ప్రజాశక్తి-కాకినాడ : కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. విశాఖ ఉక్కు ప్రమాదంలో చనిపోయిన పదిమంది కుటుంబాలకు కోటి పరిహారం ఇవ్వాలని, క్షతగాత్రులకు 50 లక్షల పరిహారం అందించాలని, ప్రమాదంపై జ్యుడీషియల్ ఎంక్వయిరీ నిర్వహించి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముందుగా ప్రమాదంలో మరణించిన మృతులకు సంతాపం ప్రకటించారు. అనంతరం సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏవి నాగేశ్వరరావు, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, ఐఎన్టియుసి జిల్లా అధ్యక్షులు తాళ్లూరి రాజు, ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి గుబ్బల ఆదినారాయణ మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్రమాదానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలే కారణమని విమర్శించారు. విధానాల రూపకల్పనలో ఏమాత్రం సంబంధంలేని ఆరుగురు చిరుద్యోగులను సస్పెండ్ చేసి, అసలు దోషులను రక్షిస్తున్నారన్నారు. రిటైర్ జడ్జితో న్యాయ విచారణ జరిపి అసలు దోషులను శిక్షించాలని కోరారు. ప్రమాదం సందర్బంగా పరామర్శకొచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ వ్యవహారశైలి ప్రమాద మృతుల త్యాగాలను అవమానపరిచేలా ఉందన్నారు. గత రెండేళ్ల నుండి పరిశ్రమ యంత్రాలకు కనీస నిర్వహణ చేయపోవడం, నాణ్యతలేని ఫెర్రో అల్లాయిస్ ఉపయోగించడం, 5వేల మంది కార్మికులను తొలగించడం, భద్రతా లోపాలను ఎత్తిచూపిన కార్మిక సంఘాల వినతులు పట్టించుకోకపోవడం వల్లనే ప్రమాదంలో ఏడుగురు పర్మినెంట్ కార్మికులు, ముగ్గురు కాంట్రాక్ట్ కార్మికులు ప్రాణాలను కోల్పోయారని ఆవేదన వ్యక్తంచేశారు. మృతులకు 2 లక్షలు పరిహారం ప్రకటించి దేశభక్తియుత కార్మికుల త్యాగాలను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అవహేళన చేసిందని, ఇచ్చిన 1100 కోట్ల ప్యాకేజీలో ఒక్క రూపాయి కూడా పరిశ్రమ భద్రతకు ఉపయోగించకుండా అప్పుల పేరుతో తిరిగి తీసుకుందన్నారు. 4 లేబర్ కోడ్ల పేరుతో పరిశ్రమలలో సేఫ్ట్ అధికారుల తనిఖీలను ఆపేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ వేలకోట్ల ఆస్తులను కాజేయలనే ప్రేవేటికరణ వ్యామోహంలో కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని, పోరాటాలతో, త్యాగలతో సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. వర్షంలో కూడా పిలుపును అందుకుని ధర్నా జయప్రదం చేసిన కార్మికవర్గానికి ధన్యవాదాలు తెలుపుతూ ఐఎన్టియుసి నాయకులు తాళ్లూరి రాజు వందన సమర్పణచేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్ష, కార్యదర్సులు దువ్వ శేషబాబ్జి, చెక్కల రాజ్ కుమార్, కోశాధికారి మలకా రమణ, సహాయ కార్యదర్శి చంద్రమళ్ల పద్మ, జిల్లా వర్కింగ్ కమిటీ సభ్యులు పలివేల వీరబాబు, మేడిశెట్టి వెంకట రమణ, టి రాజా, నాగాబత్తుల సూర్యనారాయణ, రాజేంద్రప్రసాద్ సహా పలు యూనియన్లు పాల్గొన్నాయి.
విశాఖ ఉక్కు మృతుల కుటుంబాలకు కోటి, క్షతగాత్రులకు 50 లక్షల ఇవ్వాలని ధర్నా
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 03, 2026, 04:02 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)