ప్రజాశక్తి- కాకినాడ : అర్నాబ్ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో .... లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.వి.వి. సత్యనారాయణ సూచించారు. తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజల భద్రతకు ప్రాధాన్యమిస్తూ ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా సోమవారం ఉదయం కాకినాడలోని లోతట్టు ప్రాంతమైన ఏటిమొగ చివరి ప్రాంతంలో ఆయన పర్యటించి, పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా ఏటిగట్టును పరిశీలించిన కమిషనర్, స్థానిక మత్స్యకారులతో మాట్లాడి తుఫాన్ హెచ్చరికలపై వారికి అవగాహన కల్పించారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అప్రమత్తంగా ఉండాలని, సముద్రం, నీటి ప్రవాహాలకు సమీపంలోని ప్రాంతాల్లో నివసించే ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తుఫాన్ ప్రభావంతో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని తెలిపారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో నివసించే దివ్యాంగులు, చిన్నారులు, గర్భిణులు, వృద్ధులు తదితరులను గుర్తించి, అవసరమైన సందర్భాల్లో ముందుగానే పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులకు సూచించారు. ప్రజలు ప్రాణాపాయ పరిస్థితులను ఎదుర్కోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అధికారుల సూచనలను నిర్లక్ష్యం చేయవద్దని కమిషనర్ స్పష్టం చేశారు. నగరంలోని ఇతర లోతట్టు ప్రాంతాల్లోనూ అధికారులు పర్యటిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారని, తుఫాన్ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నామని కమిషనర్ తెలిపారు. ఈ పర్యటనలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్, ఈఈ ఆదినారాయణ, శానిటేషన్ సూపర్‌వైజర్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)