ప్రజాశక్తి-కాకినాడ : నగరంలో నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని, టౌన్ ప్లానింగ్ విభాగం ద్వారా జరిమానాలు విధిస్తామని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.వి.వి సత్యనారాయణ హెచ్చరించారు. మంగళవారం ఉదయం ఆయన నగరంలోని 38వ డివిజన్ పరిధిలోని మల్లయ్య అగ్రహారం, ఎల్విన్‌పేట ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించగా వార్డ్ జనసేన ఇంచార్జ్ ఆకుల శ్రీనివాస్ అక్కడ పలు సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నగరంలో అక్రమ ఫ్లెక్సీలను అధికారులు తొలగించడం జరుగుతుందన్నారు. ఈ ఫ్లెక్సీలు వల్ల పర్యావరణానికి హాని కలిగించేలా మళ్లీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని కమిషనర్ స్పష్టం చేశారు. ఎల్విన్‌పేటలో చెత్తాచెదారంతో నిరుపయోగంగా మారిన కమ్యూనిటీ హాల్ భవనాన్ని వెంటనే శుభ్రపరిచి, ప్రజాధనం వృథా కాకుండా ప్రజల వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఆ ప్రాంతంలో వీధి కుక్కల సమస్యపై స్పందిస్తూ ప్రత్యేక బృందాల ద్వారా నియంత్రణ చర్యలను మరింత వేగవంతం చేయాలని సూచించారు. వర్షాకాల ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున, ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు తాగునీటి విషయంలో అప్రమత్తంగా ఉండి, నీటిని కాచి తాగాలని విజ్ఞప్తి చేశారు. ఆరోగ్య సమస్యలు వస్తే వెంటనే మున్సిపల్ అధికారులను సంప్రదించాలన్నారు. నగరంలో డ్రైనేజీ, తాగునీరు, పారిశుధ్య సమస్యలు ఉంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని, నగరాభివృద్ధిలో ప్రజలంతా భాగస్వాములు కావాలని కమిషనర్ పిలుపునిచ్చారు.
అక్రమ ఫ్లెక్సీలపై జరిమానాలు తప్పవు : కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్
14 జులై, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 14, 2026, 03:05 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)