రూ.1.50 కోట్ల శానిటేషన్ పరికరాల ప్రారంభం
ప్రజాశక్తి-కాకినాడ : ప్రజల భాగస్వామ్యంతోనే కాకినాడ నగరాన్ని పరిశుభ్రంగా, పచ్చదనంతో తీర్చిదిద్దగలమని, ఇందుకోసం ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతగా పారిశుద్ధ్యాన్ని స్వీకరించాలని అధికారులు, ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి నెల మూడో శనివారం నిర్వహిస్తున్న స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం కాకినాడ నగరంలోని ఆనంద్ భారతి మైదానంలో క్లీన్ సిటీస్–గ్రీన్ కమ్యూనిటీస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, జిల్లా కలెక్టర్ ఎం.ఎం. హరేంద్ర ప్రసాద్, నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.వి.వి. సత్యనారాయణ, ప్రజాప్రతినిధులు, అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ ఎన్.వి.వి. సత్యనారాయణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజల్లో పారిశుద్ధ్యంపై మరింత చైతన్యం తీసుకురావడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు. ఈ నెల క్లీన్ సిటీస్–గ్రీన్ కమ్యూనిటీస్ అనే థీమ్‌తో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
రూ.1.50 కోట్ల పరికరాల ప్రారంభం
కాకినాడ నగర పారిశుద్ధ్య నిర్వహణను మరింత మెరుగుపరిచేందుకు సుమారు రూ.1.50 కోట్ల విలువైన శానిటేషన్ పరికరాలు, టిప్పర్ వాహనాలను ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, జిల్లా కలెక్టర్ ఎం.ఎం. హరేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. పారిశుద్ధ్య కార్మికులకు అవసరమైన పరికరాలు అందించాలని గతంలో ఎమ్మెల్యే చేసిన సూచనల మేరకు ఈ పరికరాలను సమకూర్చినట్లు కమిషనర్ తెలిపారు. రానున్న రోజుల్లో ప్రజలకు మరింత మెరుగైన పారిశుద్ధ్య సదుపాయాలు అందించేందుకు నూతన టిప్పర్ వాహనాలు, ఫాగింగ్ మిషన్లు, స్ప్రేయర్లు తదితర పరికరాలను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఇందుకు ఇప్పటికే నిధులు కేటాయించి, పరికరాల కొనుగోలుకు ఆర్డర్లు కూడా ఇచ్చినట్లు తెలిపారు.
ప్రజల సహకారంతోనే స్వచ్ఛ కాకినాడ
కాకినాడ నగరాన్ని పరిశుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దేందుకు అధికారులు, పారిశుద్ధ్య కార్మికులతో పాటు ప్రజలు కూడా సహకరించాలని కమిషనర్ కోరారు. ఇళ్ల నుంచి వెలువడే చెత్తను రోడ్లపై, కాల్వల్లో వేయకుండా పారిశుద్ధ్య సిబ్బందికి అందించాలని సూచించారు. ప్రజల్లో అవగాహన పెంచుతూ ప్రతి నెల నిర్వహిస్తున్న స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
క్లీన్ అండ్ గ్రీన్ కాకినాడే లక్ష్యం
కాకినాడను క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అధికారులు పనిచేస్తున్నారని జిల్లా కలెక్టర్ ఎం.ఎం. హరేంద్ర ప్రసాద్ తెలిపారు. పారిశుద్ధ్యం కేవలం ప్రభుత్వ యంత్రాంగం బాధ్యత కాదని, ప్రతి కుటుంబం, ప్రతి కమ్యూనిటీ బాధ్యతగా తీసుకోవాలని అన్నారు. నగరంలో పచ్చదనాన్ని పెంచేందుకు మొక్కలు నాటడంతో పాటు రైన్‌వాటర్ హార్వెస్టింగ్, టెర్రస్ గార్డెనింగ్‌ను ప్రోత్సహించాలని సూచించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని వీలైనంత వరకు తగ్గించాలని, డ్రైన్లు, కాల్వల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు వేయకుండా ప్రజలు సహకరించాలని కోరారు. ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛ కాకినాడ లక్ష్యాన్ని సాధించగలమని స్పష్టం చేశారు. కాకినాడ నగర పారిశుద్ధ్య నిర్వహణకు అవసరమైన పరికరాల సమకూర్పునకు సహకరిస్తున్న స్థానిక శాసనసభ్యులు వనమాడి కొండబాబుకు కమిషనర్ కృతజ్ఞతలు తెలిపారు. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు సమష్టిగా పనిచేయాలని కోరారు. అనంతరం కమిషనర్ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ కేటీ సుధాకర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్, ఈఈ ఆదినారాయణ, ఉద్యానవన శాఖ ఏడీ శ్రీనివాసరావు, కాకినాడ సిటీ ప్రాజెక్ట్ మేనేజర్ డి.రాజు, శానిటేషన్ సూపర్వైజర్లు రాంబాబు, నాయుడు, తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు, అధికారులు, సిబ్బంది, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)