...కాకినాడ ఇండియన్ రెడ్ క్రాస్ 2025-26 వార్షిక సాధారణ సమావేశంలో జిల్లా రెడ్ క్రాస్ అధ్యక్షులు,జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్
ప్రజాశక్తి-కాకినాడ : గత 98 ఏళ్లుగా సమాజ సేవ, నిస్వార్థ భావమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న కాకినాడ జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా జిల్లాలో క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణం, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ఏర్పాటు వేగవంతం చేసి, ప్రజలకు మరింత మెరుగైన వైద్య,సేవా సౌకర్యాలు అందుబాటు లోకి తీసుకువచ్చేందుకు కృషి చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్, రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షులు ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు. బుధవారం కాకినాడ కలెక్టరేట్ లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో 2025-26 వార్షిక సాధారణ సమావేశం కాకినాడ జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ అధ్యక్షులు, జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఇండియన్ రెడ్ క్రాస్ చైర్మన్, కాకినాడ జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ వై.డి రామారావు గత 2025-26 ఆర్థిక సంవత్సరంలో రెడ్ క్రాస్ సంస్థ ద్వారా చేపట్టిన వివిధ కార్యక్రమాలు, సాధించిన విజయాలు, భవిష్యత్తులో చేపట్టబోయే నూతన ప్రాజెక్టులు వివరాలను సభ కు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ మాట్లాడుతూ కాకినాడ జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ వార్షిక సాధారణ సమావేశం లో పాల్గొనడం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. జిల్లాలో గత 98 ఏళ్లుగా ఈ సంస్థ ఎంతో విజయవంతంగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోందని కొనియాడారు. సమాజం లో ఎటువంటి విభేదాలు లేకుండా అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తుందన్నారు. ముఖ్యంగా పేదవాళ్ళ కి మేలు జరగాలనే గొప్ప ఉద్దేశంతో రెడ్ క్రాస్ సంస్థ పనిచేస్తోందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సంస్థను ఇంతటి ఉన్నత స్థాయికి తీసుకువెళ్తున్న చైర్మన్ వైడీ రామారావు, సభ్యులు అందరికీ పేరు పేరున ఆయన ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేశారు. గత సంవత్సరంలో ఎన్నో మంచి కార్యక్రమాలను విజయవంతం గా పూర్తి చేసుకున్నామని అదే స్ఫూర్తితో రాబోయే సంవత్సరాల్లో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్ళాని జిల్లా కలెక్టర్ సూచించారు. ప్రధానంగా కాకినాడలో 7.5 కోట్ల రూపాయల వ్యయం తో నిర్మిస్తున్న క్యాన్సర్ హాస్పిటల్, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ తెలిపారు. క్యాన్సర్ కేర్ ఫెసిలిటీ ఏర్పాటు ప్రక్రియ ప్రస్తుతం తుది దశకు చేరిందని, జిల్లాలోని ప్రజాప్రతినిధుల సహకారం తోనూ సాధ్యమైనంత త్వరగా పరికరాల ఏర్పాటు కు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ వెల్లడించారు. అందరి సహకారం, మద్దతు తో ఇప్పటివరకు మనం 80 శాతం పనులను పూర్తి చేశామని, మిగిలిన 20 శాతం పనులను కూడా రాబోయే కొన్ని నెలల్లో కచ్చితంగా పూర్తి చేసి అందుబాటు లోకి తీసుకు వచ్చేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు.
అతి త్వరలోనే రెడ్ క్రాస్ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ నిర్మాణానికి సంబంధించి కూడా ఒక సానుకూలమైన వార్తను తెలియజేస్తామని జిల్లా కలెక్టర్ వెల్లడించారు.వీటితో పాటు బ్లడ్ బ్యాంక్ నిర్వహణ,కార్నియా సేకరణ సేవలు, ఇతర స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు,స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్,విభిన్న ప్రతిభావంతుల పాఠశాలలు,మహిళా సాధికారత కార్యక్రమాలు అన్నీ కూడా నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. దాతలు తమ ఉదారమైన విరాళాలతో అందిస్తున్న సహకారానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ రాబోయే సంవత్సరంలో కూడా ఇదే సహకారాన్ని అందించాలని కోరారు. మరింత మెరుగైన సేవలు అందిస్తూ ఊహించుకున్న అంచనా లను మించి రాబోయే కాలంలో మంచి పురోగతి కనబరచాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. అనంతరం రెడ్ క్రాస్ క్యాన్సర్ బ్లాక్ కు, సంస్థ కు విరాళాలు అందించిన దాతలు, అధికారులు అడపా వెంకట లక్ష్మి, ప్రత్తిపాడు తహశీల్దార్ సూర్య ప్రభ, సామర్ల కోట ఎంపీడిఓ కె. హిమామహేశ్వరీ, కాన్సర్ హాస్పిటల్ నిర్మాణానికి విరాళాలు అందించిన దాతలు ఐటిఎస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కాసిన వెంకటేశ్వర రావు, పాలడుగు సుబ్రహ్మణ్యం, పైడా వెంకట నారాయణ సుశీల రాఘవ రత్నమ్మ అకాడమీ అఫ్ ఎడ్యుకేషన్, వైడి.రామా రావు కుటుంబసభ్యులు, ఎన్.శృతి రెడ్డి, రక్త దాన శిబిరాలు ఏర్పాటు చేసి సహకరించిన ఈటీసీ సామర్లకోట అధికారులకు జిల్లా కలెక్టర్ పురస్కారాలు ప్రధానం చేసారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి ఎన్వీవీఆర్. ప్రసాద్ బాబు, కార్యవర్గ సభ్యులు జీవిత సభ్యులు సంస్థ కార్యదర్శి కె.శివ కుమార్ వందన తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)