బుధవారం, 29 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

మా ప్రదర్శనలకు అనుమతులిచ్చి ఆదుకోండి : డూప్ హీరోల కళాకారుల సంఘం

9 గంటల క్రితం

Support us by granting permission for our performances: Stunt Doubles and Artists Association.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 29, 2026, 03:56 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • అశ్లీల నృత్యాల జాబితాలో రికార్డింగ్ డాన్స్ లు చేర్చవద్దు

  • సినీ హీరోల అనుకరణ కళాకారుల సంఘం నాయకుల విజ్ఞప్తి


ప్రజాశక్తి-రాజమహేంద్రవరం సిటీ (కాకినాడ) : పొట్ట కూటి కోసం సినీ హీరోలను అనుకరిస్తూ డాన్స్ ప్రదర్శనలు ఇస్తున్న తమకు ఇబ్బంది కలగకుండా అనుమతులు ఇప్పించాలని గోదావరి జిల్లాల సినీ హీరోల అనుకరణ (డూప్ హీరోల) కళాకారుల సంఘం అధ్యక్షుడు ములపర్తి అనిల్ కుమార్ (ఎన్టీఆర్ ఫేమ్), కార్యదర్శి మజ్జి శ్రీనివాసరావు (శోభన్ బాబు ఫేమ్), పసలపూడి దివాకర్ బాబు(బాలయ్య ఫేమ్), ఎం బాబీ (పవన్ కళ్యాణ్ ఫేమ్) కోరారు. స్థానిక గణేష్ చౌక్ లోని ప్రెస్ క్లబ్ లో బుధవారం ఉదయం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డూప్ హీరోలు మాట్లాడుతూ .... గడిచిన 40ఏళ్లకు పైగా ఈ వృత్తినే నమ్ముకుని చాలామంది జీవనం సాగిస్తున్నారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల 70 వేలమంది కళాకారులు ఈ వృత్తిలో ఉన్నారని, ఈ జిల్లాలో 3500మంది వరకు ఉన్నారని తెలిపారు. ఏడాదికి మూడు నెలలు మాత్రమే ఆయా ప్రాంతాల్లో జాతరలు, ఉత్సవాలకు తమకు ప్రదర్శనలు ఉంటాయని, మిగిలిన సమయం దాదాపు ఖాళీగానే ఉంటూ ఇదే వృత్తిని నమ్ముకుని అప్పో సప్పో చేసుకుని జీవిస్తున్నామని వారు చెప్పారు. అయితే కొంతమంది అశ్లీల నృత్యాలు చేయడం వలన తమలాంటి కళాకారులకు ఇబ్బంది వస్తోందని, ఫలితంగా తమకు కూడా కొన్నిచోట్ల అనుమతులు ఇవ్వడం లేదని వారు విచారం వ్యక్తం చేశారు. తాము ఎక్కడా అశ్లీలతకు తావులేకుండా ప్రదర్శనలు ఇస్తున్నామని, అందుచేత ఇబ్బందులు కల్గించకుండా అనుమతి ఇచ్చేలా చూడాలని, తద్వారా తమను ఆదుకోవాలని వారు కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ల దృష్టికి విషయాలను తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నామని వారు చెప్పారు. స్థానికంగా తమ ఇబ్బందులను గుర్తించి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసు జిల్లా ఎస్పీ, ఇతర అధికారులకు తమ బాధను అర్ధం చేసుకుని తమకు న్యాయం చేయాలనీ కోరారు. తమకు ఎలాంటి పెన్షన్లు లేవని వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో శంకర్(చిరంజీవి ఫేమ్) ధవళేశ్వరం కృష్ణ (కృష్ణ ఫేమ్), రాము (వెంకటేష్ ఫేమ్), తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్