాటికకు ప్రత్యామ్నాయంగా సురక్షిత ప్రాంతంలో ప్రభుత్వ స్థలం కేటాయించాలని గ్రామస్తులు ఎన్నోసార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేసినా ఇప్పటివరకు పరిష్కారం లభించలేదని వాపోతున్నారు. సముద్రపు కోతతో తమ శ్మశానవాటిక కనుమరుగవుతున్నా అధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారు.
చివరి మజిలీలోనూ అవస్థలేనా?
మనిషి జీవించి ఉన్నప్పుడు కనీస సౌకర్యాలు కల్పించలేకపోయినా, మరణానంతరం గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించుకునే అవకాశం కూడా లేకపోతే ఎలా అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు, రెవెన్యూ అధికారులు, పంచాయతీ అధికారులు స్పందించి సుబ్బంపేట గ్రామానికి సురక్షిత ప్రాంతంలో శ్మశానవాటిక కోసం స్థలం కేటాయించాలని కోరుతున్నారు. మరో తుఫాను వచ్చే వరకు అధికారులు వేచి చూస్తారా? మత్స్యకార కుటుంబాల ఆఖరి మజిలీ సమస్యకు ఎప్పుడు పరిష్కారం చూపుతారని నిలదీస్తున్నారు.








కామెంట్‌లు (0)