ఆదివారం, 01 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తుపాను దెబ్బకు తీవ్రంగా నష్టపోయాం..ఆదుకోండి : కేంద్ర బృందానికి రైతుల ఆవేదన

1 గంట క్రితం

We have suffered severe losses due to the cyclone please help us Farmers plea to the central team
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 01, 2026, 04:03 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.35 వేల వరకు పెట్టుబడి పెట్టామని వెల్లడి

పెట్టుబడి రాయితీ, పంటల బీమా త్వరగా వర్తింపజేయాలని వినతి


ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి : అర్నబ్ తుపాను ప్రభావంతో చేతికందే సమయంలో వరి పంట పూర్తిగా దెబ్బతిని తీవ్రంగా నష్టపోయామని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని తాళ్లరేవు, కాజులూరు మండలాల రైతులు కేంద్ర అంతర్ మంత్రిత్వ శాఖల బృందానికి విన్నవించారు. వరి సాగు కోసం ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.35 వేల వరకు పెట్టుబడి పెట్టామని, పంట కోతకు వచ్చే సమయంలో తుపాను కారణంగా పొలాల్లో నీరు చేరి, ఈదురుగాలులకు వరి చేను నేలవాలడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు.అర్నబ్ తుపాను కారణంగా కాకినాడ జిల్లాలో వ్యవసాయ, ఇతర రంగాలకు జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర అంతర్ మంత్రిత్వ శాఖల బృందం ఆదివారం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ (ఐఎస్-II) చిత్తరంజన్ దాస్ నేతృత్వంలోని బృందం తాళ్లరేవు మండలం పోలేకుర్రు, బాపనపల్లి, కాజులూరు మండలం కొలంక గ్రామాల్లో పర్యటించి దెబ్బతిన్న వరి పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించింది.ఈ సందర్భంగా పొలాల్లో చేరిన ముంపు నీటిని, ఈదురుగాలుల ప్రభావంతో నేలవాలిన వరి చేలను, దెబ్బతిన్న వరి కంకులను పరిశీలించిన బృంద సభ్యులు పంట నష్టానికి సంబంధించిన వివరాలను వ్యవసాయ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతులతో నేరుగా మాట్లాడి సాగు పెట్టుబడులు, పంట నష్టపోయిన విస్తీర్ణం, దిగుబడిపై ప్రభావం తదితర వివరాలను సేకరించారు.

011


తుపాను వల్ల కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారని రైతులు కేంద్ర బృందం దృష్టికి తీసుకువచ్చారు. ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.35 వేల వరకు పెట్టుబడి పెట్టి సాగు చేశామని, పంట చేతికొచ్చే సమయంలో తుపాను ముంచెత్తడంతో పెట్టుబడి మొత్తం నష్టపోయామని తెలిపారు. పశువులకు మేత కూడా దొరకని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండోమెంట్ భూములకు సంబంధించి శిస్తు రద్దు చేయాలని కోరారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందించాలని విజ్ఞప్తి చేశారు. పంట నష్టపోయిన రైతులకు పెట్టుబడి రాయితీతోపాటు పంటల బీమా పరిహారాన్ని త్వరితగతిన అందించాలని రైతులు కోరారు. ధాన్యం కొనుగోలులో నాణ్యతా ప్రమాణాలను సడలించి, రంగుమారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉచిత పంటల బీమా పథకాన్ని వర్తింపజేయాలని, లేనిపక్షంలో రైతులు చెల్లించాల్సిన రూ.760 ప్రీమియం మొత్తాన్ని తగ్గించాలని కోరారు. స్వర్ణ రకానికి సమానంగా దిగుబడినిచ్చే, చేను పడిపోని సన్న వరి రకాలను రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.


022


వివిధ శాఖల నష్టాలపై ఆరా .....

వ్యవసాయ రంగంతోపాటు విద్యుత్, రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలకు తుపాను కారణంగా జరిగిన నష్టాలను కూడా కేంద్ర బృందం పరిశీలించింది. ఆయా శాఖల అధికారులు నష్టాల వివరాలు, పునరుద్ధరణ చర్యలు, రైతులకు, బాధితులకు అందిస్తున్న సహాయక చర్యలను వివరించారు. వాస్తవ పరిస్థితుల ఆధారంగా నష్టాన్ని శాస్త్రీయంగా అంచనా వేసి నివేదిక రూపొందించడంపై బృందం దృష్టి సారించింది. ఈ కేంద్ర బృందంలో వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ అదనపు అభివృద్ధి కమిషనర్ ప్రశాంత్ అర్మోరికర్, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వ్యయ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ హిమాలయ గార్గ్, కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ డిప్యూటీ డైరెక్టర్ ప్రణయ్ గార్గ్ సభ్యులుగా ఉన్నారు. ఈ పర్యటనలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్, కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, వ్యవసాయ, రెవెన్యూ, ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్